Politics

కన్నా vs విజయసాయి

Kanna vs Vijayasai Reddy Fued Runs Long

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని..అంతా సక్రమంగానే జరుగుతోందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆగదని.. దాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. రాజధాని మార్పు ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. తెదేపా నుంచి వెళ్లిన నేతలతో భాజపా ప్రతిష్ఠ దెబ్బతింటోందని విమర్శించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మరోసారి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కన్నా అవినీతి వ్యవహారమంతా తనకు తెలుసని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల సమయంలో భాజపా అధినాయకత్వం రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చింది.. అందులో ఎంత దుర్వినియోగం జరిగిందనే వివరాలు తన వద్ద ఉన్నాయని విజయసాయి వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో కన్నా, పురందేశ్వరి ఎంత తీసుకున్నారు? ఏయే నియోజకవర్గాలకు ఎంతెంత పంపించారనే వివరాలు లెక్కలతో సహా తన వద్ద ఉన్నట్లు చెప్పారు. ఆయా ఖర్చులను భాజపా అధిష్ఠానానికి అందజేశారా? అని ప్రశ్నించారు. ఆ డబ్బును ఏ విధంగా దుర్వినియోగం చేశారనేది కూడా తాను చెప్పగలనన్నారు. అది ఆ పార్టీ అంతర్గత విషయం కాబట్టి ఆ వివరాలను తాను బయట పెట్టదలచుకోలేదన్నారు. కన్నా రూ.20కోట్లకు అమ్ముడుపోయారని మరోసారి విజయసాయిరెడ్డి ఆరోపించారు. అవసరమైతే కాణిపాకం వినాయకుడి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి ఈ విషయాలన్నీ చెప్పగలనన్నారు.