Politics

తెరాస నాయకులు మస్త్‌గా దండుకున్నారు

Revanth Reddy Bashes TRS Leaders For Their Illegal Earnings

గత ఐదేళ్ల తెరాస పాలనలో హైదరాబాద్‌ మహానగరంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇవాళ మేడ్చల్‌ జిల్లా కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ మున్సిపల్‌ ఎన్నికల కాంగ్రెస్‌ సన్నాహక సదస్సులో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… అభివృద్ధి, మౌలిక సదుపాయాలన్నీ కాంగ్రెస్‌ హయాంలో జరిగినవేనని స్పష్టం చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నాయకులతో చర్చించేందుకు తెరాస నాయకులు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. భూకబ్జాలు, అనుమతిలేని భవంతుల నిర్మాణంలో తెరాస నేతలు పోటీపడ్డారని ధ్వజమెత్తారు. ఈ ఐదేళ్లలో తెరాస నేతలు కోటీశ్వరులుగా మారారని ఆరోపించారు. మల్కాజిగిరి నుంచి మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ రైలు నడిపేందుకు కేంద్రం సిద్దంగా ఉన్నా…రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో అది కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 40శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ నిధులు విడుదల చేయకపోవడంతో ఈ దుస్థితి నెలకొందన్నారు.