NRI-NRT

న్యూయార్క్‌పై కొరోనా పడగ-TNI ప్రత్యేకం

New York Under Imprisonment By COVID19 And US Army

న్యూయార్క్ ను కబళిస్తున్న కరోనా
అత్యంత ప్రమాదాకర ప్రదేశంగా ప్రటించిన ట్రంప్
న్యూయార్క్ నగరంలోకి ప్రవేశించిన ఆర్మీ దళాలు
ఆసుపత్రులుగా మారిన పదివేల హోటల్ గదులు
ట్రంప్ స్వస్థలంలో ప్రతి రెండు గంటలకు ఒక కరోనా కేసు నమోదు
భయం గుప్పిట్లో భారతీయులు
-న్యూయార్క్ నుండి కిలారు అశ్వినీ కృష్ణ
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తుంది. ప్రపంచంలో ప్రముఖ ఆర్ధిక, వాణిజ్య నగరంగా పేరుపొందిన న్యూయార్క్ నగరాన్ని కరోనా వైరస్ కబలిస్తుంది. ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విరాజిల్లే “టైమ్స్ స్క్వేర్” నేడు స్మశాన ప్రదేశాన్ని గుర్తుకు తెస్తుంది.
న్యూయార్క్ లో ప్రస్తుతం ప్రతి రెండు గంటలకు ఒక కరోనా కేసు నమోదు అవుతుంది. అమెరికాలోని మిగిలిన నగరాల కన్నా న్యూయార్క్ లోనే కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఈ నగరాన్ని భారీ కల్లోల ప్రదేశంగా (మేజర్ దిసాస్టార్ ఏరియా) అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సహాయక చర్యల కోసం పెద్దఎత్తున అమెరికా ఆర్మీ బలగాలను రంగంలోకి దింపారు.
పదివేల హోటల్ గదులు ఆసుపత్రులుగా మార్పు
అమెరికాలో 2001లో న్యూయార్క్ లో జంట టవర్లను కూల్చివేసిన సందర్భంలో న్యూయార్క్ లో ఏర్పడిన పరిస్థితులే ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి. అన్ని ప్రముఖ హోటళ్ళను మూసివేసారు. ఆర్మీ సిబ్బంది ఈ హోటళ్ళలోకి ప్రవేశించి పది వేల గదులను కరోనా బాధితులకు చికిత్స అందించే విధంగా ఏర్పాట్లని మొదలుపెట్టారు. దీనితో పాటు వైద్యసౌకర్యాలు అందించడానికి అవకాశం ఉన్న కాలేజీలను, క్రీడామైదానాలను గుర్తించే పనిలో సైన్యం ఉంది. మెట్రో, ట్యూబ్ రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పౌరులెవ్వరూ బయటికి రాకుండా కచ్చితమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇబ్బందుల్లో తెలుగు కుటుంబాలు
కరోనా ప్రభావం న్యూయార్క్ తో పాటు దాని పొరుగునే ఉన్న న్యూజర్సీ, కనెక్టికట్ తదితర ప్రాంతాల పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో తెలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది. వాషింగ్టన్ లో ఉన్న భారత రాయభార కార్యాలయం, న్యూయార్క్ లో ఉన్న ఇండియా కాన్సులేట్ కార్యాలయం ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తుంది. భారతీయులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. భారత దేశానికి గత రాత్రి (మార్చ్ 22) నుండి రాకపోకలు నిలిచిపోవడంతో వారు తల్లడిల్లి పోతున్నారు.
జర్సీ సిటీలో ఉన్న జనరల్ స్క్వేర్ ప్రాంతం ఇండియన్ బజారుగా పేరుపొందింది. ఈ ప్రదేశంలో 90 శాతానికి పైగా భారతీయ హోటళ్ళు, దుకాణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ నిత్యావసర వస్తువులు అమ్మే కొన్ని ఇండియన్ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచారు.
తెలుగువారు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు కరోనా వ్యాధి దరిచేరకపోవడం అదృష్టంగా భావిస్తున్నారు. తెలుగు విద్యార్ధులను, తెలుగు కుటుంబాలను ఆదుకోడానికి తానా, నాట్స్, ఆటా వంటి సంస్థలు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేశాయి. దాదాపు 90 శాతంపైన ఉద్యోగులందరూ ఇంటి వద్దనుండే పనిచేస్తున్నారు. అవసరమైతే ఆసుపత్రిలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని హెల్త్ కేర్ ఉద్యోగులకు , సంబధిత ఐటీ ఉద్యోహులకు సందేశాలు అందాయి.
-న్యూయార్క్ నుండి కిలారు అశ్వినీ కృష్ణ