Movies

ప్రేక్షకుల ఆనందానికి సాక్షి

Veteran Actress Sakshi SIvanand Birthday Special Story

తెలుగు చిత్రసీమలో ఒకప్పుడు హిందీ భామలదే హవా. ఆ సమయంలోనే అడుగుపెట్టింది సాక్షి శివానంద్‌. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, మహేష్‌బాబు, నాగార్జున, రాజశేఖర్‌ తదితర అగ్ర కథానాయకుల సరసన ఆడిపాడింది. తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. తన అందంతో అసలు సిసలు కమర్షియల్‌ కథానాయిక అనిపించుకుంది. ‘మాస్టర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ‘కలెక్టర్‌ గారు’, ‘రాజహంస’, ‘నిధి’, ‘సముద్రం’, ‘సీతారామరాజు’, ‘పెళ్లివారమండీ’, ‘యమజాతకుడు’, ‘వంశోద్ధారకుడు’, ‘యువరాజు’, ‘మా పెళ్లికి రండి’, ‘సింహరాశి’ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా… తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించిందామె. ముంబైలో 1977 ఏప్రిల్‌ 15న జన్మించిన సాక్షి 1995లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత దక్షిణాదిపై దృష్టిపెట్టి వరుస అవకాశాలు అందుకొంది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఆమెకి ఎక్కువ పేరొచ్చింది. ‘హోమం’, ‘రంగ ది దొంగ’ తరువాత మళ్లీ ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ‘కలెక్టర్‌ గారు’, ‘సముద్రం’ చిత్రాల్లో ఆమె గ్లామర్‌ అప్పట్లో కుర్రకారుని కిర్రెక్కిచ్చింది. సాక్షికి శిల్పా ఆనంద్‌ అనే ఓ చెల్లెలు ఉన్నారు. ఆమె హిందీ ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు సాక్షి శివానంద్‌ పుట్టినరోజు.