Sports

వచ్చే ఏడాది కూడా ఒలంపిక్స్ అనుమానమే

Telugu Sports News - 2021 Olympics Are Doubtful

టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధతకు మళ్లీ తెరలేచింది. కరోనా వైరస్‌ ప్రభావంతో ఆ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేసి.. 2021 జులై 23న ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఏడాదిలో ఒలింపిక్స్‌ జరుగుతాయని కచ్చితంగా చెప్పలేమని క్రీడల నిర్వాహక కమిటీ సీఈఓ తొషిరో ముటో తాజాగా వెల్లడించాడు. జపాన్‌లో వైరస్‌ విజృంభిస్తుండడమే దానికి కారణం. ‘‘వచ్చే ఏడాది జులైలో కచ్చితంగా ఒలింపిక్స్‌ ఆరంభమవుతాయి లేదా జరగవు అని చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు. క్రీడల నిర్వహణపై స్పష్టత ఇచ్చే స్థితిలో మేం లేం. ఏడాది పాటు ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి క్రీడలను నిర్వహించేలా వీలైనంతగా ప్రయత్నిస్తాం. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించకుండా.. క్రీడలను నిర్వహించేందుకే సర్వశక్తులా కృషి చేస్తున్నాం. టోక్యో 2020 ఒలింపిక్స్‌ను కొన్ని బీమా పాలసీల నుంచి తొలగించారు. కానీ క్రీడలు వాయిదా పడితే బీమా కిందకు వస్తుందో రాదో ఇంకా స్పష్టంగా తెలీదు. ఒలింపిక్‌ జ్యోతి యాత్ర రద్దవడంతో ప్రస్తుతం అది క్రీడల నిర్వాహకుల సంరక్షణలోనే ఉంది. పరిస్థితులు మెరుగైతే జ్యోతిని ఏదో ఒక చోట ప్రదర్శించే అవకాశముంది. మానవ జాతి వచ్చే ఏడాది కరోనా సంక్షోభాన్ని అధిగమిస్తుందనే నమ్ముతున్నాం. అన్ని దేశాలూ ఒక్కతాటిపైకి వచ్చి సాంకేతికత, విజ్ఞానం సాయంతో వైరస్‌ను నిర్మూలించే చికిత్స విధానం, మందులు కనుగొనాల్సిన అవసరం ఉంది’’ అని తొషిరో పేర్కొన్నాడు. వృద్ధులు అధికంగా ఉండే ఆ దేశంలో వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.