Politics

అమరావతి రాజస్థాన్ ఎడారిలా ఉంది-ఢిల్లీలో తమ్మినేని

AP Speaker Tammineni Seetaram Calls Amaravati As Rajasthan Desert

రాజధానిపై ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి వెళ్లాలంటే.. రాజస్థాన్‌ ఎడారిలోకి వెళ్తున్నట్లు ఉందని.. మిగిలిన వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయారన్నారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ‘‘అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి. ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి. అమరావతిలో ఆ పరిస్థితి కనిపించలేదు. మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. విమర్శలు చేసే వాళ్లు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అని తమ్మినేని సీతారామ్‌ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు ఏమాత్రం ఆహ్లాదకరంగా జరగడం లేదని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తమ్మినేని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు వాడుతున్న భాష విషయంలో అందరూ బాధ్యులేనన్నారు. ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించిన గత ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు.