Business

పార్లేని నడిపిస్తున్న మహిళా శక్తి

Parle Agro CEO Sona Chauhan Life Story-Inspiring Business Leaders

భారతదేశంలో అతిపెద్ద పానీయాల ఉత్పత్తి సంస్థ పార్లే ఆగ్రో. ప్రూటీ, ఆపీ, ప్రూటీ ఫిజ్‌, ఆఫీ ఫిజ్‌, బెయిలే, ఫ్రియో, ఢిషూమ్‌, కేఫే క్యూబా వంటివెన్నో ఈ సంస్థ నుంచి మార్కెట్‌కి వచ్చాయి. నాలుగువేల కోట్ల సంస్థ అయిన పార్లే 5 వేలకు పైగా పార్టనర్స్‌ నెట్‌వర్క్‌తో, దేశవ్యాప్తంగా 14 లక్షల ఔట్‌లెట్స్‌ తో దూసుకుపోతున్నది. భారతీయ వినియోగ దారుడి అవసరాలకు అనుగుణంగా పరిశ్రమ దృక్పథాన్ని, ఆలోచన విధానాన్ని సమూలంగా మార్చేసిన పార్లే విజయం వెనుక ఒక మహిళ ఉంది. ఆమె సోనాచౌహాన్‌. ‘పార్లే ఆగ్రో’ సీఈఓ అయిన చౌహాన్‌ విజయగాథనే ఈ వారం సక్సెస్‌మంత్ర.
సోనా చౌహాన్ ఇండియాలో మోస్ట్ పవర్పుల్ బిజినెస్ వుమెన్లో ఒకరు. పార్లే ఆగ్రో కంపెనీకి సీఈఓ అయిన ఆమె.. 2006లో తన తండ్రి నుంచి కంపెనీ పగ్గాలు పొందారు. ఏడాదికి రూ. 600 కోట్ల బిజినెస్ చేసే కంపెనీని.. రూ.4,200 కోట్ల బిజినెస్ చేసే కంపెనీగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం పార్లే ఆగ్రోకి 13 చోట్ల ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. ప్యాకేజ్డ్ వాటర్, యాప్పీ ఫిజ్ డ్రింక్స్, స్నాక్స్, ఫ్రూటీ ఈ ఉత్పత్తులన్నీ పార్లే సొంతం.
****చిన్నవయసులోనే..
43 ఏండ్ల సోనా చౌహాన్ తన 22వ ఏట అంటే 1999లో తొలిసారి కంపెనీ బోర్డులో డైరెక్టర్గా చేరారు. 2006లో ఆమె సీఈఓ అయ్యాక వారి గ్రూపు విభిన్న రంగాల్లో వృద్ధిచెంది 50 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ‘బిజినెస్ స్కూల్ లుసానే’ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన సోనా తన తండ్రి ప్రకాశ్ చౌహాన్తో ఫ్యామిలీ బిజినెస్లో చేరింది.
****ఉద్యోగులను గౌరవిస్తూ..
2006లో పార్లే సీఈఓ కాగానే… ఆల్రెడీ తెలిసిన కంపెనీయే కావడంతో చౌహాన్ ఈజీగానే నిలదొక్కుకున్నారు. ఐతే… కంపెనీలో ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించారు. అప్పటికే ఉన్న టీమ్లో ఉత్సాహం నింపడంతో పాటు కొత్తవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగులను అమితంగా గౌరవిస్తూ… వాళ్ల సలహాలు, సూచనలూ తెలుసుకునేవాళ్లు. కుటుంబ భ్యులతో కంటే.. కంపెనీ ఉద్యోగులతోనే ఆమె ఎక్కువసేపు ఉండసాగారు. అందువల్ల కంపెనీలో ఉద్యోగులు కూడా ఆమె పట్ల అంతే గౌరవంతో మెలగసాగారు. సరైన వ్యక్తులను నియమించుకోవడం, ప్రతిభావంతులను కంపెనీలో నిలుపుకోవడం, కొత్త మార్పులకు తగినట్లు కంపెనీని నడపడం లో అనేక సవాళ్లను అధికమించి ముందుకు నడిపించడంలో విజయం సాధించారు.
****కుటుంబమంతా ఒక్కటిగా..
నిజానికి చౌహాన్ తండ్రికి ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురైన చౌహాన్కే కంపెనీ బాధ్యతలు అప్పగించాలని ఆయన కుటుంబసభ్యులతో మాట్లాడాక నిర్ణయం తీసుకున్నారు. ఐతే.. ఈ విషయంలో ఆయన రెండో మాట లేకుండా ఒకటే మాటకు కట్టుబడ్డారు. ఫలితంగా చౌహాన్పై పెద్ద బాధ్యత పడింది. చౌహాన్ మొదటి చెల్లి అలిషా చౌహాన్.. కంపెనీ కోసం ఫిలాంత్రోపీ చేశారు. చిన్న చెల్లి నదియా చౌహాన్… రీసెర్చ్, డెపలప్మెంట్, సేల్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ, కొత్త మార్కెట్ల అభివృద్ధి వంటివి చూసుకుంటున్నారు. ఇలా ముగ్గురికీ వేర్వేరు బాధ్యతలు అప్పగించిన చౌహాన్ తండ్రి… ఇక వాళ్ల పనుల్లో జోక్యం చేసుకోలేదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫలితంగా చౌహాన్ తనను తాను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. ‘నేను మా నాన్ననే మార్గదర్శకుడిగా భావిస్తాను. చాలా చిన్న వయసులో నేను ఆయనతో పనిచేసే అవకాశం పొందాను. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అంటారామె.
****విజయ తీరాలకు
చౌహాన్ లీడర్షిఫ్లో ఫ్రూటీ.. మ్యాంగో డ్రింక్స్ సెగ్మెంట్లో దూసుకెళ్లింది. పెప్సీ, కోకోకోలా లాంటి మల్టీ నేషనల్ కంపెనీ బ్రాండ్లు, ఇతరత్రా గట్టి పోటీ ఇచ్చినా.. ఆమె ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మనం ఏం చేస్తున్నాం.. ఏం చెయ్యాలి అని ఆలోచించారు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ కంపెనీని విస్తరిస్తూ పోయారు. ప్రధానంగా వినియోగదారుల రుచులు, అభిప్రాయాలకు అనుగుణంగా.. తమ ప్రొడక్ట్స్లో మార్పులు చెయ్యడంతో.. ఆమె విజయం వైపు నడవగలిగారు. ‘సవాళ్లతో పాఠం నేర్చుకోవాలి. కలల్ని సాకారం చేసుకునే క్రమంలో ఎదురయ్యే పరిస్థితుల నుంచి ఏదో ఒకటి కొత్తగా తెలుస్తుంది.దారిలో ఆటంకాలు వచ్చినప్పుడు వాటిని దాటుకు పోయేందుకు మరింత గట్టిగా కృషి చేయాలి. ముందుకు సాగాలంటే తెలివిని, భావోద్వేగాల్ని బ్యాలెన్స్ చేయాలి’ అని అంటారు చౌహాన్.
****రువాతి లక్ష్యం ఇదీ
2022 నాటికి టర్నోవర్ను డబుల్ చెయ్యాలని చౌహాన్ టార్గెట్గా పెట్టుకున్నారు. అదే సమయంలో తన కొడుకు తనతో రోజూ ఎంతో కొంత సేపు గడిపేలా కూడా ప్లాన్ వేసుకున్నారు. రోజూ చేసే పనుల్లో ప్రతీ దానికీ టైమ్ ఫ్రేమ్ సెట్ చేసుకున్నారు. చౌహాన్ కొడుకుకు కార్ల బొమ్మలంటే చాలా ఇష్టం. ఇది గమనించిన ఆమె.. ఆ పిల్లాణ్ని.. వీలైనన్ని కార్ల షోరూంలకు తీసుకెళ్తున్నారు. మనకు ఏది ఇష్టమో దాన్నే తల్లిదండ్రులు మనకు దగ్గర చేస్తే.. అందులో విజయం సాధిస్తామన్న నమ్మకం ఆమెకు ఉంది.
***అవార్డులు, రివార్డులు
చౌహాన్ వ్యాపారంలో సాధించిన విజయాలకు గాను అనేక అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బిజినెస్ సూపర్ అచీవర్ అవార్డ్, 4 జీ బిజినెస్ మార్కెటింగ్ అవార్డ్, బెస్ట్ యంగ్ కార్పొరేట్ లీడర్, ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ యంగ్ ఉమెన్ అచీవర్ అవార్డ్, జీఆర్8 ఎఫ్ఎల్ఓ ఉమెన్ అచీవర్తో పాటు అనేక పురస్కారాలు ఆమెకు లభించాయి.
నాకు మా అమ్మ నుంచి చాలా సహాయం లభిస్తుంది. ప్రతి విషయంలో నేను అమ్మపై పూర్తిగా నమ్మకం పెట్టుకున్నాను. ఆమె ఒక తల్లి, స్నేహితురాలు, ఒక మార్గదర్శకురాలుగా ఉంటుంది. బిజినెస్ ప్లానింగ్లో కంపెనీ అభివృద్ధినే దృష్టిలో పెట్టుకుంటాను. ఒక మహిళగా అభద్రతకు ఎపుడూ లోనవలేదు. బిజినెస్లో సాధారణ సవాళ్లు వచ్చాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ఉంటాం. ఇతరులతో కాకుండా నాతో నేనే పోటీ పడుతూ ముందుకెళ్లడం నా జీవిత సూత్రం .