DailyDose

కల్కి ఆశ్రమాలపై ఐటీ దాడులు-తాజావార్తలు-10/16

Telugu Breaking News | IT Raids On Kalki Ashram

* రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో అమెరికా కాన్సుల్‌ ప్రతినిధుల భేటీ. మర్యాదపూర్వకంగా గవర్నర్‌తో సమావేశమైన అమెరికా కాన్సుల్‌ జనరల్‌ రీఫ్‌మెన్‌, ఇతర సభ్యులు. ఇరుదేశాల్లోని గవర్నర్‌ వ్యవస్థలపై కాన్సుల్‌ సభ్యులు, గవర్నర్ మధ్య ఆసక్తికర చర్చ.

* అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. గత 40 రోజులుగా రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కొనసాగుతున్న వాదనలకు ఇవాళ్టితో తెరపడింది. తీర్పును సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. విచారణ సందర్భంగా ఈరోజు ఉదయం ఇద్దరు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. చేనేత కార్మిక కుటుంబాలకు రూ.24వేల సాయం, మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయం రూ.10వేలకు పెంపు తదితర కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

* ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సూచనల నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానుండటంతో ఆర్టీసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. జిల్లాల్లో నూరు శాతం బస్సుల్ని నడుపుతున్నా.. హైదరాబాద్‌లో మాత్రం 40శాతం బస్సులు మాత్రమే నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు మంత్రికి తెలిపారు.

* గత 15సంవత్సరాల్లో భారత్‌ సగటున దాదాపు ఏడు శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటు సాధించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. 1990తర్వాత పేదరికం రేటు దాదాపు సగానికి పడిపోయిందని వెల్లడించింది. పర్యావరణ మార్పులు, పేదరిక నిర్మూలన, ప్రపంచ దేశాల వృద్ధి రేటు పెరుగుదలకు అంతర్జాతీయంగా కొనసాగుతున్న కృషిలో భారత్‌ పాత్ర ఎనలేనిదని ఈ నివేదికలో కొనియాడింది.

* ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఐకాస ప్రకటించింది. భవిష్యత్‌ కార్యాచరణపై సమావేశమైన ఐకాస నేతలు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. చర్చల పేరుతో ప్రభుత్వం మైండ్‌ గేమ్‌ ఆడుతోందని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

* మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారం తారస్థాయికి చేరుకుంది. నేతలు మాటల్లో పదును పెంచారు. రాష్ట్రంలోని అకోలాలో ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. ‘కాంగ్రెస్‌-ఎన్సీపీది అవినీతి పొత్తు. దశాబ్ద కాలంగా మహారాష్ట్రను అణగదొక్కింది ఆ రెండు పార్టీలే. ఇక అవన్నీ కుదరవు’ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

* అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆ రాష్ట్ర ప్రజలకు ఓ కానుకను అందజేశారు. రాష్ట్రంలోని ప్రజలకు ‘ఖాద్య సాథీ’ పథకం వర్తించేలా చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని 8.5 కోట్ల మంది ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఈ పథకాన్ని అమలు చేస్తామని మమత తెలిపారు.

* కల్కి భగవాన్‌ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడిన అధికారులు చిత్తూరు జిల్లా వరదాయపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఏకం గోల్డెన్‌ సిటీ (కల్కి భగవాన్‌ ఆశ్రమం)లో ఈ సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లోని ఆ ఆశ్రమానికి సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

* ఒకప్పుడు భారత ద్విచక్ర వాహన మార్కెట్‌ను ఏలిన బజాజ్‌ చేతక్‌ స్కూటర్‌ ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌కు సిద్ధమైంది. సరికొత్త రూపంలో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు బజాజ్‌ ఏర్పాట్లు చేసింది. ఈ సారి ఎలక్ట్రిక్‌ వాహనంగా ఇది వినియోగదారులను పలకరించనుంది. ఈ స్కూటర్‌ విశేషాలను బుధవారం బజాజ్‌ వెల్లడించింది. దీనిని బజాజ్‌ చకన్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు.

* పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర బ్యాంక్‌(పీఎంసీ) అవకతవకలపై దాఖలైన పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. పీఎంసీ బ్యాంకులో పొదుపు చేసుకున్న 15లక్షల మందికిపైగా వినియోగదారులకు రక్షణ కల్పించాలని. వారి సొమ్ముపై పూర్తి బీమా కల్పించాలని కోరుతూ బిజోన్‌ మిశ్రా అనే వ్యక్తి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అత్యవసరంగా విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.