Kids

ఇక పిల్లలు అన్నం కింద పడేయలేరు

The gyroscopic food bowl that makes it impossible for kids to spill food

అదిగో పిల్లి… ఇదిగో కుక్కపిల్ల… చుక్‌చుక్‌ రైలు.. వెళ్లిపోతోంది చూడుచూడు… అంటూ ఒక ముద్ద, అయ్యో కనిపించలేదా పిల్లి… మళ్లీ రమ్మందామే అంటూ ఒక ముద్ధ.. బుజ్జి కుక్కపిల్ల నీ కోసమే పరుగుపరుగున వచ్చేస్తుంది చూడు…చూడు… అంటూ మరో ముద్దా నోట్లో పెట్టేస్తాం. ఇదంతా చేసేదీ, నానారకాల తంటాలు పడేదీ బంగారాలు నాలుగు ముద్దలు తింటారనేగా. ఆ గడుగ్గాయిలకు అసలు తినడమే ఇష్టం లేదనుకోండి… వెంటనే మన చేతుల్లోని గిన్నెను చిరాగ్గా తోసిపారేస్తారు. దాంతో పప్పు, నెయ్యి, మరిన్ని పోషకాలు కలగలిపిన అన్నం కాస్తా నేలపాలవుతుంది. తల్లి మనసు ఉసూరుమంటుంది. ఇదంతా సాధారణంగా ప్రతి ఇంట్లోనూ జరిగేదే… బుజ్జాయిల ఆహారం ఇలా వృథా కాకుండా ఉండాలంటే ఒక ఉపాయమూ ఉంది. అదే.. ఈ బేబీ గైరోస్కోపిక్‌ బౌల్‌. ఇది కిందపడినా దీంట్లోని ఆహారం ఒలికిపోదు. ఎలా విసిరేసినా గిన్నె మళ్లీ యథాస్థానానికి వచ్చేస్తుంది.