DailyDose

₹5కోట్ల బహుమతులు ఇవ్వనున్న ఫోర్డ్ ఇండియా-వాణిజ్యం-12/06

Ford India Announces Midnight Suprise Sale-Telugu Business News-12/06

* ‘ఫోర్డ్‌ ఇండియా’ మరో మెగా సేల్‌ను ప్రారంభించింది. ‘మిడ్‌నైట్‌ సర్‌ప్రైజ్‌’ పేరుతో ప్రారంభించిన సేల్‌ డిసెంబర్‌ 6 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొంది. గత ఏడాది కూడా ఫోర్డ్‌ ఇవే తేదీల్లో సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సేల్‌ ఉదయం 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగుతుంది. పని దినాల్లో వినియోగదారులు పనిగంటల తర్వాత షోరూమ్‌కు వచ్చి వాహనాలను చూసుకొనే సౌకర్యం ఉంటుంది. ఈ సేల్‌లో కార్లను బుక్‌ చేసుకొన్న వినియోగదారులకు రూ.5కోట్లు విలువైన తప్పనిసరి బహుమతులను ఫోర్డ్‌ ప్రకటించింది. ఫోర్డు ప్రకటించిన బహుమతుల్లో ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్‌ మిషిన్‌లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్లు, మైక్రోవేవ్‌లు, సరికొత్త ఐపాడ్‌లు, ఐఫోన్‌ 11, బంగారు నాణేలు వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఏడు దినాలు, ఆరు రాత్రులు ఉండేలా లండన్‌ ట్రిప్‌ కూడా ఉంది. ఈ ఆఫర్‌ ఫోర్డు ఫిగో, ఆస్పైర్‌, ఫ్రీస్టైల్‌, ఎకోస్పోర్ట్‌, ఎండీవర్‌లపై ఉంది. దీంతో పాటు లక్కీడ్రా తీసి విజేతకు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వాహనాన్ని అందజేస్తారు. ఫిబ్రవరి 14వ తేదీన లక్కీడ్రా తీస్తారు.

* దేశీయ మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. ఆర్‌బీఐ ఎఫెక్ట్‌తో బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి. దీనికి తోడు వొడాఫోన్‌-ఐడియా మూసేస్తామనే వార్తలు మార్కెట్లను మరింత కలవరపెట్టాయి. ఫలితంగా నేటి ట్రేడింగ్‌లో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఈ జోరు ఎంతోసేపు నిలువలేదు. బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో ఒత్తిడికి గురైన సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 350 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 334 పాయింట్లు దిగజారి 40,445 వద్ద, నిఫ్టీ 97 పాయింట్ల నష్టంతో 11,921 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్‌ సహా ఆటో, ఫార్మా, లోహ, ఎనర్జీ, ఐటీ రంగాల షేర్లు డీలా పడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, గెయిల్‌ షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్‌-ఐడియా షేర్లు 5శాతానికి పైగా కుంగాయి.

* ఎంజీ మోటార్‌ ఇండియా విద్యుత్‌ కారు మోడల్‌ ‘జడ్‌ఎస్‌’ను గురువారం ప్రదర్శించింది. జనవరి నుంచి 5 నగరాల్లో (హైదరాబాద్‌, దిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు) ఈ కారు విక్రయాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ‘హెక్టార్‌ తర్వాత కంపెనీ విడుదల చేసిన రెండో కారు ఇది. వాహన పరిశ్రమ భవిష్యత్‌ అంతా విద్యుత్‌ విభాగానిదేనని విశ్వసిస్తున్నాం’ అని ఎంజీ మోటార్‌ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ చాబా పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విద్యుత్‌ కార్లను తీసుకొస్తామని, జడ్‌ఎస్‌ కేవలం ప్రారంభం మాత్రమేనని తెలిపారు. 143 పీఎస్‌ శక్తితో నడిచే ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో 300 కి.మీ ప్రయాణం చేయొచ్చు. కంపెనీ గుజరాత్‌లోని హలోల్‌ ప్లాంట్‌ నుంచి జడ్‌ఎస్‌ను ఉత్పత్తి చేస్తోంది.

* దేశవ్యాప్తంగా వసూలయ్యే పన్నుల ఆదాయాన్ని కేంద్రం ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాలు ఏవిధంగా పంచుకోవాలో తెలియజేసే ప్రణాళికతో కూడిన 15వ ఆర్థిక సంఘం తొలివిడత నివేదిక కాపీ నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు చేరింది. ఈ నివేదికను ఎన్‌కే సింగ్‌ నేతృత్ంలోని 15వ ఆర్థిక సంఘం సభ్యులు దీనిని తనకు అందజేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 2020-21 సంవత్సరాన్ని దృష్టిలోపెట్టుకొని ఈ నివేదికను తయారు చేశారు. దీనిని నేడు పార్లమెంట్‌లో కూడా ప్రవేశపెట్టనున్నారు. గత నెల 15వ ఆర్థిక సంఘం జీవితకాలాన్ని మరోఏడాది పాటు పొడిగించారు. జమ్ముకశ్మీర్‌ పునర్‌వ్యస్థీకరణ జరగడంతో ఈ సంఘం గతంలో చేసిన ప్రతిపాదనల్లో మార్పులు చేసేందుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ సంఘం పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు 2020 అక్టోబర్‌ 30 వరకు గడువు ఉంది. దీనిలో 2022 సంవత్సరం నుంచి 2026 వరకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య పన్నుపంపిణీలపై ఇది నివేదిక ఇస్తుంది. దీంతోపాటు రాష్ట్రాల మధ్య నిధులను ఏవిధంగా పంచాలనే అంశంపై కూడా నివేదిక ఇవ్వనుంది.

* ‘వొడాఫోన్‌-ఐడియా’ భవిష్యత్తుపై ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు రాకపోతే ‘వొడాఫోన్‌-ఐడియా’ మూసేయాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. శుక్రవారం దిల్లీలో జరిగిన హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్‌2019లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థ 6-7శాతం మధ్యలో వృద్ధిరేటు నమోదు చేయాలంటే మరింత రుణసౌకర్యం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మరిన్ని బ్యాంకులకు లైసెన్స్‌ ఇవ్వాలని సూచించారు. పన్ను విధానాలపై కుమార్‌ మంగళం బిర్లా మాట్లాడుతూ జీఎస్‌టీ 15శాతం దిగువకు తీసుకొస్తే ఆర్థిక వ్యస్థకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం బలమైన ఉద్దీపనలను ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మరో 18 నుంచి 20 నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. ఆర్‌ఈసీపీలో భారత్‌కు వ్యతిరేకంగా నిబంధనలు ఉన్నాయని.. అందుకే ఆర్‌ఈసీపీలో చేరాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్లోబులైజేషన్‌ నుంచి రీజనలైజేషన్‌ వైపు మళ్లుతున్నామని కుమార్‌ మంగళం బిర్లా చెప్పారు. వొడాఫోన్‌ ఐడియా షేర్లు మార్కెట్లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 12.45 సమయంలో 3.42శాతం నష్టపోయి రూ.7.05 వద్ద కొనసాగుతున్నాయి.