Movies

సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు విజయబాపినీడుపై ప్రత్యేక కథనం

A Glimpse Into The Lifestory Of Vijaya Bapineedu

విజయ బాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి (సెప్టెంబరు 22, 1936 – ఫిబ్రవరి 12, 2019). పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రులో బాపినీడు జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీలో బీఏ పూర్తిచేసిన బాపినీడు.. కొంతకాలం పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. తరవాత చెన్నైలో ‘బొమ్మరిల్లు’, ‘విజయ’ మ్యాగజైన్లను ప్రారంభించారు. ‘విజయ’లో వచ్చిన బాపినీడు సినిమా రివ్యూలు అప్పట్లో విపరీతంగా ప్రేక్షకాదరణ పొందాయి. దీంతోనే ఆయన పేరు విజయ బాపినీడుగా మారింది. ఆ తరవాత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాపినీడు.. 1981లో దర్శకుడిగా మారారు. బాపినీడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. చిరంజీవితో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగ మహారాజు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘మగధీరుడు’ సినిమాలతో పాటు మెగాస్టార్ వందో చిత్రం ‘ఖైదీ నంబర్ 786’ను కూడా విజయ బాపినీడే తెరకెక్కించడం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ సినిమానే. చిరంజీవి తరవాత రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు. శోభన్‌బాబు, క్రిష్ణ, మోహన్‌బాబు వంటి సీనియర్ నటులతోనూ పనిచేశారు. దర్శకుడిగా 22 సినిమాలు తెరకెక్కించిన బాపినీడు.. శ్యాం ప్రసాద్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘యవ్వనం కాటేసింది’ సినిమాను నిర్మించారు. అలాగే స్నేహితులతో కలిసి మరో 12 చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్‌తో ఉన్న అనుబంధంతో ‘చిరంజీవి’ అనే మ్యాగజైన్‌ను కూడా బాపినీడు నడిపారు.