Devotional

శివ మహత్స్యం…అదే శివరాత్రి సారం

What is Shivaratri? Why is it celebrated?

1. ‘శివ మహత్యం –శివరాత్రి ప్రత్యేకం – ఆద్యాత్మికం – 19/02
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ఏదో మాట వరసకు జన్మానికో శివరాత్రి అంటారు గాని, నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది.
***హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజించి, జాగరం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం.
***పురాణాలే కాదు, వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలు ఆనాటి శివారాధనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. అవి క్రీస్తుపూర్వం ఎనిమిదివేల ఏళ్ల నాటివని చరిత్రకారుల అంచనా. భీమ్‌భెట్కా గుహలలో శివతాండవ దృశ్యాలు, శివుడి త్రిశూలం, ఆయన వాహనమైన నంది చిత్రాలు నేటికీ నిలిచి ఉన్నాయి. సింధులోయ నాగరికత కాలంలో హరప్పా మొహెంజదారో ప్రాంతాల్లోని ప్రజలు శివుడిని పశుపతిగా ఆరాధించేవారనేందుకు మొహెంజదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు దొరికాయి. వేద వాంగ్మయం శివుడిని ప్రధానంగా రుద్రుడిగా ప్రస్తుతించింది.
***రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడు ‘డయోనిసిస్‌’కు శివుని పోలికలు ఉండటంతో భారత భూభాగంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్‌ ఇక్కడి శివుడిని ‘ఇండియన్‌ డయోనిసిస్‌’గా అభివర్ణించాడు. కాలక్రమేణా భారత ఉపఖండంలో శివుడినే పరమదైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది.
***భగవద్గీత కంటే ముందునాటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా, శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో చాలా రాజ్యాలు శైవాన్ని బాగా ఆదరించాయి. ఆ కాలంలోనే విస్తృతంగా శివునికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. అందరివాడు
శివుడు అందరివాడు. బ్రహ్మవిష్ణు దేవేంద్రాది దేవతలే కాదు, రావణుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు తెలుస్తోంది. దేవ దానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ, మహాభారత కాలాల నాటికే శైవమత వ్యాప్తి విస్తృతంగా ఉండేది. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు స్థితికారకుడని, శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా, శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు.
***కర్ణాటకలోని మురుడేశ్వరుడు
శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలో పూజిస్తారు. చాలాచోట్ల శివాలయాల్లో శివుని పూర్తి విగ్రహాలకు బదులు శివలింగాలే కనిపిస్తాయి. శివపురాణం, లింగపురాణాల్లో శివుని మహిమలకు సంబంధించిన గాథలు విపులంగా కనిపిస్తాయి. అంతేకాదు, మిగిలిన పురాణాల్లోనూ శివుని ప్రస్తావన, శివునికి సంబంధించిన గాథలు కనిపిస్తాయి. సనాతన మతాలైన వైష్ణవ, శాక్తేయాల్లోనూ శివునికి సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. స్మార్త సంప్రదాయంలోని పంచాయతన దేవతల్లో శివుడికీ స్థానం కల్పించారు. వైష్ణవం పుంజుకోక ముందు ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల్లోని పలు రాజ్యాల్లో శైవానికి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రతి రాజ్యంలోనూ శివాలయాలు వెలిశాయి. వాటికి సంబంధించిన స్థల పురాణాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుషానుల పాలనలో చలామణీలో ఉన్న బంగారు నాణేలపై నంది వాహనంతో శివుని బొమ్మను ముద్రించారంటే ఆనాటి కాలంలో శైవానికి ఎలాంటి ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
**ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు
శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం, జామ్‌నగర్‌లో నాగేశ్వర క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం, ఇండోర్‌ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం, ఉత్తరాఖండ్‌లో కేదారనాథ క్షేత్రం, మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం, నాసిక్‌ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం, ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం, జార్ఖండ్‌లో దేవ్‌గఢ్‌ వద్ద వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.
**ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి.
**పంచభూత క్షేత్రాలు
ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా, అరుణాచలం అగ్ని క్షేత్రంగా, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీక్షేత్రంగా, చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి.
**ఆదియోగి
మన పురాణాలు ఆదియోగి శివుడేనని చెబుతాయి. పరమయోగులందరికీ శివుడే గురువని చెబుతాయి. సనాతన మతాలలో యోగసాధనకు విస్తృత ప్రాధాన్యం ఉంది. జీవుని అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్యపథాన్ని చేరుకోవడానికి యోగమే మార్గమని, యోగసాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగ విద్యలో వివిధ పద్ధతులు ఉన్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠయోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగసాధనకు గల ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులు నిరంతరం ఈతిబాధల్లో కొట్టుమిట్టాడుతుంటారని, పరమాత్మను చేరుకోవాలంటే మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కాశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో చెప్పాడు.
***ఉపఖండానికి వెలుపల…
భారత ఉపఖండానికి వెలుపల సైతం ప్రాచీనకాలం నుంచి శివారాధన ఉండేది. ఇండోనేసియాలో శివుడిని ‘బటరగురు’గా ఆరాధిస్తారు. ‘బటరగురు’ అంటే ఆదిగురువు అని అర్థం. ‘బటరగురు’ శిల్పరూపం, ఆరాధన పద్ధతులు దాదాపు మన దేశంలోని దక్షిణామూర్తిని పోలి ఉంటాయి. ఇండోనేసియాలోని లువులో పురాతనమైన ‘బటరగురు’ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ఆగ్నేయాసియాలో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాలంలో సైతం జావా దీవుల్లో శివారాధన కొనసాగేది. అక్కడి ప్రజలు శివుడిని బుద్ధుడు, జనార్దనుడు (విష్ణువు)తో సమానంగా ఆరాధించేవారు. అక్కడి ప్రజలు బుద్ధుడిని శివుని తమ్ముడిగా భావిస్తారు. కుషానుల కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలోనూ శైవమత ప్రాబల్యం ఉండేది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న సోగ్డియా, యుతియాన్‌ రాజ్యాలలో శివారాధన జరిగేది. జపానీయులు పూజించే ఏడుగురు అదృష్టదేవతలకు శివతత్వమే మూలమని చరిత్రకారులు భావిస్తారు. తాంత్రిక ఆచారాలు పాటించే వజ్రయాన, మహాయాన బౌద్ధులు శివుడిని కూడా పూజిస్తారు.
*పరమశివునికి పదివేల పేర్లు
ప్రసిద్ధ దేవతలను సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం పరిపాటి. అదే కోవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, మహన్యాసంలో శివునికి దశసహస్రనామాలు ఉన్నాయి. అందులోని పదివేల పేర్లూ పరమశివుని గుణ విశేషాలను స్తుతించేవే! మహాదేవుడిగా, మహేశ్వరుడిగా, త్రినేత్రుడిగా, రుద్రుడిగా, హరుడిగా, శంభునిగా, శంకరునిగా భక్తులు శివుడిని ఆరాధిస్తారు. యోగముద్రలో ఉన్న శివుడిని దక్షిణామూర్తిగా, తాండవ భంగిమలోని శివుడిని నటరాజుగా కూడా పూజిస్తారు.
**శివరాత్రి ప్రశస్తి
మహాశివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగరమథన ఘట్టం అందరికీ తెలిసినదే. అయితే, ఇదేరోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని, ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా నృత్యగాన కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు. మన దేశంలోని వివిధ ఆలయాలతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలోను, పాకిస్తాన్‌లోని ఉమర్‌కోట్‌లో ఉన్న శివాలయంలోను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మారిషస్‌లో శివరాత్రి రోజున భక్తులు ‘గంగాతలావొ’ సరస్సులో పవిత్రస్నానాలను ఆచరిస్తారు.
2.రావణ వాహనంపై శ్రీశైల మల్లన్న
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఐదో రోజు మంగళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లు రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు శ్రీగిరి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.
3.కడిగేసి.. ఆరేసి.. లెక్కేసి
మేడారం జాతర సమయంలో కురిసిన వర్షం వల్ల హుండీ పెట్టెల్లో నీరు చేరి కానుకలు తడిసి ముద్దయ్యాయి. భక్తులు వేసిన బియ్యం, ఇతర కానుకలు కలిసిపోయి బూజు పట్టాయి. అధికారులు, వాలంటీర్లకు లెక్కింపు ప్రక్రియ ఇబ్బందిగా మారింది. తడిసిన కరెన్సీ నోట్లను తొలుత సర్ఫు నీటిలో కడుగుతున్నారు. తర్వాత వాటిని వేరు చేస్తున్నారు. నోట్లను ఆరబెట్టి ఇస్త్రీ చేసి, లెక్కిస్తున్నారు. హన్మకొండలోని తితిదే కల్యాణ మండపంలో వారం రోజులుగా లెక్కింపు కొనసాగుతోంది. మంగళవారం వరకు 436 హుండీలు లెక్కించగా రూ.10.29 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
4. బుగ్గన రాలేదని ఆగిన మల్లన్న!
శివుడాజ్ఞలేనిదే చీమైనా కుట్టదంటారు…కానీ, అమాత్యుడు రాలేదని అదే శివుడు సమయానికి ఉత్సవానికి నోచుకో లేదు. శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు స్వామి అమ్మవార్లకు రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉంది. ప్రభుత్వం తరుపున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి హాజరవుతున్నట్టు దేవస్థాన అధికారులు సమాచారం అందింది.అనంతరం ఏడుగంటల సమయంలో రావణసేవనూ నిర్వహించాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆ కార్యక్రమాలు ముగించుకుని రాత్రి 8గంటలకు శ్రీశైలం చేరుకున్నారు. వీరు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత రావణవాహన సేవ రాత్రి 9గంటలకు ప్రారంభమైంది. స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవం రాత్రి 10గంటల అనంతరం ముగిసింది. మంత్రి రాలేదని రెండుగంటలపాటు గ్రామోత్సవాన్ని నిలిపివేయడం పట్ల భక్తులు పెదవివిరుస్తున్నారు.
5. మహాశివరాత్రికి ముస్తాబవుతున్న రాజన్న ఆలయం
మహాశివరాత్రి ఉత్సవానికి వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ముస్తాబవుతున్నది. 20వ నుంచి 22 వరకు జరిగే జాతరకు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణవేణి తెలిపారు. ఇందులో భాగంగా రాజన్న ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఆలయ గోపురం విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నది. రాజన్న ఆలయ ప్రాంగణం మొత్తం కలకత్తా క్లాత్ డెకోరేషన్తోఅందగా అలంకరించారు. జాతరపనులను మంగళవారం సాయంత్రం ఎస్పీ రాహుల్ హెగ్డే, ఆర్డీవో శ్రీనివాసరావ్ పరిశీలించారు. భక్తులకు చలువపందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటుచేసామని, క్యూలైన్లలో మంచినీటిని సరఫరా చేస్తామని వారు తెలిపారు. ధర్మగుండంలో మంచినీటిని నింపామని, 4000 వేల లీటర్ల కెపాసిటీతో ఉన్న వాటర్ట్యాంకర్ని భక్తులకు అందుబాటులో ఉండే విధంగా వివిధ ప్రాంతాలలో ఉంచనున్నట్లు, జాతరసందర్బంగా దేవస్థానం ఆవరణలో సీసీ కెమరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి వేడుకలను మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనంతో, వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు సహకారంతో, కలెక్టర్ కృష్ణభాస్కర్ సూచనలమేరకు ఈ యేడాది కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చెరువులోని మైదాన ప్రాంతంలో పార్కింగ్ స్థలాన్ని, శివార్చన కోసం వేదికను అత్యంత అద్భుతంగా తయారుచేస్తున్నామని, భక్తులకు స్వాగత కమాన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మహాశివరాత్రి రోజున దేశంలో పేరుగాంచిన కళాకారులచే శివతాండవం, శివార్చన నృత్యరూపకాలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకోసం 300 బస్సులు ఉంటాయని, భక్తుల సౌకర్యార్థం 6 సెక్టార్లుగా, 2 వీఐపీ పార్కింగ్, 3 అత్యవసర పార్కింగ్లు, 3 హోర్డింగ్ పార్కింగ్, 3 ఆటో పార్కింగ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయ గోపురాలకు రంగులు వేసే పని, చెరువులోని మైదాన ప్రాంతంలో హైమాస్ట్ లైట్స్ బిగించే పనులు పూర్తిదశలో ఉన్నాయని, ఇంజినీరింగ్ ఈఈ రాజేశ్, డీఈ మధు రఘునందన్, డీఈ రామేశ్వర్రావ్, ఏఈ రాంకిషన్రావ్, నాగరాజు పర్యవేక్షణలో సిబ్బంది జాతర పనులను పూర్తిచేయడంతో నిమగ్నమయ్యారని అన్నారు. మూడురోజులపాటు మూడు షిప్టుల్లో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటారని డీఎస్పీ వెల్లడించారు. మొబైల్ వాటర్ట్యాంకర్లతో పట్టణంలోని పలుచోట్ల మంచినీటిని సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్నామని, క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామని అన్నారు.
6. మేడారం హుండీ లెక్కింపు: రికార్డు బ్రేక్
ఈ ఏడాది మేడారం జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తల్లి దర్శనానికి వచ్చిన భక్తులు మెక్కులు తీర్చుకుని హుండీలో కానుకలు సమర్పించుకున్నారు. ఆ హుండీల్లో భక్తులు వేసిన కానుకల లెక్కింపు ఏడు రోజులగా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జరుగుతోంది. ఇప్పటికే హుండీ ఆదాయం పాత రికార్డులను బ్రేక్ చేసింది. రికార్డు స్థాయిలో 2018 జాతర సందర్భంగా 10 కోట్ల 17లక్షల 50వేల 363 రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈ సారి ఇప్పటికే దాన్ని మించి పోయింది. ఇప్పటి వరకు 10కోట్ల 29 లక్షల 92 వేల రూపాయలు లెక్కించారు. మొత్తం 494 హుండీలు ఉండగా.. 7వ రోజుకు 420 హుండీల్లో లెక్కింపు ముగిసింది. ఇంకా మిగిలి ఉన్న వాటిని లెక్కించగానికి మరో రెండ్రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
7. ముస్తాబైన దుబ్బరాజన్న
నేటి నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు – 19 నుంచి 23వరకు ఉత్సవాలు
శైవక్షేత్రాలలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన సారంగాపూర్ మండలం పెంబట్ల, కోనాపూర్లోని దుబ్బరాజన్న ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చి స్వయంభూగా వెలసిన దుబ్బరాజేశుడికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 19 నుంచి 23 వరకు అత్యంత వైభవంగా జాతర బ్రహ్మోత్సవాలు జరగుతుండటంతో ఆయా జిల్లాల నుంచి దాదాపు 4లక్షలకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇందుకు అనుగుణంగా రెవెన్యూ, పోలీసు, ఆలయ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.
*ఐదు రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు
దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుంచి 23వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 19న సాయంత్రం 6.05 గంటలకు స్వస్తిశ్రీ పుణ్యాహవచనం, అంకురార్పణ, 20న రాత్రి 8.21 గంటలకు స్వామివారి కల్యాణమహోత్సవం ఉంటుంది. 21న మహాశివరాత్రిజాగరణ, రాత్రి 12గంటలకు లింగోద్భవ కాలమున రుద్రాభిషేకం, నిశీపూజ, 22న పారణ, 23న ఉదయం 10.23 గంటలకు స్వామివారి రథోత్సవం(స్వామివారు రథంపై ఊరేగింపు) నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత వచ్చే మొదటి సోమవారం 24న ఏకాదశ రుద్రాభిషేకం, అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
*బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా యంత్రాంగా దుబ్బరాజన్న జాతర బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షాలాధి మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల నుంచి ప్రతి 10నిమిషాలకో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ కోసం మూడు షిప్టులలో 60 మది కార్మిక సిబ్బందిని నియమించారు. క్లోరినేషన్, తాగునీటి కోసం అన్నీ ఏర్పాట్లు చేయగా జాతర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్డీవో నరేందర్ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్పూర్ తహసీల్దార్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ గదిని ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడే పర్యవేక్షించనున్నారు. గర్భగుడిలో అభిషేకాలు లేకుండా ప్రత్యేకంగా ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేశారు. స్థానిక భక్తులకు ఉదయం 3గంటల నుంచి 6గంటల వరకు గర్భగుడిలో అభిషేకాలకు అనుమతి ఇచ్చారు.
8. తిరుమల\|/సమాచారం
_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈరోజు శుక్రవారం,
*19.02.2020*
ఉదయం 6 గంటల
సమయానికి,
_తిరుమల: *14C°-27C°*_
• నిన్న *70,599* మంది
భక్తులకు కలియుగ దైవం
శ్రీవేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం లభించింది,
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్
లో *04* కంపార్ట్మెంట్
లలో సర్వదర్శనం కోసం
భక్తులు వేచి ఉన్నారు.

• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*05* గంటలు
పట్టవచ్చును,
• నిన్న *17,000* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు తీర్చుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీ లో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 2.92* కోట్లు,
• నిన్న *22,944* మంది
భక్తులకు శ్రీ పద్మావతి
అమ్మవారి దర్శన భాగ్యం
కలిగినది,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
రెండు గంటల సమయం
పట్టవచ్చును,
_*/ / గమనిక / /*_
• ఫిబ్రవరి 21న గోగర్భ
తీర్థంలోని క్షేత్రపాలకునికి
మహాశివరాత్రి వేడుకలు,

• ₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి
శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక
విఐపి బ్రేక్ దర్శన భాగ్యం
కల్పించిన టిటిడి,
_*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*_
_కౌసల్యా సుప్రజా రామ_
_పూర్వా సంధ్యా ప్రవర్తతే,_
_ఉత్తిష్ఠ నరశార్దూల_
_కర్తవ్యం దైవమాహ్నికమ్_
*తా:* _కౌసల్యాదేవికి_
_సుపుత్రుడవగు ఓ_
_రామా! పురుషోత్తమా!_
_తూర్పు తెల్లవారుచున్నది._
_దైవ సంబంధములైన_
_ఆహ్నికములను_
_చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_
*ttd Toll free*
*#18004254141*
9. పంచాంగము 19.02.2020
సంవత్సరం: వికారి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: శిశిర
మాసం: మాఘ
పక్షం: కృష్ణ బహుళ
తిథి: ఏకాదశి సా.05:29 వరకు
తదుపరి ద్వాదశి
వారం: బుధవారం (సౌమ్య వాసరే)
నక్షత్రం: మూల ఉ.09:04 వరకు
తదుపరి పూర్వాషాఢ
యోగం: వజ్ర ఉ.07:50 వరకు
తదుపరి సిధ్ధి
కరణం: బాలవ ప.03:05 వరకు
తదుపరి తైతుల
వర్జ్యం: ఉ.07:28 – 09:04
తదుపరి రా.06:48 – 08:25 వరకు
దుర్ముహూర్తం: 12:06 – 12:53
రాహు కాలం: 12:30 – 01:57
గుళిక కాలం: 11:02 – 12:30
యమ గండం: 08:08 – 09:35
అభిజిత్ : 12:07 – 12:53
సూర్యోదయం: 06:40
సూర్యాస్తమయం: 06:19
వైదిక సూర్యోదయం: 06:44
వైదిక సూర్యాస్తమయం: 06:15
చంద్రోదయం: రా.03:20
చంద్రాస్తమయం: ప.02:41
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
దిశ శూల: ఉత్తరం
చంద్ర నివాసం: తూర్పు
10. చరిత్రలో ఈరోజు
ఫిబ్రవరి 19/02/2020
సంఘటనలు:
1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.
1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు.
1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. ‘సౌత్ షెట్లాండ్ దీవులను’ కనుగొని, వాటికి హక్కుదారులుగా, ‘కింగ్ జార్జి ĪĪĪ’ పేరు పెట్టాడు.
1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.
1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).
1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం – వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.
1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది ‘కాన్సాస్’ రాష్ట్రం.
1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.
1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
1976: ఫ్రెంటె పోలిసారియో – డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.
1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.
1982: బోయింగ్ 757 అనే విమానం మొట్ట మొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.
1984: 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.
1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని ‘బిల్బావొ’ దగ్గర కూలి 150 మంది మరణించారు.
1985: ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.
1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
1985: కోకా కోలా దటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.
1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.
1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.
1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ‘మీర్’ అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.
1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు
1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.
2002: నాసా కుజగ్రహానికి పంపిన ‘మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక’ “థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం”ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
2008: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
జననాలు:
1473: నికోలస్ కోపర్నికస్, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)
1564: గెలీలియో గెలీలి, భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. (మ.1642)
1630: ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర
1899: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
1905: వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.
1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)
1930 : తెలుగు సినిమా దర్శకుడు కె. విశ్వనాథ్ జననం.
1952: ఆలపాటి లక్ష్మి, ప్రముఖ రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
మరణాలు:
1915: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)
1941: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)
1997: డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.
2009: నిర్మలమ్మ, ప్రముఖ తెలుగు సినిమా నటి.
2011: వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.
2015: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)
2018: గుండు హనుమంతరావు, ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు. (జ.1956)
11. రాశిఫలం -19/02/2020
తిథి:
బహుళ ఏకాదశి సా.5.04, కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం:
మూల ఉ.8.35
వర్జ్యం: ఉ.6.59 నుండి 8.35 వరకు, తిరిగి సా.6.18 నుండి 7.55 వరకు
దుర్ముహూర్తం:
ఉ.11.36 నుండి 12.24 వరకు
రాహు కాలం:
మ.12.00 నుండి 1.30 వరకు విశేషాలు: సర్వేషాం ఏకాదశి
మేషం:
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్తఅవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృష:
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణ బాధలు తొలగును. ఆరోగ్యం మెరుగవుతుంది.
మిథునం:
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసికాందోళనతో కాలం గడుపుతారు. స్ర్తిలు చేసే వ్యవహారాల్లో సమస్యలెదురవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశముంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగానుండుట మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
కర్కాటకం:
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయ. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండానుండుట మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలను చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి.
కన్య:
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
తుల:
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధవహిస్తారు.
వృశ్చికం:
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
ధనుస్సు:
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఋణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలత లేర్పడే అవకాశముంది. బంధు మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్తవహించుట మంచిది. మానసికాందోళన అధికమవుతాయ. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తివస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం:
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధన లాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
మీనం:
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
12. హనుమంత వాహనంపై వేంకటాద్రిరాముడు
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండరామస్వామివారి అవతారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
*హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి
బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు వరదహస్తం దాల్చిన కల్యాణ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మహత్మ్యంలో శ్రీవారు వేంచేసిన పుట్ట – కౌసల్య, చింతచెట్టు – దశరథుడు, శేషాచలం – లక్ష్మణుడు, పర్వతప్రాంతం – అయోధ్య అని పేర్కొనబడింది. శ్రీరాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించిన సన్నివేశాలు శ్రీమద్రామాయణంలో ఉన్నాయి. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.కాగా మధ్యాహ్నం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5.00 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జ‌రుగ‌నుంది.
*గజ వాహనం – క‌ర్మ విముక్తి
రాత్రి 8.00 నుండి 9.00 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.
13. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ క్రమంలో ఆనవాయితీ ప్రకారం నంద్యాలలోని శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామిని… మహానందీశ్వర స్వామి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఇరువురు ఉత్సవమూర్తులకు నంద్యాలలో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మహనందికి బయల్దేరి వెళ్లారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకూ నంద్యాల బ్రహ్మనందీశ్వర స్వామి మహానందిలో ఉంటారు.
14. శైవక్షేత్రం శివరాత్రి వైభవం-20 నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ-వేములవాడలో శివరాత్రి తర్వాతే శివ కల్యాణం
కోడె కడితే కోటి వరాలిచ్చే ఎముడాల రాజన్న కొలువైన శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. లెంబాలవాటికగా పేరుగాంచి క్రమేణా వేములవాడ పట్టణంగా మారి ప్రసిద్ధ ఆధ్యాత్మిక పట్టణంగా విరాజిల్లుతుంది. పట్టణం నడిబొడ్డున ఆలయాలతో నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. దక్షిణకాశీగా పేరుగాంచి, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందింది. హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ మహా శివరాత్రి. ఈ మహా జాతరను ఈనెల 20 నుంచి 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేపడుతుంది. ఈ సందర్భంగా రాజన్న ఆలయ స్థలపురాణం, పట్టణంలో ఆలయాలు, పూజల వివరాలపై కథనం.
**రాజన్న ఆలయంలోని ధర్మగుండానికి చాలా చరిత్ర ఉంది. మహిషాసురిడిని వధించిన తర్వాత పార్వతిదేవి రక్తపుమరకలతో వేములవాడ ఆలయం వద్దనున్న ధర్మగుండంలో స్నానాలు ఆచరించింది. అమ్మవారు స్నానం చేసిన పవిత్ర పుష్కరణి కావడంతో ముక్కోటి దేవతలు గుండంలో స్నానాలు చేసినట్లుగా ప్రచారంలో ఉంది. దేవతల ప్రభువైన ఇంద్రుడు వృత్తాసురడిని వధించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందేందుకు తన గురువు బృహస్పతిని కోరగా వేములవాడ ధర్మగుండంలో స్నానమాచరించి శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని తిరిగి స్వర్గానికి వెళ్లినట్లుగా ప్రచారముంది. దక్షుడు చేసే యజ్ఞంలో వీరభద్రునిచేత బాహువులను కోల్పోతాడు. బ్రాహ్మణోత్తముల సూచనలతో తన బాహువులను పొందేందుకు ధర్మగుండంలో స్నానం చేసి ఆలయంలో పూజిస్తే స్వర్ణబాహువులు పొందినట్లుగా ఇక్కడ వర్ణిస్తారు. అందుకే రాజన్న ఆలయానికి ఆదిత్యక్షేత్రం, భాస్కరక్షేత్రంగా పేరుంది. అజ్ఞాతవాసం గడిపిన పాండవులు, వనవాసంలో సీతారామచంద్రమూర్తులు దర్శించుకుని తపస్సు చేసినట్లుగా పురాణాల్లో ఉన్నట్లుగా స్థానికల అర్చకులు పేర్కొంటున్నారు. శివుడు విశ్రాంతి కోసం ఎవరికీ చెప్పకుండా కైలాసం నుంచి వేములవాడకు చేరాడని, గమనించిన వృషభుడు శివుడి వెనుకాలే వేములవాడకు వచ్చాడు. వృషభుని భక్తికి మెచ్చిన శివుడు రాజన్న ఆలయంలో తనకు కోడెమొక్కులు చెల్లించి తనతో సమానంగా చూస్తారని వరమిచ్చినట్లుగా స్థానికంగా కథనం ప్రచారంలో ఉంది.
**వేములవాడలో మాత్రమే కనిపించే ప్రత్యేక పూజలు…
ఇతర హిందూ ఆలయాల్లో కనిపించని పూజలు వేములవాడ రాజన్న ఆలయంలో మాత్రమే ఉన్నాయి. తాము కోరుకున్న కోర్కెలు తీరాలని ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. రైతులు కోడెలను అప్పగించే ఆచారం ఆలయంలో కొనసాగుతుంది. కోడెలతో ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో స్నానాలాచరించి తడిగుడ్డలతో శివుడి వాహనమైన కోడెను (నందీశ్వరడు) పట్టుకుని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ అల్లుబండకు (రాతిస్తంభం) కట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఆలయంలో అద్దెకోడెలతోనూ కోడెమొక్కులను చెల్లించుకోవచ్చు. భక్తులు తమ సొంత కోడెలను కూడా ఆలయానికి సమర్పించవచ్చు. ఆలయంలో ప్రధానంగా కోడెమొక్కుల ద్వారానే అధికంగా ఆదాయం అందుతుంది. ఆలయంలో మరో ప్రత్యేక పూజ అన్నపూజ అన్నంతో స్వామివారిని అభిషేకించి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. మొదట్లో రైతులు పండించిన తొలిపంటను స్వామివారికి నివేదించే ఆనవాయితీ అన్నపూజగా కొనసాగుతుంది. రాజన్న ఆలయంలో ప్రసిద్ధి గాంచిన మరో ప్రత్యేక పూజ మహాలింగార్చన. సంవత్సరంలో ఒకసారి మహాలింగార్చన చేస్తే సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలితం ఉంటుందని శివభక్తుల నమ్మకం. పలు పర్వదినాల్లో ఆలయంలో ఘనంగా మహా లింగార్చన పూజలు ఉంటాయి. మట్టితో తయారు చేసిన 366 చిరులింగాలను లింగాకారంలో పేర్చి పూజలు చేస్తారు. రాజన్న ఆలయ ప్రాంగణంలో 366 దేవతలు ఉండటంతో 15 ఆవరణలో పూజిస్తారు. అన్నపూజ, ఆకు పూజలు ఉన్నాయి. వేములవాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన బద్దిపోచమ్మ ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవారికి బోనాలు చెల్లించుకోవడం ఆనవాయితీ ఉంది. ఆలయానికి సమీపంలోనే శ్రీభీమేశ్వరాలయం ఉంది. నవగ్రహాల పూజలకు ప్రసిద్ధి. బద్దిపోచమ్మ ఆలయం ఎదురుగా నగరేశ్వర స్వామి ఆలయం ఉంది. పట్టణంలో పురాతనమైన శ్రీకేదారేశ్వరస్వామి ఆలయంలోనూ భక్తులు పూజలు చేస్తుంటారు.
**దేవతలకు నిలయం
శ్రీరాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంతో పాటు పలు ప్రసిద్ధిగాంచిన ఆలయాలున్నాయి. రాజన్నక్షేత్రం ఆవరణలోనే 366 మంది దేవతలు ఉన్నారు. వేములవాడ ఆలయాల్లో మాత్రమే కనిపించే పూజలు మరే ఇతర ఆలయాల్లో ఉండవు. ప్రతిచోట శివరాత్రికి శివకల్యాణం నిర్వహిస్తుంటే వేములవాడలో మాత్రం కామదహనం తర్వాత శివకల్యాణం నిర్వహిస్తారు. వేములవాడ పట్టణంలో ప్రసిద్ధ శ్రీరాజారాజేశ్వరస్వామి ఆలయంతో పాటు, ప్రముఖ దేవాయాలుగా పేరుగాంచిన బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు పురాతనమైన నగరేశ్వర, కేదారేశ్వర ఆలయాలు ఉన్నాయి. వేణుగోపాలస్వామి ఆలయం, 8 హనుమాన్ దేవాలయాలు, గాయత్రీమాత ఆలయం, అయ్యప్ప ఆలయాలు ఉన్నాయి. ఆలయం వివిధ మతాలు, పలు ఆచారాలకు నెలవుగా ఉంది. పేరుకే శివాలయమైన శైవంతో పాటు వైష్ణవ పూజలకు అంతే స్థానం ఉంది. రాజన్న ఆలయంలో క్షేత్రపాలకుడిగా అనంతపద్మనాభస్వామి ఉండటం, శ్రీసీతారామచంద్రమూర్తి స్వామివారి ఆలయం ఉండటంతో వైష్ణవపూజలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. శ్రీరామకల్యాణం ఘనంగా జరుగుతుంది. మహాశివరాత్రి తర్వాత పెద్ద వేడుక శ్రీరామనవమే. శైవులు, వైష్ణవులు, జైనులు, ముస్లిం మతస్థులతో పాటు అన్ని వర్గాల వారు కొలిచేక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఆలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, శివ కల్యాణాలు, కుంకుమార్చనలు, మహాపూజ, పెద్దసేవ తదితర పూజలతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. రాజన్న గర్భగుడిలో మూలవిరాట్టు శ్రీరాజరాజేశ్వరస్వామి ఎడుమ వైపున శ్రీలక్ష్మీగణపతి, కుడివైపున పార్వతీదేవి ఉంటుంది. గర్భగుడికి ఎదురుగా ముస్లిం దర్గా ఉండటంతో పెద్ద ఎత్తున ముస్లిం, హిందువులు దర్గాతో పాటు ఆలయంలో పూజించడం ఇక్కడ ప్రత్యేకత.