Business

TCS లాభం ₹8042కోట్లు

Telugu Latest Business News | TCS Announces 2019 Q2 Earnings With 8042Crores Profit

దేశీయ ఐటీరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) సెప్టెంబర్‌ 30తో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. జులై- సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఆ కంపెనీ ఏకీకృత నికర లాభం 1.8 శాతం పెరిగి.. రూ.8,042 కోట్లు ఆర్జించింది. గతేడాది ఇదే సమయానికి రూ.7,901 కోట్లు పొందినట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో ఆ కంపెనీ తెలిపింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.38,977 కోట్లు ఆదాయం పొందింది. గతేడాదితో పోల్చినప్పుడు 5.8 పెరిగింది. గతేడాది రూ.36,854 కోట్ల ఆదాయం నమోదు చేసింది. త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా టీసీఎస్‌ ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించింది. రూపాయి ముఖవిలువ కలిగిన ఈక్విటీ షేరుపై రూ.5 రెండో మధ్యంతర డివిడెండ్‌తో పాటు అదనంగా రూ.40 ప్రత్యేక డివిడెండ్‌ అందించనుంది. అందుకు బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఆర్థిక సేవల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ ఈ త్రైమాసికాన్ని స్థిరమైన వృద్ధితో ముగించామని టీసీఎస్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథ్‌ తెలిపారు. తమ సేవలకు మధ్యస్థ, దీర్ఘకాలంలో డిమాండ్‌ కొనసాగుతుందన్న నమ్మకంతో ఉన్నామని చెప్పారు. క్యూ2 ఆర్డర్‌ బుక్‌ అందుకు సాక్ష్యమన్నారు. గత ఆరు త్రైమాసికాలతో పోల్చినప్పుడు ఇదే అత్యధికమని పేర్కొన్నారు.