WorldWonders

17మంది సైనికులను చంపిన నక్సలైట్లు

Chhattisgarh Bleeds With Security Forces Deaths

ఛత్తీస్‌గఢ్‌ అడవులు మరోసారి రక్తమోడాయి. సుక్మా జిల్లాలో నక్సల్స్‌కు, భద్రతా బలగాలకు శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో అదృశ్యమైన 17 మంది మృతదేహాలను పోలీసులు ఆదివారం గుర్తించారు. మృతదేహాలను అడవుల నుంచి తరలించినట్లు ఐజీ (బస్తర్‌రేంజ్‌) సుందర్‌ రాజ్‌ తెలిపారు.

నక్సలైట్లు పెద్ద ఎత్తున గుమిగూడారన్న సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది శనివారం ఎల్మగుండ ప్రాంతంలో మూడు వైపుల నుంచి మోహరించారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎస్టీఎఫ్‌), సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా దళాలు పాల్గొన్నాయి. 600 మంది సిబ్బందితో చేపట్టిన ఈ యాంటీ నక్సల్స్‌ ఆపరేషన్‌లో భాగంగా మింపా గ్రామానికి సమీపానికి చేరే సరికి అప్పటికే సాయుధులైన సుమారు 250 మంది నక్సలైట్లు ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య సుమారు రెండున్నర గంటల పాటు భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఎన్‌కౌంటర్‌లో 14 మంది పోలీసులు గాయయపడ్డారని, 13 మంది కనిపించకుండా పోయారని పోలీసు శాఖ తొలుత ఓ ప్రకటన విడుదల చేసింది. ఆచూకీ దొరకని వారి కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం 17 మంది భద్రతా సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. గాయపడిన వారిని రాయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిగిన చోట ఏకే47 సహా 16 ఆటోమేటిక్‌ రైఫిళ్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.