Agriculture

మట్టి ఇళ్లు మళ్లీ కడుతున్నారు

Clay Homes Are Being Built Again

పర్యావరణంమీద ప్రేమతోనో… ప్రకృతి ఒడిలో జీవించాలనో… రొటీన్‌కు భిన్నంగా ఉండాలనో… కారణమేదయినాగానీ అంతా మళ్లీ మట్టి ఇళ్లు కట్టించుకుంటున్నారు. అందమైన ఆ పొదరిళ్లలో చల్లగా సేదతీరుతున్నారు.
*మట్టిల్లా… ఈ రోజుల్లోనా… అని ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. మట్టితో కట్టిన ఇల్లు అనగానే పేదవాళ్లు నివసించే పాక అనే అనుకుంటాం. కానీ దాన్ని ఎంత అందంగానైనా కట్టుకోవచ్చు. మరెంత అద్భుతంగా అయినా అలంకరించుకోవచ్చు. అన్నింటినీ మించి వాటిలో ఉంటే… ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది. పూర్వం రాజులు బాధ్యతలు తీరాక కోటలు వదిలి వనవాసంలో ఆశ్రమ జీవితం గడిపినట్లే, నేటి సంపన్నులూ ఎగువ మధ్యతరగతివాళ్లూ సెలవుల్లో విలాసవంతమైన భవనాల్ని వీడి ఫామ్‌హౌసుల్లోనో పల్లెల్లోనో కట్టించుకున్న మట్టి ఇళ్లలో ప్రశాంతంగా గడుపుతున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం నుంచి తప్పించుకునేందుకూ కొందరు తమ తోటల్లోని పొదరిళ్లకు వెళ్లి ఏకాంతవాసం చేస్తున్నారు. కార్పొరేట్‌ సంస్థల యజమానులూ ఉద్యోగులయితే సరేసరి… ఒత్తిడిని తగ్గించుకునేందుకు వారాంతాల్లో పర్యావరణ ప్రియమైన ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు. అందుకే థాచ్‌డ్‌ రూఫ్‌ ఎకో కన్‌స్ట్రక్షన్‌, అర్బన్‌హట్‌… వంటి సంస్థలతోబాటు కొందరు ఆర్కిటెక్టులూ ఈ తరహా ఇళ్లను కడుతున్నారు. ముఖ్యంగా రిసార్టులకోసం మట్టిఇళ్లనే ఎక్కువగా కట్టడం విశేషం.
**(ఏమిటీ మట్టిల్లు?
మట్టిళ్లనే పూరిల్లు లేదా చుట్టిల్లు అనీ అంటాం. భావకవులయితే దీనికే భాషా సొగసులద్ది పొదరిల్లు అనీ పిలుస్తారు. మట్టి, గడ్డి మిశ్రమంతో ఇంటిని కట్టి, పేడతో మెత్తి, తాటాకులో జమ్మో గడ్డో కప్పి కట్టిన పూరిళ్లు మనకూ సుపరిచితమే. కొన్నిచోట్ల అచ్చంగా మట్టితోనే మిద్దిళ్లూ కడితే, మరికొన్నిచోట్ల పెంకుటిళ్లకీ మట్టిగోడలే ఉండేవి. అంతెందుకు… ఒకప్పుడు కోటలూ వంతెనలూ అన్నీ మట్టి మిశ్రమంతో కట్టినవే. అయితే మట్టి స్థానంలో కాంక్రీటు ఇటుకలూ సిమెంటూ వచ్చేశాయి. దాంతో ఎక్కడ చూసినా ఆకాశంలోకి ఎగబాగిన కాంక్రీటు అరణ్యాలే. వాటిల్లో ఉండి బోరే కొట్టిందో, పర్యావరణంమీద ప్రేమే పెరిగిందో తెలీదుకానీ అమెరికా, ఐరోపా దేశాలతోబాటు మనదగ్గరా ఈ మట్టి ఇళ్ల నిర్మాణం మళ్లీ పెరుగుతోంది. వీటికయ్యే ఖర్చు తక్కువ. ఉష్ణోగ్రతను చక్కగా సమన్వయం చేస్తూ ఇన్సులేటర్లలా పనిచేస్తాయి. వేసవిలో చల్లగానూ చలికాలంలో వెచ్చగానూ ఉంటాయి. వీటికోసం వాడిన కలప, వెదురు వంటివాటిని మళ్లీ వాడుకోవచ్చు. నిర్మాణంలో కృత్రిమ పదార్థాలేవీ ఉండవు కాబట్టి ఆరోగ్యానికీ మంచిది. చెదలూ చేరవు. అన్నింటికన్నా మనకి కావాల్సిన డిజైన్‌లో ఎలాగైనా కట్టించుకోవచ్చు.
*అయితే మట్టిగోడ ఎండిపోతే దృఢంగానే ఉంటుంది. కానీ తడిస్తే నాని దెబ్బతింటుంది. అందుకే గోడలు తడవకుండా పైకప్పుని కిందకి దించుతారు. అలాగే మట్టిలో గోధుమపొట్టు, గడ్డి, సున్నం, ఆవుపేడ వంటివి కలపడంవల్ల వర్షాకాలంలోనూ దృఢంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని వాతావరణానికి అనుగుణంగా స్థానిక పద్ధతుల్ని ఉపయోగించి కడితే ఇవి వేల సంవత్సరాల వరకూ నిలిచే ఉంటాయి అంటున్నారు ఎకో ఆర్కిటెక్టులు.
*నిజానికి మనదేశంలో సుమారు 12 కోట్ల ఇళ్లు ఉంటే, వాటిల్లో సగానికి పైగా మట్టి ఇళ్లే. కాకపోతే దాదాపుగా అవన్నీ స్తోమతలేక కట్టించుకున్నవే. ఇప్పటికీ కేరళలో తరవాడు అని పిలిచే సంప్రదాయ ఇళ్లన్నీ మట్టివే కావడం విశేషం. అక్కడి ప్రభుత్వం కూడా గ్రామాల్లో మట్టి ఇళ్లనే కట్టిస్తోంది. కర్ణాటక, నాగాలాండ్‌, జమ్మూకశ్మీరు ప్రభుత్వాలు సైతం మట్టి ఇళ్ల సాంకేతిక విజ్ఞానానికే పెద్దపీట వేస్తున్నాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, తమిళనాడుల్లోనూ వీటి నిర్మాణం క్రమేణా పెరుగుతోంది. మట్టి ఇళ్ల రూపకల్పనకు కృషిచేసి, గాంధీ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌గా పేరొందిన లారీ బేకర్‌ను ఆదర్శంగా తీసుకున్న అనేకమంది ఎకో ఫ్రెండ్లీ ఆర్కిటెక్ట్‌లు సుమారు 40 వేల నుంచి 35 లక్షల రూపాయల ఖర్చుతో మట్టితోనే అందమైన ఇళ్లను కట్టి ఇస్తున్నారు. దాంతో పేదాగొప్పా తేడాలేకుండా పర్యావరణ ప్రియులెందరో మట్టిళ్లనే తమ కలలసౌధాలుగానూ వేసవి విడుదులుగానూ మలచుకుంటున్నారు. నచ్చితే మీరూ కట్టించుకోవచ్చు.