Business

దలాల్ కుదేల్

Dalal Street Collapsed On Thursday Trading

దలాల్‌ స్ట్రీట్‌ మళ్లీ బేర్‌మంది. అమ్మకాల ఒత్తిడితో వరుసగా రెండో రోజు పతనమైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా ఆగస్టు డెరివేటివ్‌ సిరీస్‌ను సూచీలు నష్టాలతో ముగించాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాల్లోని దిగ్గజ షేర్లలో అమ్మకాలు దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు నష్టాలతో ప్రారంభించాయి. 200 పాయింట్లు పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించిన సెన్సెక్స్‌ ఆ తర్వాత మరింత పతనమైంది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా దిగజారి రోజు కనిష్ఠానికి పడిపోయింది. చివరకు కాస్త కోలుకున్నా నష్టాలు తప్పలేదు. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 383 పాయింట్లు పతనమై 37,069 వద్ద, నిఫ్టీ 98 పాయింట్ల నష్టంతో 10,948 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.76గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్ఈలో సన్‌ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్టీపీసీ షేర్లు స్వల్పంగా లాభపడగా.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ షేర్లు కుదేలయ్యాయి.