Sports

సెమీస్‌కు పేస్ జోడీ

Leandar Pace Gets Into Semi Finals At Bangalore Tournament

భారత దిగ్గజ డబుల్స్‌ ఆటగాడు లియాండర్‌ పేస్‌ బెంగళూరు ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సెమీఫైనల్స్‌కు చేరాడు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ మాథ్యూ అబ్డెన్‌తో కలిసి పేస్.. ఆండ్రీ గొరన్సన్‌ (స్వీడన్‌)- క్రిస్టోఫర్‌ (ఇండోనేషియా) జోడీపై 7-5, 0-6, 10-7తో విజయం సాధించాడు. పేస్‌ జంటతో పాటు మరికొందరు భారత ఆటగాళ్లు కూడా మెరిశారు. పురవ్‌ రాజా (భారత్‌)- రామ్‌కుమార్‌ రామనాథన్‌ (భారత్‌) జోడీ, సాకేత్‌ మైనేని (భారత్‌)- మ్యాట్‌ రీడ్‌ (ఆసీస్‌) జంట కూడా సెమీస్‌కు చేరారు. టాప్‌ సీడ్‌ చెంగ్‌ పెంచ్‌ (చైనీస్‌ తైపీ)- డెనీస్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై సాకేత్‌ జోడీ 3-6, 6-4, 10-8తో గెలిచింది. ఫ్రెడెరికో సిల్వా (పోర్చుగల్‌)- నికోల మిలోజెవిక్‌ (సెర్బియా) జోడీపై పురవ్‌ రాజా – రామ్‌కుమార్‌ రామనాథన్‌ జంట 6-4, 6-4తో విజయం సాధించింది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ గునేశ్వరన్‌ 6-7 (5/7), 0-6తో బెంజిమన్‌ బొంజి (ఫ్రాన్స్‌) చేతిలో, సుమిత్‌ నాగల్‌ 3-6, 3-6తో బ్లజ్‌ రొలా (స్లోవేనియా) చేతిలో ఓడారు. వీరితో పాటు రామ్‌కుమార్‌‌, సాకేత్‌ మైనేవి, నికి పూనచ, సిద్ధార్థ్ రావత్‌ కూడా సింగిల్స్‌లో ఓటమి పాలయ్యారు.