Business

₹3.75లక్షల కోట్లు ఆవిరి

Warren Buffet Huge Losses Due To COVID19

ప్రపంచ ప్రముఖ స్టాక్‌ ఇన్వెస్టర్‌, ఒరాకిల్‌ ఆఫ్‌ ఒమాహాగా పిలిచే వారెన్‌ బఫెట్‌కు సైతం కరోనా దెబ్బ చాలా గట్టిగానే తగిలింది. కోవిడ్‌ కల్లోలంలో బఫెట్‌ కంపెనీ బెర్క్‌షైర్‌ హాత్‌వేకు చెందిన స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల విలువ భారీగా పతనమైంది. దాంతో కంపెనీ రికార్డు నష్టాలను నమోదు చేసుకుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన తొలి త్రైమాసికానికి (క్యూ1) దాదాపు 5,000 కోట్ల డాలర్ల నికర నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చింది. అంటే, మన కరెన్సీలో రూ.3.75 లక్షల కోట్ల పైమాటే. అమెరికా అకౌంటింగ్‌ నిబంధనల ప్రకారం.. బెర్క్‌షైర్‌ తన పెట్టుబడును ఇంకా ఉపసంహరించుకోని షేర్లలో వచ్చిన నష్టాలను సైతం ఆర్థిక ఫలితాల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. సమీక్షా కాలానికి కంపెనీ స్టాక్‌ పెట్టుబడుల నష్టం 5,452 కోట్ల డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, వెల్స్‌ ఫార్గో, నాలుగు ఎయిర్‌లైన్స్‌ (అమెరికన్‌, డెల్టా, సౌత్‌వె్‌స్ట, యునైటెడ్‌) షేర్లలోని పెట్టుబడులకు భారీగా గండి పడింది. తత్ఫలితంగా గత త్రైమాసికానికి 4,975 కోట్ల డాలర్ల నికర నికర నష్టాన్ని ప్రకటించాల్సి వచ్చిందని బెర్క్‌షైర్‌ వెల్లడించింది. అయితే, ఈ నిబంధనతో బఫెట్‌ ముందు నుంచి విబేధిస్తూ వచ్చారు.