Devotional

కాణిపాకంలో వినాయక వ్రత సేవలు ప్రారంభం

Vinayaka Vratham 2020 Starts In Kanipakam

శుభకార్యాల సమయాల్లో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామికి కల్యాణం జరిపించడంపై భక్తులకు ఆసక్తి. రాహుకేతు సర్పదోష నివారణకు శ్రీకాళహస్తి ఆలయంలో సర్పదోష నివారణ పూజలు చేయించడం భక్తుల విశ్వాసం. విద్యా, ఆరోగ్య, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కలగడానికి, సకల కష్టాల పరిహారార్థం స్వయంభు క్షేత్రమైన కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి వారి చెంత సంకటహర గణపతి వ్రతం చేసుకుంటే తమ కష్టాల తొలగి ఆనందాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల పౌర్ణమి వెళ్లిన నాలుగో రోజున వచ్చే చతుర్థి సందర్భంగా ఆలయంలో సామూహిక సంకటహర గణపతి వ్రతం చేసేందుకు ఆలయ అధికారులు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నెల వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొని వ్రతం చేసుకొని, ఈతిబాధల నుంచి విముక్తి పొందుతున్నారు. ఈ వ్రతం ఎందుకు చేయాలి..? ఎలా చేయాలి..? కలిగే ఫలితాలేంటి అన్నదానిపై కథనం.
**సంకట చతుర్థి వ్రతం అంటే..
భూలోకాది మూడు లోకాలలో దేవ, మనుష్య, యక్ష, గంధర్వులందరికి సమస్తమైన సకంటములు(కష్టములు) హరింప చేసే మహిమాన్వితమైన వ్రతం అని అర్థం. అందుకే దీనిని సంకటహర చతుర్థి వ్రతం అని పిలుస్తారు. సంకటహర గణపతి వ్రతం గురించి.. శ్రీ గణేశ పురాణం, ఉపాసనా ఖండం 68వ అధ్యాయం నుంచి 71 అధ్యాయం వరకు వివరంగా పేర్కొన్నారు.
*ఎప్పుడు.. ఎలా చేయాలి?
ఈ వ్రతం ప్రతి నెల కృష్ణ పక్షం చంద్రోదయ సమయం చతుర్థి తిథి రోజున నిర్వహించాలి. ఈ వ్రతాన్ని ఆచరించదలచిన భక్తులు బ్రహ్మ ముహూర్తాన (వేకువ జామున 4 గంటలకు) అభ్యంగన స్నానం ఆచరించాలి. నిత్య కర్మలను నిర్వర్తించుకొని… రాత్రి చంద్రోదయం సమయం వరకు గణేశున్ని స్మరించుకొంటూ.. ఉసవాస దీక్షతో ఉండి రాత్రి సూర్యాస్తమయం తరువాత శుచిగా స్నానం చేసుకోవాలి. పూజా ద్రవ్యాలను ఏర్పాటు చేసుకొని, కలశ స్థాపన చేసుకోవాలి. ఆగమ శాస్త్రోక్తంగా గణేశ యంత్రాన్ని నిర్మించి, ఆ యంత్రంపైన మహాగణపతిమూర్తిని స్థాపించి, షోడోపచారములతో పూజ చేయాలి. తరువాత గణేశునికి, చతుర్థి తిథి దేవతకు, చంద్రునికి ఆర్ఘ్యాలు సమర్పించి, సంకటహర చతుర్థి వ్రత కథను విని, అనంతరం స్వామివారికి సమర్పించిన తీర్థ ప్రసాదాలను తీసుకోవాలి.
*వ్రత మహత్యం..
సంకటహర చతుర్థి వ్రతమును దేవతలు, మహారాజులు, మహర్షులు ఆచరించి సత్ఫలితాలను పొందినట్లు గణేశ పురాణంలో పేర్కొన్నారు. ఈ వ్రతాన్ని శూరసేన మహారాజు తన పితృదేవతల కలలో కనపడి సకల దోషాలు నశించి, వంశాభివృద్ధి, సమస్త దుఃఖములు తొలగుటకు.. దారిద్ర, బాధ నివృత్తికి, పుత్ర సంతానోత్పత్తికి ఉపదేశించినట్లు చెబుతోంది. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు తన పుత్రుని జాడ తెలియక దుఃఖి స్తున్న నేపథ్యంలో తల్లి రుక్మిణిదేవి సంకటహరవ్రతం ఆచరించాలని కుమారునికి ఉపదేశించారు. ప్రద్యుమ్నుడు 4 నెలలు దీక్షగా వ్రతాన్ని ఆచరించారు. 4 నెలల తర్వాత తన పుత్రుని ఆచూకి తెలుసుకున్నాడు. ఈ వ్రత ప్రభావం వల్ల బాణాసురునితో భీకర యుద్ధం చేసి, జయించి తన కుమారున్ని రక్షించుకున్నట్లు గణేశ పురాణంలో ఉంది. ఈ వ్రతాన్ని నిర్వహించిన వారికి మానసిక, శారీరక, ఆర్థిక, కష్ట, నష్టాలు తొలగి సుఖశాంతులతో జీవించగలరని పురాణాలు చెబుతున్నాయి.
*విఘ్నాలు వీడాలని వినాయకుడి సేవలో..
వినాయక చవితి రోజున మహాగణపతిని చూసి హేళన చేసిన కారణంగా పార్వతీదేవి చంద్రునికి ఘోర శాపం విధించినట్లు గణేశ పురాణంలో ఉంది. చంద్రున్ని చూసిన వారందరికి నీలాపనిందలు తప్పవని శాపం విధించింది. ఆ శాపం నుంచి విముక్తి కోసం 10 వేల సంవత్సరాలు చంద్రుడు… మహాగణపతి కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు మహాగణపతి ప్రత్యక్షమై… తన తల్లి జగన్మాత ఇచ్చిన శాపాన్ని పూర్తిగా నివారించే శక్తి తనకు లేదని, అందుకు ప్రత్యామ్నాయంగా వినాయకచవితి రోజున చంద్రున్ని చూసిన వారికి మాత్రం ఆ శాపం వర్తిస్తుందని, మిగిలిన రోజుల్లో చంద్రున్ని యథావిధిగా దర్శించుకోవచ్చునని అనుగ్రహించాడు. ప్రతి కృష్ణపక్ష చతుర్థి అనగా.. ప్రతి నెల సంకటహర గణపతి వ్రతం నిర్వహించే వారికి ఆపదలు రావని గణపతి చంద్రునికి వరం ఇచ్చాడు. ఈ వ్రతం చంద్రోదయ సమయం నుంచే చేయాలని, అందులో చంద్రున్ని ప్రత్యేకంగా పూజించి ఆర్ఘ్యాలు సమర్పించి, చంద్ర దర్శనం తప్పనిసరిగా చేసిన వారికి సంకటహర మహాగణపతి వ్రత ఫలితం సంపూర్ణంగా కలుగుతుందని గజాననుడు చంద్రునికి వరం ప్రసాదించాడు.
*అందుబాటులో కావాల్సినన్ని టిక్కెట్లు
ఆలయంలో సంకటహర గణపతి వ్రతం చేసుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం సంకటహర చతుర్థి రోజున ఉదయం 9 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రెండు విడతలుగా చేస్తారు. రూ.250 చెల్లించి భక్తులు ఈ వ్రతంలో పాల్గొనవచ్ఛు పూజా సామగ్రిని ఆలయం వారు సమకూరుస్తారు. టిక్కెట్లు ఇవ్వడానికి ఎలాంటి పరిమితి లేదు. భక్తులకు కావాల్సినన్ని టిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
2.శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స మంగళవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజపక్స వెంట ఆయన కుమారుడు యోషిత, ఆ దేశ మంత్రి ఆర్ముగన్ తొండమాన్ తదితరులు ఉన్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న వారికి రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మహద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. పడికావలి నుంచి ధ్వజమండపం వరకు భక్తుల సౌకర్యార్థం నిర్మించిన కదిలే పైకప్పు గురించి ఈవో వివరించగా.. రాజపక్స ఆసక్తిగా తిలకించారు. అనంతరం అష్టదళ పాద పద్మారాధన సేవలో, వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. హుండీలో రాజపక్స బంగారు నాణేన్ని సమర్పించారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. మహింద రాజపక్సకు మంత్రి పెద్దిరెడ్డి, తితిదే ఈవో, అదనపు ఈవో తీర్థప్రసాదాలను అందజేసి, శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. తర్వాత పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో శ్రీలంకకు బయల్దేరి వెళ్లారు.
3.సంస్కృతీ కేంద్రంగా బాలు గృహం-కంచి పీఠాధిపతి
ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంచి మఠానికి సదాశయంతో అందించిన గృహాన్ని నెల్లూరు సంస్కృతీ కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీజగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. వేద పాఠశాల నిర్వహించేందుకు నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంటిని కంచి మఠానికి మంగళవారం లాంఛనంగా అప్పగించారు.
4.ముగిసిన గుణదల మేరీమాత ఉత్సవాలు
మూడు రోజులపాటు వైభవంగా సాగిన గుణదల మేరీమాత ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు వేడుకల్లో 60 మంది మత గురువుల మధ్య బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు మరియమాత దీవెనలతో సువార్తను ప్రకటించారు. ఆలయ ప్రాంగణం మొత్తం మరియమాత నామస్మరణతో మార్మోగింది. దేశ, విదేశాల నుంచి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
5రేపటి నుంచే.. వాసుదేవుని బ్రహ్మోత్సవం-మందసలో ముమ్మరంగా ఏర్పాట్లు
14వ శతాబ్దం నాటి ప్రాచీన శిలామయ ఆవాసం మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయం. భక్తులకు ధైర్యం, స్థైర్యం, జ్ఞానం ప్రసాదించే భగవంతుడాయన. ఆ దేవదేవుని బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ విశిష్ఠతపై ప్రత్యేక కథనం..
ఎలాగంటే..
చినజీయరుస్వామి 1988వ సంవత్సరంలో వేదశాంతి పేరుతో పాదయాత్ర చేపట్టారు. వేద అధ్యాపకులు, విద్యార్థులను వెంటేసుకుని శ్రీకూర్మం నుంచి పూరీ వరకు యాత్ర చేశారు. మార్గమధ్యం మందస రాగానే తన గురువు శ్రీత్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయరుస్వామి వేదాలు అభ్యసించినదిగా నెమరువేసుకొని ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దుస్థితిని చూసి కలత చెందారు. గురువుల స్మారకార్థం ఆలయాన్ని పునరుద్ధరించడానికి శ్రీకారం చుట్టారు. ఆలయాన్ని దేేవాదాయశాఖ నుంచి దత్తత తీసుకొన్నారు. జీర్ణోద్ధరణ చేయించారు. అనంతరం 2009లో లోకావిష్కృతం చేశారు. దీంతో ఆలయానికి పూర్వ వైభవం లభించినట్లయింది.
*సమకూరుతున్న వసతులు
ఈ ఆలయం చినజీయరుస్వామి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది. ఆలయానికి ఆనుకుని దక్షణ భాగంలో మందస, బైరిసారంగపురానికి చెందిన ఇద్దరు భక్తులు భూదానం చేశారు. ఆ స్థలంలో పలాసకు చెందిన భక్తులు రూ.కోటితో కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నారు. పై అంతస్తులో 14 వసతి గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. బెండికి చెందిన ఓ భక్తుడు రూ.4 లక్షలతో ప్రహరీ నిర్మిస్తున్నారు. ఆలయానికి ఈశాన్య భాగాన వీరాంజనేయస్వామి ఆలయాన్ని పలాస భక్తుడు నిర్మించారు. దేవ దేవుని బ్రహ్మత్సవాల్లో స్వామి వారి ఊరేగింపునకు రూ.3 లక్షలతో తయారైన రథాన్ని హైదరాబాడుకు చెందిన ఓ భక్తుడు మూడేళ్ల కింద వితరణ చేశారు. ఆలయ సింహద్వారానికి రూ.లక్షలు విలువ చేసే తలుపులను బొబ్బిలి రాజ వంశీయులు బహుకరించారు.
*బ్రహ్మోత్సవాలు తిలకించాలంటే..
శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం, సోంపేట వెళ్లే బస్సుల్లో హరిపురం చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఐదు కిలోమీటర్ల దూరంలోని మందస చేరుకోవచ్ఛు దూర ప్రాంతీయులు రైళ్లలో పలాసలో దిగి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో 20 కిలోమీటర్ల దూరంలోని మందస చేరుకోవచ్ఛు
*ప్రాచీన ఆలయం
మందస సంస్థానాన్ని పాలించిన రాజపుత్ర వంశీయుల్లో లక్ష్మణ రాజమణి రాజ్దేవ్ 1744 సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠించినట్లుగా ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. నాటి నుంచి సంస్థానాన్ని పాలించిన జమిందారులు ఏటా తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేవారు. అలా 1950 వరకు ఆలయం వెలుగొందింది. రాజులు అంతరించడంతో ఆలయం నిరాదరణకు గురైంది. ఈ దశలో శ్రీమన్నారాయణ త్రిదండి చినజీయరుస్వామి ఆలయ పునరుద్ధరణకు కంకణం కట్టుకొన్నారు.
***ఉత్సవ కార్యక్రమాలు
*13వ తేదీ ఆంజనేయస్వామి అభిషేక మహోత్సవం. విష్ణు సహస్రనామ పారాయణం, సేవాకాలము, తీర్థగోష్ఠి.
* 14న ఉదయం 9 గంటలకు వాసుదేవ పెరుమాళ్ అభిషేక మహోత్సవం. అన్నమాచార్య సంకీర్తన.
* 15న ధ్వజారోహణం, అగ్నిప్రతిష్ఠ, హనుమద్వాహన సేవ, శ్రీరామ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ, సేవాకాలము, తీర్థగోష్ఠి, దేవతాహ్వానం, శేషవాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 16న యాగశాలలో విశేష హోమాలు, కల్పవృక్ష వాహనసేవ, లక్ష్మిపూజ, ఎదుర్కోలు ఉత్సవం, హంస, గజవాహన సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 17న యాగశాలలో హోమాలు, స్వామివారి కల్యాణమహోత్సవం, జీయరుస్వాముల మంగళాశాసనాలు, గరుఢవాహనసేవలో తిరువీధి ఉత్సవం. సాంస్కృతిక కార్యక్రమాలు.
* 18న యాగశాలలో హోమాలు, పొన్నవాహనసేవ, వేంకటేశ్వరస్వామి పూజ, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 19న రథోత్సవం, చక్రతీర్థం, అవభృధ స్నానం, సాంస్కృతిక కార్యక్రమాలు.
* 20న వాసుదేవస్వామి అభిషేకం, సప్తావరణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.
*అబ్బుర పరచే కళాఖండాలు
ఒడిశా సంప్రదాయం ఉట్టిపడేలా పూరీ జగన్నాథస్వామి ఆలయం నమూనాలో, కళాఖండాలతో ఉంటుందీ ఆలయం. ప్రాచీన నాగరికతను తెలిపే పలు రకాల భంగిమలతో చెక్కిన రాతిబొమ్మలు సజీవ మూర్తుల్లా దర్శనమిస్తాయి.
6. తిరుమల \|/ సమాచారం
ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు బుదవారం,
12.02.2020
ఉదయం 5 గంటల
సమయానికి,
తిరుమల: 14C°-27C°
• నిన్న 63,933 మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో 02 కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
06 గంటలు
పట్టవచ్చును,

• నిన్న 19,726 మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
₹: 3.12 కోట్లు,
• నిన్న 16,600 మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
/ / గమనిక / /
• ఫిబ్రవరి 21న గోగ‌ర్భ
తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి
మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు,
• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ
పూర్వా సంధ్యా ప్రవర్తతే,
ఉత్తిష్ఠ నరశార్దూల
కర్తవ్యం దైవమాహ్నికమ్‌
తా: కౌసల్యాదేవికి
సుపుత్రుడవగు ఓ
రామా! పురుషోత్తమా!
తూర్పు తెల్లవారుచున్నది.
దైవ సంబంధములైన
ఆహ్నికములను
చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి
ttd Toll free
#18004254141
7. శుభమస్తు
తేది : 12, ఫిబ్రవరి 2020
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘమాసం
ఋతువు : శిశిర ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : చవితి
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 54 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 11 గం॥ 42 ని॥ వరకు)
నక్షత్రం : ఉత్తర
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు రాత్రి 7 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు రాత్రి 8 గం॥ 49 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 48 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 12 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 52 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 55 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 29 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 8 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 36 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 15 ని॥ లకు
సూర్యరాశి : మకరము
చంద్రరాశి : కన్య
విశేషం
12. సంకష్టహరచతుర్థి
8. చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 12జగపతి బాబు
1809 : పూర్వపు అమెరికా అద్యక్షుడు అబ్రహం లింకన్ జననం (మ.1865).
1809 : జీవ పరిణామ క్రమ సిద్దాంత, ప్రకృతి వరణ సిద్ధాంతాలను అందించిన ఛార్లెస్ డార్విన్ జననం (మ.1882).
1878 : స్కాట్లండు కు చెందిన క్రైస్తవ మిషనరీ అలెక్సాండర్ డఫ్ మరణం (జ.1806).
1942 : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రముఖుడు సి.హెచ్.విద్యాసాగర్ రావు జననం.
1962 : తెలుగు సినిమా నటుడు జగపతి బాబు జననం.
1962 : తెలుగు సినిమా ప్రతినాయకుడు ఆశిష్ విద్యార్థి జననం.
1968 : తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు, గాయకుడు మరియు నాటక ప్రయోక్త పువ్వుల సూరిబాబు మరణం (జ.1915).
1976 : భారతదేశానికి చెందిన ఒక రాజకీయ నాయకుడు అశోక్ తన్వర్ జననం.
9. శ్రీ అహోబిల మఠం భద్రాచలం12-2-2020 బుధవారం
ఆశ్రీత భక్త వత్సలుడు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహమే అవదిగా 3 రోజులుగా జరుగుతున్న శ్రీ నృసింహ యాగం ఈ నాటితో ముగియనున్నదిలక్ష సార్లు నృసింహ మహా మంత్రం తో జరిగిన హోమం ఈ నాడు మహా పూర్ణాహుతితో ముగియనున్నదికావున భక్తులు అందరూ నృసింహ యాగం మహా పూర్ణాహుతిలో పాల్గొనండియాగం అనంతరం హోమం ప్రదక్షిణ మరియు ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లగలరు
10. మార్చి 6 నుంచి 10వ తేదీ వరకుఅనంతవరం శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం, అనంతవరం గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 6 నుండి 10వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
11. రాశిఫలం – 12/02/2020
తిథి:
బహుళ తదియ ఉ.7.03 త.చవితి రా.తె.4.42, కలియుగం-5121 , శాలివాహన శకం-1941
నక్షత్రం:
ఉత్తర సా.4.16
వర్జ్యం:
రా.12.05 నుండి 1.34 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు తీవిశేషాలు: సంకష్టహచుతర్థి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు.
వృషభం:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా వుంటుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. మెలకువగా నుండుట అవసరం. స్థానచలన మేర్పడే అవకాశాలుంటాయి. ఋణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగానుండాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలుంటాయి.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆర్థిక ఇబ్బందులుండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదుచేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులుండవు.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేకపోతారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషిచేస్తారు. స్ర్తిలు, బంధు, మిత్రులను కలుస్తారు.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మిక్కిలి ధైర్యసాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఆకస్మిక లాభాలుంటాయి.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపంచేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
12. సాంబమూర్తి ఆశయంగా వేదనాద ప్రచారం – కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి
సంగీత, భక్తి ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సాంబమూర్తి ఆశయాలకు అనుగుణంగా ఈ స్థలంలో వేదనాద ప్రచారాన్ని కొనసాగిస్తామని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి పేర్కొన్నారు. నెల్లూరు తిప్పరాజువారి వీధిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గృహాన్ని కంచిపీఠానికి వేద పాఠశాల నిర్వహణకు అందజేశారు. మంగళవారం రాత్రి ఆ ఇంట్లోనే జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా కంచిపీఠాధిపతికి గృహాన్ని లాంఛనంగా సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారు మాట్లాడుతూ భిక్షాటన పూర్వకంగా త్యాగరాజ స్మరణోత్సవాలను నిర్వహించిన ఘనత ఎస్పీ సాంబమూర్తికే దక్కుతుందన్నారు. నెల్లూరు వీధుల్లో భగవన్నామ సంకీర్తనను మారుమోగించిన ప్రతిభాశాలి సాంబమూర్తని కొనియాడారు. దేశంలో వేదాన్ని, శాస్త్రాన్ని, పురాణాలను, సంగీత, సాహిత్యాలను పరిరక్షించుకునే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మా తండ్రిగారు పెద్ద శైవభక్తులు గురుభక్తితో ఉండే వారు. వారులేరనే అసంతృప్తితప్ప వారిపేరుతో వేదపాఠశాలను నిర్వహించటం ద్వారా వారు ఇక్కడే ఉన్నారని భావిస్తామన్నారు. కంచిపీఠానికి నేను గృహాన్ని అప్పగించలేదని భగవత్‌సేవకు స్వామివారే తీసుకున్నారనేది సబబన్నారు. ఈ సందర్భంగా తొలుత స్వామివారికి బాలసుబ్రహ్మమణ్యం తులసిమాలను అందజేసి వేదపండితులతో కలిసి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బాలు సోదరీమణులు శైలజ, వసంత, సతీమణి, కుమారి, కుటుంబసభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్‌ వీవీఎస్ఎన్‌ మూర్తి, మంత్రి ఓఎస్డీ పెంచలరెడ్డి, త్యాగరాజ స్మరణోత్సవ సభ కార్యదర్శి యనమండ్ర నాగదేవి ప్రసాద్‌, వీరిశెట్టి హజరత్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.
13. మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
మేడారం మహా జాతర సందర్భంగా వనదేవతలకు భక్తజనం సమర్పించుకున్న కానుకల హుండీ లెక్కింపు ప్రారంభమైంది. సబ్బండ వర్గాల సంబరం నాలుగు రోజుల పాటు కోలాహలంగా సాగిన విషయం తెలిసిందే. ఈ జాతరకు సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు విచ్చేసి వన దేవతలను దర్శించుకొని పునీతులయ్యారు. ఈ ఏడాది జరిగిన జాతరకు కోటి మందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో బుధవారం ఉదయం హుండీల లెక్కింపు ఉదయం ప్రారంభమైంది. దేవాదాయ శాఖ అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, మేడారం ఆలయ ఈవో రాజేంద్ర ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల మధ్య ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు వారం రోజుల పాటు మొత్తం 494 హుండీలను 200 మంది సిబ్బంది లెక్కించనున్నట్లు మేడారం ఆలయ ఈవో రాజేంద్ర తెలిపారు. గతంలో జరిగిన జాతరలో మేడారం ఆదాయం రూ.10కోట్లు వచ్చిందని తెలిపారు. ఈ సారి రూ.10కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
14. శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో బుధ‌వారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుంజనం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ‌నివాస‌నాయ‌క్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.
*ఫిబ్రవరి 13న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14 నుండి 23వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 13న గురువారం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.
*ఏర్పాట్లు పూర్తి :
బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
*ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ఉదయం 8.04 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.
*బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం
15-02-2020(శ‌నివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
16-02-2020(ఆదివారం) భూత వాహనం సింహ వాహనం
17-02-2020(సోమ‌వారం) మకర వాహనం శేష వాహనం
18-02-2020(మంగ‌ళ‌వారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
19-02-2020(బుధ‌వారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
20-02-2020(గురువారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
21-02-2020(శుక్ర‌వారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
22-02-2020(శ‌నివారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
23-02-2020(ఆదివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
15. ఫిబ్రవరి 13న శ్రీనివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల‌యంలో చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులను ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు, ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
*ఫిబ్రవరి 13న అంకురార్ప‌ణ‌ :
ఫిబ్రవరి 13వ తేదీ గురువారం సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు పుణ్యాహ‌వాచ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వ‌ము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
*ఫిబ్రవరి 14న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 14వ తేదీ శుక్ర‌వారం ధ్వజారోహణంతో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 9.45 నుండి 10.10 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.
*బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
14-02-2020(శుక్ర‌వారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
15-022020(శ‌నివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
16-02-2020(ఆదివారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
17-02-2020(సోమ‌వారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
18-02-2020(మంగ‌ళ‌వారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
19-02-2020(బుధ‌వారం) హనుమంత వాహనం స్వర్ణరథం, గజ వాహనం
20-02-2020(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
21-02-2020(శుక్ర‌ వారం) రథోత్సవం అశ్వవాహనం
22-02-2020(శ‌నివారం) చక్రస్నానం ధ్వజావరోహణం
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.