DailyDose

నిర్భయ వినయ్ పిటీషన్ కొట్టేసిన సుప్రీం-తాజావార్తలు

Nirbhaya Vinay Sharma's Plea Gets Denied By Supreme-Telugu Breaking News

* నిర్భయ హత్యాచారం కేసులో దోషి అయిన వినయ్‌శర్మ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తిరస్కరించడంపై అతడు పిటిషన్‌ దాఖలు చేయగా.. జస్టిస్‌ ఆర్‌ భానుమతి, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

* సెలక్ట్‌ కమిటీల ఏర్పాటుపై ఏపీ శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ పంపిన దస్త్రాన్ని మండలి కార్యదర్శి మళ్లీ వెనక్కి పంపారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలక్ట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలంటూ షరీఫ్‌ మండలి కార్యదర్శికి ఇటీవల దస్త్రాన్ని పంపగా.. అది నిబంధనలకు విరుద్ధమంటూ మండలి కార్యదర్శి దాన్ని తిప్పి పంపారు. మండలి ఛైర్మన్‌ మళ్లీ దాన్ని కార్యదర్శికి పంపినప్పటికీ తాజాగా రెండోసారి కూడా ఆయన తిప్పి పంపారు.

* బకాయి పడిన మొత్తాన్ని చెల్లించని టెలికాం కంపెనీలకు టెలి కమ్యూనికేషన్ల డిపార్ట్‌మెంట్‌ డెడ్‌లైన్‌ విధించింది. బకాయిలు రాబట్టడంలో విఫలమయ్యారంటూ కేంద్రంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి 11.59 గంటల కల్లా బకాయిలను చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

* కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీనికోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి తమకు అభ్యంతరం లేదని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని బొత్స ప్రశ్నించారు.

* ఇంటి నిర్మాణ అనుమతులను సత్వరం ఇచ్చే లక్ష్యంతో ఏప్రిల్‌ 2 నుంచి టీఎస్‌ బీ పాస్‌ను అమలు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పౌరులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు సంస్కరణలు అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేసి పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

* ఐటీ దాడుల వ్యవహారంపై తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. తేలుకుట్టిన దొంగల్లా తెదేపా నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే సంస్కృతిని చంద్రబాబే ప్రవేశపెట్టారని విమర్శించారు. గత ఐదేళ్లలో రూ.వేలకోట్లు దోచేశారని ఆరోపించారు.

* ఏపీలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 99 లక్షల 37 వేల 394 మంది అని తెలిపింది. పురుష ఓటర్లు కోటీ 97 లక్షల 21 వేల 514 కాగా.. మహిళా ఓటర్లు 2కోట్ల 2 లక్షల 4 వేల 378 మంది అని తెలిపింది. రాష్ట్రంలో ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 7,436, ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 4,066 మంది ఉన్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది.

* మేడారం జాతరలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు కొనసాగుతోంది. వరంగల్ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో 494 హుండీలను భద్రపరిచారు. గత మూడు రోజులుగా హుండీలు తెరిచి కానుకల లెక్కింపు కొనసాగిస్తున్నారు. గురువారం నాటికి 129 హుండీల లెక్కింపు పూర్తి అయింది. గురువారానికి రూ.2,92,76,000 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.

* ఈ ఆధునిక కాలంలో ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తున్నా ఇంకా కొందరు ఆచారాలు, మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. గుజరాత్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. భుజ్‌ ప్రాంతంలోని ఓ మహిళల కాలేజీలో రుతుస్రావాన్ని గుర్తించేందుకు 68 మంది విద్యార్థినులతో బలవంతంగా దుస్తులు విప్పించారు అక్కడి సిబ్బంది.

* జమైకా చిరుతపులి, స్ప్రింటర్‌ ఉసెన్‌ బోల్ట్‌ గురించి తెలియని వారుండరు. కేవలం 9.58 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అయితే బోల్ట్‌ను మించిన వేగంతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో స్టార్‌ అయ్యాడు కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి. కేవలం 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరిగెత్తి ఔరా అనిపించాడు. అది కూడా మామూలు నేలపై కాదండోయ్‌.. బురద పొలంలో ఓ చేత్తో ఎద్దులను పట్టుకుని మెరుపువేగంతో దూసుకెళ్లాడు.

* అవినీతిలో కూరుకుపోయిన సీఎం జగన్‌.. అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రూ.2లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని చెప్పారు. దొంగే.. దొంగా అన్నట్లు వైకాపా నేతల వ్యవహారశైలి ఉందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని.. ఆర్థిక అత్యయిక పరిస్థితి రాబోతోందని ఉమ చెప్పారు.

* ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. దేశంలోని 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85లక్షలు దొరికాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు జైలు భయం పట్టుకుందని లోకేశ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఐటీ దాడులను తెదేపాకు ముడి పెట్టాలని తాపత్రయపడుతున్నారనీ.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

* రాష్ట్ర ఆరోగ్యశాఖ నిద్రమత్తులో తూలుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం సమీక్షలు కూడా నిర్వహించకుండా వ్యవస్థను గాలికొదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కొవిడ్‌-19 సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొవిడ్‌-19 నివారణకు భాజపా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి భాజపా కార్యాలయంలో లక్ష్మణ్ ప్రారంభించారు.

* పుల్వామా దాడిని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌ విమర్శలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మన భద్రతా బలగాలను రాహుల్‌ అవమానిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని దుయ్యబట్టింది. జవాన్ల త్యాగాలను స్మరించుకున్న రాహుల్‌.. ట్విటర్‌ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ ఆ దాడితో ఎవరు ప్రయోజనం పొందారు..? భద్రతా లోపాలకు బాధ్యులు ఎవరు?’ అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.

* పాటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్ గత 20 రోజలుగా కనిపించడంలేదని ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. గుజరాత్ ప్రభుత్వం తన భర్తను కేసుల పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు. ‘‘నా భర్త 20 రోజులుగా కనిపించడంలేదు. ఆయన ఎక్కడున్నారనే దానిపై మాకు సమాచారం లేదు’’ అని వీడియోలో కింజల్‌ ఆరోపించారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల విషయంలో సుప్రీం కోర్టు టెలికాం సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ప్రభావం మార్కెట్లపై పడింది. దీనివల్ల టెలికాం కంపెనీల నిరర్ధక ఆస్తులు పెరిగే సూచనలు ఉన్నాయన్న భయాలతో బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో సెన్సెక్స్‌ 202.05 పాయింట్లు నష్టపోయి 41,257.74 వద్ద ముగిసింది. నిఫ్టీ 61.20 పాయింట్లు నష్టపోయి 12,113.50 వద్ద స్థిరపడింది.

* కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రెండురోజుల పాటు హైదరాబాద్‌, బెంగళూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనకు ఈ నెల 16, 17 తేదీలను ఖరారు చేశారు. బడ్జెట్‌లో ప్రభావితం కానున్న వర్గాలను ఆమె కలవనున్నారు. ఈ రెండు నగరాల్లో తొలుత ఆమె వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, రైతులతో మాట్లాడనున్నారు. ఇక రెండో సెషన్‌లో ఆర్థిక వేత్తలు, పన్ను ప్రాక్టిషనర్లు, విద్యావంతులు, విధాన కర్తలతో భేటీ కానున్నారు.

* ఆటోమేషన్‌ వల్ల దేశంలో 9శాతం మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ డిప్యూటీ ఫస్ట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డేవిడ్ లిప్టన్‌ అంచనా వేశారు. దేశ ఆర్థిక వ్యవస్థని మరింత విస్తరించడం వల్ల వీరికి ఉపాధి దొరికే అవకాశం ఉందన్నారు. గురువారం సి.డి.దేశ్‌ముఖ్‌ స్మారకోపన్యాసంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఆర్థిక మందగమనాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే దేశ ఆర్థిక వృద్ధి 6-7శాతం ఉండేదని తెలిపారు.