Devotional

కర్నూలు జిల్లా ఆలయాల వద్ద పార్కింగ్ దోపిడీ

Kurnool District Temples Collecting Illegal Parking Charges

అక్రమార్జనకు అక్కడాఇక్కడా అనే తేడా ఉండటం లేదు దందాలరాయుళ్లకు… భగవంతుడి సన్నిధినీ అనధికార వసూళ్లకు ఆలవాలంగా మార్చేస్తున్నారు. భక్తితో స్వామిని కొలిచేందుకు వచ్చే ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ అడ్డదారుల్లో కుబేరులవుతున్నారు కొందరు పెద్ద మనుషులు. కర్నూలు జిల్లాలోని మద్దిలేటయ్య స్వామి, అహోబిలం, మహానంది క్షేత్రాల్లో టోల్‌గేట్‌ వసూళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. బేతంచెర్ల మండలం మద్దిలేటి స్వామి ఆలయంలో దోపిడీ మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ద్విచక్ర వాహనాలకు కూడా రూ.10 వంతున వసూలు చేస్తున్నారు. ఈ క్షేత్రంలో లారీకి రూ.150, మోటారు సైకిల్‌కు రూ.10, ఆటోకు రూ.40, ట్రాక్టరుకు రూ.100, డీసీఎం, ఆల్విన్‌ వాహనాలకు రూ.120, కారుకు రూ.100 వసూలు చేస్తున్నారు. ఇంత అధికంగా వసూలు చేసిన వారు వాహనాలను నిలిపేందుకు స్థలం చూపించి, వాటికి భద్రత కల్పించాలి. ఈ క్షేత్రంలో ఇవేమీ కన్పించడం లేదు. డబ్బులు వసూలు చేయడం మినహా వారికివేమీ పట్టడం లేదు. గత్యంతరం లేక భక్తులు తమ వాహనాలను దారి పక్కనున్న రైతుల పొలాల్లో నిలుపుతున్నారు. పంటలు వేసే కాలంలోనైతే రోడ్ల మీదే వాహనాలు నిలపాల్సిందే.

*** అహోబిలంలో ఆగని దోపిడీ
లక్ష్మీ నరసింహ స్వామి నవరూపాల్లో వెలసిన అహోబిలంలో అక్రమ వసూళ్లు బాహాటంగానే సాగుతున్నాయి. స్వామి దర్శనానికి వచ్చేవారివి రోజుకు కనీసం 100 వాహనాలు ఉంటాయి. శని, ఆదివారాల్లోనైతే ఈ సంఖ్య 300కు పైగానే ఉంటుంది. స్వాతి వేడుకల రోజైతే వందల వాహనాలు వస్తుంటాయి. కారుకు రూ.100, బస్సుకు రూ.150 నుంచి రూ.200, ఆటోకు రూ.50 ఇలా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ వాహనాల టోల్‌గేటు వసూళ్ల బాధ్యత పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతోంది. అహోబిలంలో ఉన్న స్థలాల్లో 80 శాతం అటు దేవస్థానానికో, ఇటు అటవీ శాఖకో చెందినవే. భక్తులు కూడా దేవస్థానాన్ని చూసి, స్వామికి పూజలు చేసేందుకే వస్తారు తప్ప అహోబిలం గ్రామం చూసేందుకు రారు. భక్తులు తమ వాహనాలను దేవస్థాన స్థలంలో నిలుపుతారు. ఎగువ అహోబిలంలోనైతే అటవీ ప్రాంతంలో నిలుపుతారు. అయినా కూడా పంచాయతీ వారు వాహనాలకు రోజుకు వేల రూపాయలను టోల్‌గేటు రూపంలో భక్తుల నుంచి వసూలు చేస్తున్నారు. వాహనాలు ఆపేందుకు, వాటి భద్రతకు వారు తీసుకునే చర్యలు లేవు. ఇక్కడ ఏ వాహనానికి ఎంత వసూలు చేయాలో తెలిపే పట్టిక ఎక్కడా ప్రదర్శించకపోవడం గమనార్హం.

*** మహానందిలో….
మహానందిలో కారుకు రూ.80, బస్సుకు రూ.150, ఆటోకు రూ.30, లారీకి రూ.150 వసూలు చేస్తున్నారు. ఇక్కడ వాహనాల రుసుము కోసం నిర్వహించిన వేలంపాట క్షేత్రానికి రూ.1,02,69,999 ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది కన్నా ఇది రెట్టింపు. ఆదాయం రెట్టింపు రావడంతో గేటు వసూలు రుసుమును కూడా పెంచుకోవచ్చని దేవస్థానం వారు నిబంధనను సడలించడంతో భక్తుల వాహనాలకు గుత్తేదారులు దాదాపు రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారు. ఇంత భారీగా ఆదాయం వస్తున్నా వాహనాలకు సరైన పార్కింగు సౌకర్యం లేదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలపాల్సిన దుస్థితి ఉంది. ఉగాది, శివరాత్రి సమయాల్లోనైతే వాహనాలను క్షేత్రానికి ఒకట్నిర కి.మీ. దూరంలోనే ఆపేస్తారు. అయినా టోల్‌గేటు మాత్రం యథావిధిగా ఇవ్వాల్సిందే.

*** శ్రీశైలం ఆదర్శం కావాలి
శ్రీశైలంలో వాహనాలకు రూ.50 నుంచి దాని స్థాయిని బట్టి రూ.100 వసూలు చేస్తారు. పార్కింగు బాధ్యత దేవస్థానానిదే. ఒక పద్ధతి ప్రకారం వాహనాలను నిలుపుతుంటారు. పార్కింగు విషయంలో ఎలాంటి సమస్య లేకపోవడంతో అటు భక్తులు కూడా సంతోషంగా వాహనాల రుసుము చెల్లిస్తున్నారు. జిల్లాలోని మిగతా ఆలయాల్లో ఇలాంటి స్థితి కన్పించకపోవడం గమనార్హం.