Politics

అమరావతి తరలింపు ఖాయం-GVL జ్యోతిష్యం

GVL Narasimha Rao Confirms Shifting Of Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించే ఉద్దేశం.. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కు లేదని… ఢిల్లీలోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో.. అధికార ప్రతినిధి హోదాలో మీడియా సమావేశం పెట్టి మరీ.. జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. పలుమార్లు ఈ విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమాచారం తనకు ఎలా తెలిసిందో మాత్రం బయట పెట్టలేను కానీ.. బీజేపీ అధికార ప్రతినిధిగా.. తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. ఆయన తేల్చి చెప్పేశారు. ఆ నివేదికలో రాజధాని మార్పు గురించి జగన్ చెప్పారా..? కొద్ది రోజుల కిందట.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఆ సమయంలో..రాజధానిపై… ఓ ప్రత్యేకమైన నివేదికను..మోడీకి సమర్పించినట్లుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో… అటు రాష్ట్రం కానీ.. ఇటు కేంద్రం కానీ.. ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మాజీ మంత్రి యనమల లాంటి వాళ్లు.. డాక్యుమెంట్ పబ్లిక్ ప్రాపర్టీ అని.. బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ నివేదికలో…ఏపీ రాజధాని అమరావతి 80 శాతం ఒకే సామాజికవర్గం చేతిలో ఉందని.. అక్కడ కొనసాగించడం మంచిది కాదని … మారుస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధికార ప్రతినిధిగా.. జీవీఎల్‌కు.. జగన్మోహన్ రెడ్డి .. ప్రధాని మోదీకి ఇచ్చిన నివేదికకు సంబంధించిన స్పష్టమైన సమాచారం అందిందని… అందుకే .. మీడియా సమావేశం పెట్టి మరీ ఈ విషయాన్ని ప్రకటించారని అంటున్నారు… రాజధాని మార్పునకు బీజేపీ సానుకూలమే..!? ఒక సామాజికవర్గం లాభపడుతుందన్న కారణం చెప్పి.. రాజధాని మార్చలేరు కాబట్టి ముంపు లేకపోయినా.. ముంపు ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. అదే విధంగా ఖర్చు కూడా ఎక్కువ అవుతుందంటున్నారు. ఈ రెండు కారణాలకు జీవీఎల్ తన మద్దతు తెలిపారు. రాజధాని తరలింపు నిర్ణయానికి పరోక్షంగా.. తమ మద్దతు ఉంటుందని కూడా తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో.. అమరావతిలో ఏ నిర్మాణమూ జరగలేదని… జీవీఎల్ చెప్పుకొచ్చారు. కేంద్రం ఇచ్చిన పదిహేను వందల కోట్లతో… తాత్కాలిక నిర్మాణాలే ఉన్నాయన్నారు. నిజానికి ఏపీ రాజధానిలో… సెక్రటేరియట్, హైకోర్టు పని చేయడం ప్రారంభించాయి. ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల ఇళ్లు నిర్మాణ అయ్యాయి. ఓ రకంగా.. అక్కడ 30వేల కోట్లకుపైగా వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. ఇవన్నీ… జీవీఎల్ నరసింహారావుకు తెలియనివి కావు. అయినప్పటికీ.. అక్కడ ఏమీ లేనందునే.. ఇప్పుడు తరలింపు అంశం చర్చకు వస్తోందని అంటున్నారు. చంద్రబాబు నాలుగేళ్లలో అన్నీ కట్టేసి ఉంటే.. ఈ సమస్య ఉండేది కాదన్నారు. కేంద్రానికి సంబంధం లేదనే వాదన వినిపిస్తున్న జీవీఎల్…! ఏపీలో తిరిగే భారతీయ జనతా పార్టీ నేతలు ఏం చెప్పినప్పటికీ… జీవీఎల్ నరసింహారావు చెప్పిందే.. భారతీయ జనతా పార్టీ విధానం. ఆ పార్టీ చెబుతున్న దాని ప్రకారం..రాజధాని తరలింపు ఖాయం. ఆ విషయాన్ని త్వరగా తేల్చాలని.. నాన్చవద్దని కూడా జీవీఎల్ .. చెప్పుకొచ్చారు. అదే సమయంలో.. కేంద్రానికి ఏ సంబంధమూ లేదని.. కూడా జీవీఎల్ తేల్చేశారు. ప్రధానికి నివేదిక ఇవ్వడమూ..కేంద్రానికి చెప్పే అన్నీ చేస్తున్నామన్నట్లుగా.. విజయసాయిరెడ్డి ప్రకటించడం వంటి కారణాలతో … రాజధాని మార్పుతో ఏమైనా తేడా వస్తే.. తమపై విమర్శలు రాకుండా… బీజేపీ ముందుగానే జాగ్రత్త పడుతోందని… అనుకోవచ్చు.