DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-12/26

Telugu Top 10 News Of The Day-Dec 26 2019

1. ఆకాశంలో అద్భుతం: ఆసక్తిగా తిలకించిన ప్రజలు
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సుమారు పది సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయి సూర్యగ్రహణం ఆకాశంలో కనువిందు చేసింది. ఉదయం 8.15 నిమిషాలకు ప్రారంభమైన ఈ సుందర ఘట్టం దాదాపు 3 గంటల పాటు సాగింది. అరుదుగా సంభవించే ఘట్టాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, చిన్నారులు, పెద్దలు ఆసక్తి చూపారు.
2. మోదీ గ్రహణాన్ని చూడలేకపోయారట!
సూర్య గ్రహణం సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘అందరు భారతీయుల్లాగే సూర్యగ్రహణాన్ని చూడాలని నేను కూడా చాలా ఉత్సాహపడ్డాను. కానీ దురదృష్టవశాత్తూ మబ్బులు కమ్మి ఉండటం వల్ల దాన్ని చూడలేను. కానీ కోజికోడ్‌, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నాను. నిపుణులతో సంభాషించటం ద్వారా ఈ విషయంలో నా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాను కూడా…’’ అంటూ గ్రహణ సమయంలో ఓ ట్వీట్‌ చేశారు.
3. మందడం వద్ద ఉద్రిక్తత
ఏపీలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి. మందడం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. టెంటు వేసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో రైతులు, మహిళలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే మార్గాన్ని పూర్తిగా దిగ్బంధించారు.
4. కేశినేని, బుద్ధా గృహ నిర్బంధం
విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలంటూ ప్రకాశం బ్యారేజీపై నిరసన కార్యక్రమానికి రాజధాని పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. నిరసనకు వెళ్తారనే ఉద్దేశంతో తెదేపా ఎంపీ నానిని విజయవాడలోని ఆయన నివాసంలోనే నిర్బంధించారు. ఆయనతోపాటు తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
5. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్‌ వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్‌లో బుధవారం రాత్రి చోరీ చోటుచేసుకుంది. విశాఖ ఎక్స్‌ప్రెస్ పిడుగురాళ్ల రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు కిటికీ వద్ద ఉన్న అన్నవరానికి చెందిన స్వాతి లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసు తెంపారు. ప్రయాణికులు కేకలు వేయంటంతో గొలుసు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు.
6. కొడనాడు ఎస్టేట్‌కు యజమాని నేనే!
కొడనాడు ఎస్టేట్‌కు తానే యజమానిగా ఆదాయపు పన్ను శాఖకు జయలలిత నెచ్చెలి శశికళ తరఫున సమర్పించిన సమాధానంలో వెల్లడించారు. కొడనాడు ఎస్టేట్‌, మరో నాలుగు ఆస్తుల్లో 2016 ఏప్రిల్‌ 1 నుంచి జయలలిత మరణం వరకు భాగస్వామిగా ఉన్నట్టు, జయలలిత మరణానంతరం యజమానిగా ఉన్నట్టు వెల్లడించినట్టు తెలిసింది.
7. దుబాయిలో ఇద్దరు భారత విద్యార్థుల మృతి
దుబాయిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత విద్యార్థులు మృతి చెందారు. మీడియా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్‌ కృష్ణకుమార్‌(19), శరత్‌కుమార్‌(21) ఇద్దరూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
8. ఇజ్రాయెల్‌ ప్రధానికి తప్పిన ముప్పు
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుకు ప్రమాదం తప్పింది. అష్కెలాన్‌లో ఎన్నికల ప్రచారంలో ఉండగా రాకెట్‌ ప్రయోగం జరిగినట్లు సైరన్‌ మోగడంతో స్టేజ్‌ మీద ఉన్న ప్రధానిని హుటాహుటిన సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ రాకెట్‌ ప్రమోగం గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్‌ సముద్రతీర నగరం ఆష్కెలాన్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిందని ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది.
9. 40 నిమిషాల్లో దాదాకు పాక్‌ క్రికెటర్ ఫిదా
మైదానంలో సౌరవ్‌ గంగూలీ దూకుడు, ప్రవర్తన చూసి దురుసు వ్యక్తిగా భావించానని పాక్‌ దిగ్గజ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ అన్నారు. 40 నిమిషాలు వ్యక్తిగతంగా మాట్లాడిన తర్వాత అతడు తన మనసు గెలిచాడని వెల్లడించారు. తన యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోలో ముస్తాక్‌ ఈ సంగతి చెప్పారు.
10. కాంగ్రెస్‌కు సావిత్రీబాయి ఫూలే గుడ్‌బై!
ఉత్తర ప్రదేశ్ మాజీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ ఏడాది మొదట్లో 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె.. సంవత్సరం కూడా తిరక్కుండానే ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో తన మాటకు విలువ లేకుండా పోయిందనీ.. అందుకే తాను రాజీనామా చేస్తున్నానని ఆమె ప్రకటించారు. తాను కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు సావిత్రిభాయి తెలిపారు.