DailyDose

BSNL విన్నపాలు వినవలె-వాణిజ్యం-12/22

BSNL Appeals To Modi Govt For 2G License Renewal-Telugu Business News Roundup-12/22

* 2జీ లైసెన్స్‌ పొడిగించాలని ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ మేరకు టెలికాం విభాగానికి (డీవోటీ) లేఖ రాసినట్లు తెలిసింది. 2020 ఫిబ్రవరి 28తో బీఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.35వేల కోట్ల విలువైన 2జీ లైసెన్స్‌ గడువు ముగియనుంది. దాన్ని రెండు మూడేళ్లు పొడిగించాలని లేఖలో పేర్కొంది. లైసెన్స్‌ జారీ తేదీని 2002 మే 28 లేదా 2003 మే 21కి మార్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ తేదీకి ప్రభుత్వం అంగీకరిస్తే గడువు పొడిగించినట్లవుతుంది. గతంలో మరో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌కు చెందిన లైసెన్స్‌ గడువును కూడా ప్రభుత్వం రెండేళ్లు పెంచింది.

* ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీనే వెనక్కి నెట్టిన ఘనుడాయన. కానీ, తనని సంపన్న వ్యక్తి అంటే మాత్రం ఇష్టపడరు. పైగా తనని అలా గుర్తించడం అసౌకర్యంగా ఉందంటారు. మందుల పంపిణీదారుగా జీవితం ప్రారంభించి ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ సంస్థను నెలకొల్పారు. మారుతున్న జీవనశైలి నేపథ్యంలో వస్తున్న వ్యాధులకు పరిష్కారం కనిపెట్టే దిశగా అడుగులు వేశారు. ఆధునిక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే నెలకొల్పారు. ఆయన ఎవరో కాదు.. ఫార్మా దిగ్గజం.. సన్‌ ఫార్మా వ్యవస్థాపకులు దిలీప్‌ సంఘ్వీ.

* ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం) 50వ వార్షిక సదస్సుకు భారత్‌ నుంచి భారీగా ప్రతినిధి బృందం వెళ్లనుంది. దీనిలో ముఖ్యమంత్రులు అమరీందర్‌ సింగ్‌, కమల్‌ నాథ్‌, యడియూరప్ప సహా 100 సీఈవోలు స్విస్‌ నగరమైన దావోస్‌కు పయనం కానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన నాయకులు దీనికి హాజరుకానున్నారు.

* భారత వాహన ప్రియులకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్‌ శుభవార్త చెప్పింది. ఎంజీ జెడ్‌ఎస్‌ విద్యుత్‌ కారును భారత్‌లో 2020, జనవరిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రూ.50వేలు చెల్లించి సంబంధిత డీలర్ల వద్ద కార్లను ముందుగానే బుక్‌ చేసుకునే సదుపాయం ప్రారంభించినట్లు తెలిపింది. మొదటి విడతగా దిల్లీ, హైదరాబాద్‌, ముంబయి, అహ్మదాబాద్‌, బెంగళూరు ఈ ఐదు నగరాల్లోనే మాత్రమే జెడ్‌ఎస్‌ ఈవీ వాహనం అందుబాటులోకి రానున్నట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే సంస్థ ఈ ఐదు నగరాల్లో ఛార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఒకవేళ ఆ ఛార్జింగ్‌ కేంద్రాలు మీ పరిధిలో లేకపోయినా మీ ఇంట్లోనే ఉచితంగా ఏసీ ఫాస్ట్‌ ఛార్జర్‌ ఏర్పాటు చేస్తామని సంస్థ తెలిపింది. ఈ కారు ధర దాదాపు రూ.25లక్షలు(ఎక్స్‌ షోరూం) ఉండొచ్చని సంస్థ పేర్కొంది. ఈ కంపెనీ నుంచి భారత మార్కెట్లోకి వస్తున్న తొలి విద్యుత్‌ వాహనం ఇదే కావడం విశేషం.