NRI-NRT

బ్రిటన్ వీసా నిబంధనలు మారాయి

New 2020 Rules For Britain Visa-Telugu NRI NRT News

ప్రపంచంలోని ప్రతిభావంతులు, ఉత్తమమైన నిపుణులను తమ దేశానికి రప్పించే విధానంలో భాగంగా త్వరలో పాయింట్ల ఆధారంగా నూతన వీసా విధానాన్ని అమలులోకి తేనున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. ఈ మేరకు బ్రిటన్‌ హోం కార్యదర్శి ప్రీతి పటేల్‌ ఒక ప్రకటన చేశారు. జనవరి 1, 2021 నుంచి ఇది అమలులోకి రానున్నట్లు తెలిపారు. గత నెల చివర్లో యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చింది. దీంతో బ్రెగ్జిట్ విధానానికి ముందు అమలులో ఉన్న నిబంధనలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలతో పాటు, నాన్‌ యూరోపియన్‌ దేశాలకు ఒకే విధంగా అమలుకానున్నాయి. నైపుణ్యం, అర్హతలు, జీతం, వృత్తి ఆధారంగా పాయింట్లు ఇస్తారు. వాటి ప్రకారం వీసా మంజూరు చేయనున్నట్లు హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ‘‘ఇది ఎంతో చరిత్రాత్మకమైన రోజు. మా దేశ సరిహద్దులపై పూర్తి నియంత్రణను తిరిగి తీసుకోనున్నాం. ప్రజల ప్రాధాన్యతల ఆధారంగా పాయింట్ల పద్ధతిలో మా ఇమిగ్రేషన్ విధానంలో మార్పులు చేయనున్నాం. ఇది మా దేశంలోకి వలస విధానాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు, ఉత్తమమైన నిపుణులను నూతన వీసా విధానంతో ఆకర్షిస్తాం. దీంతో బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ, సమాజం, దేశ సామర్థ్యం మరింత బలపడుతుందని’’ అని అన్నారు. వలస కార్మికులపై ఎక్కువగా ఆధారపడకుండా కఠినమైన భద్రతా చర్యలతో దేశంలోకి వలసలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడినట్లు బ్రిటన్‌ హోం మంత్రిత్వశాఖ తెలిపింది. నూతన ప్రపంచస్థాయి విధానం ద్వారా యూరోపియన్‌, నాన్‌ యూరోపియన్‌ దేశాల ప్రజలను ఇక మీదట సమానంగా చూస్తారు. అధిక నైపుణ్యం కలిగిన వ్యక్తులు, గొప్ప తెలివితేటలు కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, విద్యారంగ నిపుణలు వంటి వారికి అధిక ప్రాధాన్యం లభిస్తుందని బ్రిటన్‌ హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. శుక్రవారం నుంచి గ్లోబల్ టాలెంట్ స్కీమ్‌ పేరుతో ఫాస్ట్‌ట్రాక్ వీసా పనులు మొదలవుతాయని తెలిపింది. వచ్చే ఏడాది నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉద్యోగ అవకాశం లేకపోయినా బ్రిటన్‌కు రావచ్చని వెల్లడించింది. బ్రిటన్‌ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన వారిని ఆకర్షించేందుకు ఈ పాయింట్ల విధానంలో కొత్త పద్ధతిని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు బ్రిటన్‌లో పనిచేయాలనుకునే వారు ఆంగ్లంలో మాట్లాడగలగడం, నిర్దిష్ట నైపుణ్యాలు కలిగి ఉండాలి. దానితో పాటు మైగ్రేషన్ సలహా కమిటీ (ఎమ్ఏసీ) నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశం, కనీస వేతనం 25,600 పౌండ్లుగా ఉండాలి. గతంలో వృత్తి నిపుణల కనీస వేతన పరిమితి 30 వేల పౌండ్లుగా ఉండేది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్రిటన్‌లో పనిచేస్తూ అక్కడే నివసించాలనుకున్న వారు డిగ్రీ స్థాయి విద్యలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీని వల్ల బ్రిటన్‌ పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన పనివారిని నియమించుకోగలుతుంది అని హోం మంత్రిత్వశాఖ తెలిపింది. 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ నైపుణ్యం లేని వారు బ్రిటన్‌లోకి రావడానికి ఎటువంటి అవకాశంలేదని స్పష్టం చేశారు. ఆ ప్రకారం యూరోపియన్‌ దేశాలకు చెందిన వారిలో 70 శాతం మందికి ప్రమాణాలమేరకు నైపుణ్యాలు లేవని హోంశాఖ పేర్కొంది. విద్యార్థి వీసాలు కూడా పాయింట్ల ఆధారంగానే జారీ అవుతాయని తెలిపింది. ఈ మేరకు వారంతా గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి చదువుకునేందుకు అవకాశం పొందాలి. అంతేకాకుండా ఆంగ్లంలో మాట్లడగలగాలి, ఆర్థికంగా తమను తాము పోషించుకోగలమని నిరూపించాలి. యూరోపియన్ యూనియన్‌, వీసా లేని దేశాలకు చెందిన ప్రజలకు బ్రిటన్‌లో ఆరు నెలలు పర్యటించేందుకు ఎటువంటి వీసా పరిమితులు అవసరంలేదు. అయితే డిసెంబరు 31, 2020 వరకు బ్రిటన్‌లో నివసిస్తున్న యూరోపియన్ యూనియన్‌ దేశాలకు చెందిన వారు జూన్‌ 2021 లోపు యూరోపియన్‌ యూనియన్‌ సెటిల్‌మెంట్ స్కీం కింద బ్రిటన్‌లో శాశ్వత నివాసం పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని హోంశాఖ తెలిపింది.