ScienceAndTech

భారతదేశ బయోటెక్ రంగానికి చుక్కాని-బయోకాన్

The rise of Indian biotech field via Biocon and Kiran Majumdar Shah

వ్యాపార ప్రపంచంలో పురుషాధిపత్యం కొనసాగుతున్న తరుణంలో తనదైన ముద్ర వేసిన ధీర వనిత కిరణ్‌ మజుందార్‌ షా. మహిళలు ఇంటికే పరిమితమైన రోజుల్లో సామాజిక అడ్డుగోడల్ని బద్దలుకొట్టి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. స్వతంత్ర ఆలోచనలతో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఔషధ రంగంలో అద్భుతాలను ఆవిష్కరించి నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘బయోటెక్ క్వీన్‌’గా చరిత్ర సృష్టించిన ఆమె జీవిత విశేషాలు..

బెంగళూరులో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో కిరణ్‌ మజుందార్‌ షా జన్మించారు. తండ్రి రసేంద్ర కుమార్‌ మజుందార్‌ షా ఓ ప్రముఖ మద్యం తయారీ సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌. కిరణ్‌ బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రంలో బీఎస్సీ చేశారు. డాక్టర్‌ కావాలన్నది ఆమె చిన్ననాటి కల. కానీ, ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రవేశం దొరకలేదు. నిరాశలో కూరుకుపోయిన కూతురికి తండ్రి అండగా నిలిచారు. కోరుకున్నది దొరకనప్పుడు.. దొరికిందాంట్లోనే అద్భుతాలు సృష్టించాలని హితబోధ చేశారు. అప్పటికే తాను రాణిస్తున్న బ్రూవరీ రంగంలో పీజీ చేయాలని రసేంద్ర కుమార్‌ సలహా ఇచ్చారు. నాటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా అసాధారణ, సాహసోపేతమైన పని. వినూత్నంగా ఉండాలన్న తండ్రి సూచనతో ఫెర్మెంటేషన్‌ సైన్స్‌లో పీజీ చేయాలని నిర్ణయించుకున్నారు. నాటి తండ్రి సలహాలు, కిరణ్‌ ధైర్యవంతమైన నిర్ణయమే నేడు జీవ సాంకేతికతలో భారత్‌ను ముందు వరుసలో నిలిపాయి. అలా ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్‌ విశ్వవిద్యాలయంలో మాల్టింగ్‌ అండ్‌ బ్రూవింగ్‌లో పట్టా పొందారు. భారత్‌ నుంచి బ్రూవింగ్ విభాగంలో పట్టా పొందిన తొలి మహిళ కిరణ్‌ మజుందార్ షానే కావడం విశేషం.

బ్రూవింగ్‌ విభాగంలో ఉన్న అవగాహనతో ఏదైనా ఉద్యోగంలో చేరాలన్న ఆకాంక్షతో కిరణ్‌ 1975లో స్వదేశానికి తిరిగొచ్చారు. కానీ, ఎక్కడికెళ్లినా ఆమెకు నిరాశ తప్పలేదు. మగువలకు ఈ ఉద్యోగం ఎందుకంటూ నిరాశాపూరితంగా మాట్లాడారు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తన చదువంతా నిరుపయోగం అవుతుందేమోనని భయం. కానీ, తండ్రి మళ్లీ ఆమెలో స్ఫూర్తి నింపారు. మద్యం కంపెనీలకు సలహా సంప్రదింపులిచ్చే సంస్థని స్థాపించమని వెన్ను తట్టారు. అలాగే ప్రారంభించారు. ఈ ప్రయాణంలో దేశంలోని బ్రూవరీ సంస్థల్ని కూలంకషంగా అధ్యయనం చేశారు. జీవ సాంకేతికత రంగంలో పాశ్చాత్య ప్రపంచంలో మార్పులను కిరణ్‌ ఆసక్తిగా గమనించారు. మద్యం, ఔషధాలు, ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ఎంజైముల ప్రాధాన్యాన్ని గుర్తించారు. దీనిపై అధ్యయనానికి ఐర్లాండ్‌కు వెళ్లారు. అక్కడ బయోకాన్‌ కెమికల్స్‌ అధినేత ఆచిన్‌ క్లోస్‌తో పరిచయం కిరణ్‌ జీవితాన్నే మార్చేసింది.

ఆచిన్‌ క్లోస్‌ 1977లో భారత్‌ పర్యటనకు వచ్చారు. బ్రూవరీ విభాగంలో కిరణ్‌కు ఉన్న లోతైన అవగాహన.. జీవ సాంకేతికత రంగంపై ఆమెకున్న ఆసక్తిని గమనించారు. ఇండియాలో ‘బయోకాన్‌’ని స్థాపించాలన్న తన నిర్ణయాన్ని ఆమెతో పంచుకున్నారు. తన వ్యాపారంలో భాగస్వామిగా చేరాలని కోరారు. కానీ, ఈ పురుషాధిపత్య ప్రపంచంలో తాను నెగ్గగలనా అని ఆమె సంకోచించారు. కానీ, ఆచిన్‌ క్లోజ్ ఇచ్చిన ధైర్యంతో ముందడుగు వేశారు. ఐర్లాండ్‌ వెళ్లి బయోకాన్‌ కెమికల్స్‌లో కొన్ని రోజుల పాటు ట్రైనీ మేనేజర్‌గా చేరి ఈ రంగంలో మెలకువలు నేర్చుకున్నారు. అనంతరం భారత్‌కు తిరిగి వచ్చి 1978లో ‘బయోకాన్‌ ఇండియా’ పేరిట ఎంజైమ్‌ల తయారీ స్టార్టప్‌ని స్థాపించారు. బెంగళూరులోని ఓ కారుషెడ్డునే కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అప్పుడున్న కఠిన నిబంధనల వల్ల కేవలం 30శాతం విదేశీ పెట్టుబడులనే ప్రభుత్వం అనుమతించింది. దీంతో షానే మిగిలిన 70శాతం నిధుల్ని సమకూర్చుకున్నారు. తన బ్యాంకు ఖాతాలోని రూ.10వేలను తొలి పెట్టుబడిగా వాడేశారు.

ఓ మహిళ ఎంజైమ్‌ల వ్యాపారం ప్రారంభిస్తున్నారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. తన వద్ద ఉద్యోగం చేయడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. తొలి ఉద్యోగిని నియమించుకోవడానికి దాదాపు 30నుంచి 40మంది ఆమె సంప్రదించారు. చివరకు కొంతమంది ఆసక్తిగల యువకుల బృందం ముందుకు రావడంతో ఆమెకు ఉద్యోగుల వేట తప్పింది. ఇక పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అప్పట్లో మహిళ అంటేనే ఒక చిన్నచూపు. ఏ సంస్థ ఆమెని నమ్మలేదు. చివరకు కర్ణాటక స్టేట్‌ ఫినాన్స్‌ కార్పొరేషన్‌ రుణం ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో ఆమె పెట్టుబడి కష్టాలూ తప్పాయి. వీటికి తోడు.. నాణ్యమైన ఎంజైమ్‌ల తయారీకి అత్యంత నాణ్యమైన నీరు, నైపుణ్యం గల ఉద్యోగులు, కోతల్లేని విద్యుత్తు చాలా అవసరం. ఆ రోజుల్లో వీటిని సమకూర్చుకోవడం కూడా కిరణ్‌కి సవాల్‌గా నిలిచాయి. కానీ, ఎలాంటి సంక్షోభాలకు చలించకుండా తన విలక్షణ వ్యక్తిత్వంతో సవాళ్లన్నింటిని అధిగమించారు. సంవత్సరం తిరగకుండానే బయోకాన్‌ను భారత్‌లో తొలి ఎంజైమ్‌ల తయారీ సంస్థగా నిలిచింది. అమెరికా సహా ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ సంస్థ ఎదిగింది. అలా తొలి సంవత్సరంలో వచ్చిన లాభాలతో 1980లో హోసూరులో 20ఎకరాల స్థలాన్ని కొని పూర్తి స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించారు. తదనంతర కాలంలో దాన్నే తన కలల సామాజ్యానికి కేంద్రంగా మార్చారు.

ఎంజైమ్‌ల కంపెనీని పూర్తి స్థాయి జీవ ఔషధ ఉత్పత్తుల కంపెనీగా తీర్చిదిద్దారు. ఎంజైమ్‌ల తయారీ సంస్థని ఇన్సులిన్ కంపెనీగా మార్చారు. మధుమేహం, క్యాన్సర్‌, గుండె సంబంధిత సమస్యల నివారణ ప్రయోగాలపై దృష్టి సారించారు. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండెపోటును దరిచేరనీయని జీవ రక్షకాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టి బయోకాన్‌ సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అనేక రకాల జీవ ఔషధాల తయారీలో బయోకాన్‌ని ప్రపంచంలోనే మేటి సంస్థగా నిలిపారు. మనుషులకు మరణ శాసనాలు లిఖిస్తున్న ప్రమాదకర వ్యాధుల నుంచి ప్రజల్ని కాపాడాలన్న సత్సంకల్పంతో సింజిన్‌ పేరుతో పరిశోధనా సంస్థను స్థాపించారు. ఔషధాలను మార్కెట్‌లోకి తెచ్చే ముందే వాటిని జీవాలపై ప్రయోగించి ఫలితాల నిర్ధరణకు క్లీనిజిన్‌ అనే మరో సంస్థని నెలకొల్పారు. ఇలా అనేక ప్రమాదకర వ్యాధులపై బయోకాన్‌ చేస్తున్న పరిశోధనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఐర్లాండ్‌ బయోకాన్‌ బయోకెమికల్స్‌ తన వాటాని 1989లో యూనిలివర్‌కు విక్రయించారు. యూనిలివర్‌తో కలిసి సుదీర్ఘంగా ప్రయాణించిన బయోకాన్‌ ఇండియా ఎన్నో నూతన ఆవిష్కరణలకు తెరతీసింది. తదనంతర కాలంలో యూనిలివర్‌ కూడా తన వాటాల్ని ఇంపీరియల్‌ కెమికల్ ఇండస్ట్రీస్‌(ఐసీఐ)కు విక్రయించింది. తన భర్త జాన్‌ షా సహకారంతో 1998లో ఐసీఐ వద్ద ఉన్న బయోకాన్‌ వాటాల్ని పూర్తిగా కొనుగోలు చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే కిరణ్‌కి, జాన్‌ షాకి వివాహం కావడం విశేషం. ఇక ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి సలహాతో బయోకాన్‌ని కిరణ్‌ 2004లో ఐపీఓకి తీసుకెళ్లారు. బయోకాన్‌ ఐపీఓ 33శాతం ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడం అప్పట్లో ఓ సంచలనం. అలా స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన తొలి రోజే 1.1బిలియన్‌ డాలర్లు మార్కెట్‌ విలువను సాధించింది. తొలి రోజు 1బిలియన్ డాలర్ల మార్క్‌ దాటిన రెండో భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. అలా వచ్చిన మొత్తాన్ని పరిశోధన రంగంలో వెచ్చించారు.

డాక్టర్‌ కావాలన్న తన చిన్ననాటి కల నెరవేరనప్పటికీ..పేదలకు ఆరోగ్య సేవలు అందించాలన్న ఆశ మాత్రం పోలేదు. నారాయణ హృదయాలతో కలిసి ‘ఆరోగ్య రక్ష యోజన’ అనే పథకానికి శ్రీకారం చుట్టారు. దీంతో కేవలం సంవత్సరానికి రూ.120చందాతో కర్ణాటకలోని అనేక గ్రామాల్లో వైద్య సేవల్ని అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్లిష్టమైన ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేస్తున్నారు. ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. తక్కువ ఖర్చుతో శస్త్ర చికిత్సలు, మందులు అంజేస్తున్నారు. అలాగే పుట్టిన పెరిగిన నగరంపై ప్రేమతో బెంగళూరులోని రోడ్లను పచ్చదనంతో నిండేలా చర్యలు చేపట్టారు. అనేక ప్రాంతాల్లో చెట్లు నాటించి ప్రకృతి పరిరక్షణకు పాటుపడుతున్నారు. మజుందార్‌ షా మెడికల్‌ ఫౌండేషన్‌ని నెలకొల్పి క్యాన్సర్‌ నివారణ ప్రయోగాలపై దృష్టి సారించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయిస్తున్నారు.

ఇలా తన అసాధారణ ప్రతిభతో జీవ సాంకేతిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కిరణ్‌ మజుందార్‌ షా సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది. 1989లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్‌తో సత్కరించింది. మహిళలు దేనిలోనూ తీసిపోరని నిరూపించిన ఈ ధీర వనిత.. సాటి మహిళలు గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు. తన సంస్థలో 35శాతం మంది పరిశోధకులు స్త్రీలే ఉన్నప్పటికీ.. నాయకత్వ స్థానాల్లో మాత్రం 10శాతానికే పరిమితం కావడంపై విచారం వ్యక్తం చేశారు. త్వరలో మరిన్ని కీలక రంగాల్లో మహిళలు రాణించాలని కోరుకుంటున్నారీ బయోటెక్ క్వీన్‌.