Kids

న్యూయార్క్ పిల్లల్లో సరికొత్త రోగాలు

New illness spreading across New York kids

కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తున్న వివిధ దేశాల్లో పిల్లలు అంతుచిక్కని అనారోగ్యానికి లోనవుతుండటం కలవరపరుస్తోంది. ఇటీవల బ్రిటన్‌లో ఇలాంటి కేసులు బయటపడగా.. తాజాగా న్యూయార్క్‌ నగరం(అమెరికా)లోనూ 15మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో చాలామంది కరోనా బారిన పడినవారే. ‘మిస్టీరియస్‌ సిండ్రోమ్‌’గా చెబుతున్న వైద్యులు దీనిపై ఓ అంచనాకు రాలేకపోతున్నారు. పలు ఐరోపా దేశాల్లోనూ ఇలాంటి కేసులు బయటపడుతున్నాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలని న్యూయార్క్‌ వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి పిల్లల వయసు 2-15 ఏళ్ల మధ్య ఉన్నట్లు తెలిపారు. అరుదుగా కనిపించే – ధమనులు సహా రక్తనాళాల్లో వాపుతో పాటు, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు బయట పడుతున్నట్లు తెలిపారు. దీన్ని ‘కొవిడ్‌తో సంబంధం ఉన్న వ్యాధి’గానే భావిస్తూ న్యూయార్క్‌ వైద్యాధికారులు పరిశోధనలు జరుపుతున్నారు. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, స్విట్జర్లాండ్‌, బెల్జియమ్‌లలో కూడా పిల్లల వైద్య నిపుణుల వద్దకు పదుల సంఖ్యలో ఇలాంటి కేసులు వస్తున్నాయి. అయితే అక్కడి వైద్యులు మాత్రం దీనికి కరోనాతో సంబంధం ఉన్నట్లు ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు.