WorldWonders

భారత విపణిలోకి లాంబోర్గిని ఈవో స్పైడర్

Lamborghini huracan evo spyder released in India with a price tag of 4Crores

ప్రముఖ ఇటాలియన్‌ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని హరికేన్‌ ఈవో స్పైడర్‌ కారును భారత్‌లో విడుదల చేసింది. మార్కెట్‌లో దీని ధర రూ.4.1 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ రోజు నుంచే (అక్టోబర్‌10) కారు అమ్మకాలు ప్రారంభమైనట్లు తెలిపింది. కూపే వేరియంట్‌ విడుదల చేసిన 8 నెలల్లో హరికేన్‌ ఈవో స్పైడర్‌ భారత్‌లోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఎలక్ట్రో హైడ్రాలిక్‌ రూఫ్ ఫోల్డింగ్‌ వ్యవస్థ ఈ కారులో ఉంది. ఇది కారు 50 కిలోమీటర్ల వేగం దాటిన తర్వాత ఆటోమెటిక్‌గా 17 సెకండ్లలో రూఫ్‌ను మడతపెట్టేస్తుందని కంపెనీ తెలిపింది. సాధారణ కూపేతో పోలిస్తే హరికేన్‌ ఈవో స్పైడర్‌ 120 కేజీల అధిక బరువు ఉంటుంది. ఇందులో 5.2 లీటర్‌ కూపే వెర్షన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8,000 ఆర్‌పీఎం వద్ద 631 బీహెచ్‌పి శక్తిని, 6,500 ఆర్‌పీఎం వద్ద 600 న్యూటన్‌ మీటర్‌ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 3.1 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కారులో 8.4 అంగుళాల టచ్‌స్క్రీన్‌ను అమర్చారు. ఇందులో ఆపిల్‌ కార్‌ప్లే, వాయిస్‌ కమాండ్‌ సిస్టం, డ్యూయల్‌ కెమెరా టెలిమెట్రీ వ్యవస్థ, అధిక సామర్థ్యం ఉన్నహార్డ్‌డిస్క్‌ను అమర్చారు. కారు 20 అంగుళాల పిరెల్లి పి జీరో టైర్స్‌ను కలిగి ఉంటుంది. వీటితో పాటు కారులో బాడీ రంగును పోలిన బంపర్స్‌, రియర్‌ వింగ్స్‌, ఎయిర్‌ ఇన్‌టేక్స్‌ అమర్చారు. కారుతో పాటు ముంబైలో ఓ కొత్త షోరూంను కూడా కంపెనీ ప్రారంభించింది.