Devotional

దసరా ఉత్సవాలపై సమీక్ష

Dasara 2019 Arrangements In Indrakeelaadri Vijayawada

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగబోయే దసరా ఉత్సవాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కృష్ణా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌తో కలిసి ఉత్సవ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదిరోజుల పాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలను సజావుగా నిర్వహించేందుకు గత 15 రోజుల నుంచి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. అక్టోబరు 5వ తేదీన ఏపీ సీఎం జగన్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నందున.. ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. వివిధ శాఖలు, విభాగాలకు చెందిన 12 వేల మంది ఈ ఉత్సవాల కోసం పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా 5,500 మంది పోలీసులు ఉత్సవ బందోబస్తులో పాల్గొంటున్నారన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం మెరుగు పరిచేందుకు 750 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. కృష్ణానదిలో ప్రవాహం ఎక్కువగా ఉన్నందున.. స్నానఘట్టాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. 175 సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతున్నట్లు వివరించారు. భక్తులకు అందజేసే ఉచిత ప్రసాదాలను ఆహార కల్తీ నియంత్రణ విభాగం అధికారులు ప్రతిరోజు తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.