ScienceAndTech

సునామీ అంటే ఏమిటి?

What and how tsunamis happen-Telugu science and tech news

సముద్రంలో ఒక విస్ఫోటం జరిగితే ఏమవుతుంది? అంతెత్తు నుంచి ఒక పర్వత శిఖరం సముద్రంలోకి ఒరిగిపోతే ఏం జరుగుతుంది? సముద్ర తీర ప్రాంతంలో ఉండే అగ్ని పర్వతాలు హఠాత్తుగా బద్దలైతే ఫలితమేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం. అదే సునామీ. సముద్రపు అలలు నోరు తెరుచుకున్న రాకాసిలా విరుచుకుపడి ఊళ్లకు ఊళ్లను ముంచేయడాన్ని సునామీ అంటారు.2004లో తొలిసారిగా భారత్‌ సునామీని కళ్ల చూసింది. తమిళనాడు తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంపై కూడా ప్రభావం పడింది. ఇండోనేసియా సముద్ర గర్భంలో వచ్చిన భూకంపం తీవ్రతకి సముద్రపు అలలు ఆకాశమంత ఎత్తుకు ఎగిసిపడి క్షణాల్లో మనుషుల్ని మింగేశాయి. సునామీల చుట్టూ నెలకొని ఉన్న వాస్తవాలేంటో ఓ సారి చూద్దాం.సునామీ నాలుగు రకాలుగా ముంచుకొస్తుంది. సముద్ర గర్భంలో భూకంపం వచ్చినప్పుడు, కొండచరియలు సముద్రంలో విరిగిపడినప్పుడు, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు, ఉల్కాపాతం సంభవించినప్పుడు (ఇది అత్యంత అరుదు) సునామీలు ఏర్పడతాయి.సునామీ అన్న పదం జపనీస్‌ భాషకు చెందింది. హార్బర్‌ కెరటం అని దీని అర్థం.సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి.పసిఫిక్‌ మహాసముద్రంలో రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ కారణంగానే 80 శాతానికి పైగా సునామీలు సంభవిస్తున్నాయి.సునామీ అలలు గంటకి 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్‌ విమానం స్పీడ్‌తో ఇది సమానం.ప్రపంచంలో జపాన్‌ తర్వాత అమెరికాలోని హవాయి, అలస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోరి్నయాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకి ఉన్న ముప్పుమరెక్కడా లేదు. ప్రతీ ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతీ ఏడేళ్లకి తీవ్రమైన సునామీ ముంచేస్తుంది.2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ చరిత్రలోనే అత్యంత భయంకరమైంది. ఇండోనేసియా కేంద్రంగా సుమత్రా దీవుల్లో సంభవించిన భూకంపం 23 వేల ఆటంబాంబుల పేలుళ్లతో సమానం. ఈ భూకంపంతో సముద్రంలో నింగికెగిసిన మృత్యు కెరటాలు తీర ప్రాంతంలో ఉన్న 11 దేశాలను ముంచేశాయి. 2 లక్షల 83 వేల మందిని రాకాసి అలలు పొట్టన పెట్టుకున్నాయి.