Devotional

జనరంజకం…భజనామృతం

The importance and essence of bhajans, keertans in hinduism

భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నేటి వ్యావహారికంలో భజన చేయడం అంటే ఏదో స్వార్థాన్ని ఆశించి ఇతరులను పొగడటంగా స్థిరపడింది. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తికార్యాల్లో ముఖ్యమైనది. నారద భక్తిసూత్రాల్లోని నవవిధ భక్తిమార్గాల్లో మొదటి రెండు- శ్రవణం, కీర్తనం.

శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించినవాడు పరీక్షిత్తు మహారాజు. శుకమహర్షి లాంటి విజ్ఞాన గని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి. పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు- జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్నదాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి. పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.

ఒక్కరే భగవంతుడి నామాన్ని గానంచేస్తే, అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు. భజన నాలుగు విధాలు. గుణ సంకీర్తనం- దేవదేవుడి గుణాలను వర్ణిస్తూ భజన చేయడం. భగవంతుడి లీలలను పొగుడుతూ ఆయన చేసిన అద్భుత కార్యాల్ని కీర్తించడం లీలా సంకీర్తనం. బాలకృష్ణుడు వెన్నదొంగ, గోపికా మానసచోరుడు, కాళింది మడుగులో కాళియ మర్దనం, గోవర్ధనగిరి పర్వతాల్ని చిటికెన వేలిపై భరించడం… లీలాసంకీర్తనలు. భగవంతుడు భావప్రియుడు. మన భావాలతో స్తుతించడం- భావ సంకీర్తన. గోవిందా, మాధవా, రామా, కృష్ణా లాంటి నామాలతో భజించడం- నామ సంకీర్తనం.

పల్లెల్లో నేటికీ కొన్ని భజన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చిడతల భజన, చెక్కభజన, తాళాల భజన, జ్యోతిభజనతో గ్రామస్థులు భగవంతుణ్ని ఆరాధిస్తుంటారు

శ్రీరామదాసు, అన్నమాచార్యులు- వాగ్గేయకారులు, సంకీర్తనలతో తరించినవారు. తమ జీవితాలను సంప్రదాయ రీతుల్లో సంగీతపరంగా గానానికి అంకితం చేశారు. హనుమంతుడు శ్రీరామనామ భజనలో అగ్రగణ్యుడు. నిరంతరం రామనామ తారకమంత్రంతో తరించాడు.
గాంధీ మహాత్ముడు రామనామ సాధన చేసిన సాధకుడు. సబర్మతీ ఆశ్రమంలో ప్రతిదినం రెండు పూటలా భజన సంప్రదాయాన్ని కొనసాగించారాయన. నేటికీ అక్కడి ఆశ్రమంలో భజన కొనసాగుతున్నది.

మీరాబాయి కృష్ణ భక్తురాలు. మహారాణి వంశానికి చెందిన స్త్రీ అయినా వీధుల వెంట నగర సంకీర్తన చేసేవారు. మహారాణి హోదాలో ఉండి, వీధులవెంట తిరిగి భజన కీర్తనలు పాడటం ఆమె మరిది సహించలేక పాలల్లో విషాన్ని కలిపి ఇచ్చాడు. కృష్ణార్పితంగా నైవేద్యంపెట్టి విషం పాలుతాగింది. నామ సంకీర్తనా బలంతో ఆమెను శ్రీకృష్ణుడు రక్షించాడంటారు.

రెండు చేతులూ చరుస్తూ చప్పట్లతో భజన చేయడం గీతానికి అనుగుణమైన తాళంగా ప్రసిద్ధి పొందింది. భజన కూడా ప్రార్థనే.

రామనామ సంకీర్తనలో తరించిన గుహుడు, శబరి, భరతుడు, హనుమంతుడు భజన సంప్రదాయాన్ని ఆదర్శంగా నిలిపారు. అక్రూరుడు, విదురుడు, కుచేలుడు, మీరాబాయి… కృష్ణభక్తులుగా చరిత్రలో నిలిచారు.

త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు; ద్వాపరయుగంలో వ్రతాలు, పూజలు, నోములు; కలియుగంలో నామస్మరణ- యుగభక్తి ధర్మాలుగా మహర్షులు పేర్కొన్నారు.

నామి కన్నా నామం గొప్పదని ప్రకటించిన ఆంజనేయుడు భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తిగా నిలిచాడు.