DailyDose

కాసిన్ని లాభాలు చవిచూసిన స్టాక్ మార్కెట్లు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Stocks Witness Profits

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం విపరీతమైన ఊగిసలాటతో మొదలైన ట్రేడింగ్‌ సమయం గడిచేకొద్దీ భారీ లాభాల్లోకి మళ్లింది. మధ్యాహ్నం 1.38 సమయంలో సెన్సెక్స్‌ 1522 పాయింట్ల లాభంతో 28,196 వద్ద, నిఫ్టీ 420 పాయింట్ల లాభంతో 8,221 వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు 2 ట్రిలియన్‌ డాలర్ల సాయం అందించే ప్యాకేజీపై సెనెట్‌ నాయకులు, శ్వేతసౌదం ఒక అవగాహనకు రావడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోలో ఫేస్‌బుక్‌ వాటాలు కొనుగోలు చేయనుందనే ప్రచారం జరగడంతో ఆ కంపెనీ వాటాలు 10శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు యాక్సెస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 8 నుంచి 15శాతం లాభాల్లో ట్రేడవుతుండటంతో సూచీలు కూడా దూసుకుపోతున్నాయి. భారత్‌లో ప్యాకేజీ ప్రకటిస్తారనే సమాచారం సూచీలకు ఊరటనిస్తోంది.

* దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో రుణగ్రహీతలు వాయిదాలు డిఫాల్ట్‌ కావొచ్చని, బ్యాంకుల అంతర్గత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం కావొచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే కొన్నేళ్లలో ఖాతాలు ఎన్‌పీఏలుగా మారకుండా ఆర్‌బీఐ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. ‘నగదు లభ్యత పరంగా చూస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రిటైల్‌, అనుబంధ రంగాల్లో డిఫాల్ట్‌లు ఎక్కువగా ఉండొచ్చు’ అని యునైటెడ్‌ బ్యాంక్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.18 లక్షల కోట్ల వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కష్టమేనని అన్నారు.

* కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక మందగమనం ముప్పు పొంచి ఉంది. దీంతో కంపెనీలు వ్యయాలను మానవత్వా దృక్పథంతో తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ వేగంగా పుంజుకునేందుకు వేతనాల కోత, ఉద్యోగుల తొలగింపు వంటి వాటిని చేపట్టరాదని అంటున్నారు. తయారీ రంగం సహా పలు రంగాల్లో కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఇప్పటికే రోజువారీ వేతనాలు కోల్పోతున్నారు. ప్లాంట్లను మూసివేయడంతో వేతనాల కోత, నిలిపివేతకు పలు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. అంతర్జాతీయ మాంద్యం, ప్రయాణాలపై ఆంక్షలు, సామాజిక దూరం వంటి భయాలతో.. భారత జీడీపీ 2020 మొదటి రెండు త్రైమాసికాల్లో గణనీయంగా తగ్గొచ్చని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.

* రోజువారీ వేతనం తీసుకునేవారు, చిన్న వ్యాపారులకు నేరుగా నగదు బదిలీ ద్వారా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఐటీ ప్రముఖులు కోరారు. ఇక రుణ వాయిదాల చెల్లింపులను కూడా వాయిదా వేయాలని ఇన్ఫోసిస్‌ మాజీ వ్యవస్థాపకుడు క్రిస్‌ గోపాలకృష్ణన్‌ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు ట్యాక్సీ డ్రైవర్లను తీసుకుంటే.. రుణవాయిదాలపై మారటోరియం ఇవ్వాలని అన్నారు. వీటిని వాయిదా వేస్తే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు నగదు కొరత రాదని అన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆర్‌బీఐ దృష్టి పెట్టాలని వెల్లడించారు. ఉద్యోగులు కోల్పోతున్న బలహీన వర్గాలకు భారీ స్థాయిలో నగదు బదిలీ అమలు చేయాలని మోహన్‌ దాస్‌ పాయ్‌ సూచించారు.

* అన్ని తయారీ ప్లాంట్‌లు, కార్యాలయాల కార్యకలాపాలను ఈ నెల 31 వరకు నిలిపివేసినట్లు టీవీఎస్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వివిధ అధికార వర్గాల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే కరోనా వల్ల ప్లాంట్లలో కొన్ని విడిభాగాల సరఫరాపై ప్రభావం పడిందని వెల్లడించింది. మార్చి ఉత్పత్తి లక్ష్యంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

* దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్కూళ్లు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల గోడలపై రాసే ప్రభుత్వ ప్రకటన ఇది. అప్పట్లో మలేరియా పెద్ద వ్యాధి. ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించిన నేపథ్యంలో దానికి చికిత్సపై ప్రజల్లో చైతన్యం పెంచటం కోసం అందరినీ ఆకర్షించే విధంగా ప్రభుత్వం ఈ తరహా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. రెండు మూడు రోజుల పాటు జ్వరం తగ్గకపోతే మలేరియా పరీక్ష చేసి నిర్ధారణ అయితే క్వోరోక్విన్‌ మాత్రలు వాడాలని వైద్యులు సలహా ఇచ్చేవారు. తదుపరి దశకాల్లో ప్రజల్లో చైతన్యం పెరిగి, వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మలేరియా వ్యాధి అదుపులోకి వచ్చింది. అందువల్ల క్లోరోక్విన్‌ అనే మందు అవసరం అంతగా ఏర్పడలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ వ్యాధి (కోవిడ్‌-19) విస్తరణ ఫలితంగా మళ్లీ ఈ మలేరియా మందు తెరమీదకు వచ్చింది.

*