Editorials

తిరువూరు తెదేపా నేతలకు తలంటిపోసిన చంద్రబాబు–TNI ప్రత్యేకం

Chandrababu Slams Tiruvuru Telugu Desam Leaders In Review Meeting 2019-తిరువూరు తెదేపా నేతలకు తలంటిపోసిన చంద్రబాబు–TNI ప్రత్యేకం

తిరువూరు నియోజకవర్గంలో తెదేపాకు గ్రామస్థాయి నుండి మంచి కార్యకర్తలు ఉన్నప్పటికీ నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో నాలుగు సార్లు పార్టీ అభ్యర్థులు అక్కడ ఓటమి పాలయ్యారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తిరువూరు తెదేపా నాయకులపై విరుచుకుపడ్డారు. విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటరులో మంగళవారం రాత్రి పదిగంటల నుండి దాదాపు రెండున్నర గంటలపాటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆయన నాయకులు, కార్యకర్తల నుండి వివరాలు సేకరించారు. తిరువూరులో మూడుసార్లు స్వామిదాసును ఓడించారు. మొన్నటి ఎన్నికల్లో అప్పటి మంత్రి కొత్తపల్లి జవహర్‌ను నిలబెట్టినప్పటికి గెలిపించలేకపోయారు. మీరు మారకపోతే తిరువూరులో కొత్త నాయకత్వాన్ని తీసుకువస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా నాలుగు మండలాల నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం తిరువూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో పార్టీ బలంగా ఉందని వచ్చే స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు 90శాతం గెలుస్తారని చంద్రబాబు తెలిపారు. తిరువూరు మున్సిపాల్టీని ఖచ్చితంగా గెలుచుకుంటామని నాయకులంతా సమన్వయంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. సమీక్ష సందర్భంగా నాయకులను పక్కనబెట్టి చంద్రబాబు కార్యకర్తలతో సుదీర్ఘంగా మాట్లాడారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని సమన్వయకమిటీని మార్చాలని, వృద్ధనేతలను తప్పించాలని ఈ సందర్భంగా కార్యకర్తలు చంద్రబాబును కోరారు.

*** తిరువూరు ఇన్‌ఛార్జి గురించి తరువాత తేలుస్తా!
తిరువూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జి ఎవరనే విషయం తేలక నాయకులు, కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారని తక్షణమే పార్టీ ఇన్‌ఛార్జి ఎవరో తేల్చాలని పలువురు నేతలు ఈ సందర్భంగా చంద్రబాబును కోరారు. గతంలో లాగానే స్వామిదాసును నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కొనసాగించాలని ఆయన అనుచరులు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల వరకు స్వామిదాసు, జవహర్ కలిసి పనిచేయాలని అనంతరం ఇన్‌ఛార్జి వ్యవహారాల్ని పరిశీలిస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. తిరువూరు నియోజకవర్గం నుండి ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావడంతో అర్ధరాత్రి వరకు చంద్రబాబు వారితో హుషారుగానే గడిపారు. తిరువూరులో పార్టీలో పూర్వ వైభవం తీసుకొస్తామని ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబు చేతిలో చేయి వేసి మరీ చెప్పినట్లు సమాచారం.