DailyDose

ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు-తాజావార్తలు-12/22

Deputy Collectors Transferred In AP-Telugu Breaking News Roundup-12/22

* హైదరాబాద్‌ మెట్రో రైల్లో ప్రయాణం మరింత ‘స్మార్ట్‌’ కానుంది. రేపటి నుంచి మెట్రో రైల్లో క్యూఆర్‌ టికెట్ల పద్ధతిని మెట్రో అధికారులు అమలు చేయనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌తో ప్రయాణం చేసే అవకాశం కల్పించనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ టికెట్‌ కార్యక్రమాన్ని మెట్రో ఎండీ ఎన్వీస్‌ రెడ్డి సోమవారం హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌లో ప్రారంభించనున్నారు.

* టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌(89), కీరన్‌ పొలార్డ్‌(74) ధాటిగా ఆడడంతో ఆ జట్టు భారీ స్కోర్‌ సాధించింది. 316 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్‌ (63), రాహుల్‌ (77) శుభారంభాన్ని అందించారు. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

* రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గౌరవార్థం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో సీఎం కేసీఆర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. రెడ్‌క్రాస్‌ యాప్‌ను ఆవిష్కరించారు.

* రాజధాని, హైకోర్టు తరలింపు ప్రతిపాదనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆరు జిల్లాల న్యాయవాదులు విజయవాడలో సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ హాలులో బార్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులు సమావేశమయ్యారు. చలసాని అజయ్‌ ఛైర్మన్‌గా బార్‌ అసోసియేషన్‌ ఐకాస ఏర్పాటు చేశారు.

* గత ఐదేళ్ల తెరాస పాలనలో హైదరాబాద్‌ మహానగరంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ మున్సిపల్‌ ఎన్నికల కాంగ్రెస్‌ సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనని స్పష్టం చేశారు. ఈ ఐదేళ్లలో తెరాస నేతలు కోటీశ్వరులుగా మారారని ఆరోపించారు.

* 2జీ లైసెన్స్‌ పొడిగించాలని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు టెలికాం విభాగానికి (డీవోటీ) లేఖ రాసినట్లు తెలిసింది. 2020 ఫిబ్రవరి 28తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.35వేల కోట్ల విలువైన 2జీ లైసెన్స్‌ గడువు ముగియనుంది. దాన్ని రెండు మూడేళ్లు పొడిగించాలని లేఖలో పేర్కొంది. లైసెన్స్‌ జారీ తేదీని 2002 మే 28 లేదా 2003 మే 21కి మార్చాలని కోరినట్లు తెలుస్తోంది.

* మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో నూతనంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. లోక్‌ అధికార్‌ మంచ్‌, భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్‌, ఇతర సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం ఈ ర్యాలీ జరిగింది. పొడవాటి జాతీయ జెండాను చేతబూని చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ‘సీఏఏని నాగ్‌పుర్‌ స్వాగతిస్తోంది’, ‘దేశద్రోహులను కాల్చివేయండి’ అంటూ నినాదాలు ఈ ర్యాలీలో వినిపించాయి.

* భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 22 ఏళ్ల నాటి రికార్డును అధిగమించాడు. ఒక ఏడాదిలో అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన ఓపెనర్‌గా సనత్‌ జయసూర్య పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. వెస్టిండీస్‌తో కటక్‌ వేదికగా నిర్వహించిన మూడో వన్డేలో ఈ రికార్డును అందుకున్నాడు. 1997లో జయసూర్య టెస్టులు, వన్డేల్లో కలిపి 2387 పరుగులతో రికార్డు నెలకొల్పాడు. తర్వాత ఏ ఓపెనర్‌ దాన్ని అధిగమించలేకపోయాడు.

* ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 45 మందిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

* రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలు ముగిసిన అనంతరం కొందరు రైతులు పక్కనే ఉన్న నీటి ట్యాంక్‌ ఎక్కడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. వెంటనే గమనించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ట్యాంక్ ఎక్కుతున్న మరికొందరిని కిందికి దించారు. మరోవైపు రైతుల దీక్షకు ముస్లిం విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు.