Food

ములక్కాయలు మస్త్‌గా తినాలి

You must eat drumsticks frequently-telugu food and diet news

ఇప్పటి వరకు ములక్కాయలతో చేసే రుచి కరమైన వంటలు, వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించే మనకు తెలుసు. కాయలతో పాటు మునగాకులోనూ ఎన్నో ఔషదగుణాలు వున్నాయని చాలామందికి తెలియదు. మునగాకు ఎంత ప్రాముఖ్యమైనదో మన అమ్మమ్మలకు, నాయనమ్మలకు, గ్రామీణ ప్రజలకు బాగా తెలుసు. అందుకే మునగాకులోని ఔషదగుణాల గురించి తెలుసుకుందాం. మునగాకులో ఉన్నంతగా ఏ, సి విటమిన్లు మరే ఇతర ఆకుకూరల్లోనూ మనకు లభించవు. కాల్షియం, ఫైబర్‌, ఐరన్‌ మునగాకులో పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి నెలలో కనీసం రెండు సార్లు మునగాకును తప్పక తీసుకోవాలి. హై బీపీ, లో బీపీలను అదుపు చేయడంలో మునగాకు పాత్ర ప్రధానమైనది. మునగలో కాల్షియం అధికంగా ఉండడం వలన ఎముకలను ఆరోగ్యంగా వుంచుతుంది. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు మునగాకు ఆహారంతో పాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. గర్భిణీలను రక్తహీనత నుండి కాపాడుతుంది. పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్ళు దీన్ని తీసుకుంటే మంచిది. గాయాలు మాన్పడంలో ఎంతో సహాయపడుతుంది. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు మునగాకు ఆహారంలో తీసుకుంటే ఫలితం వుంటుంది. రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచడంలో సహాయపడుతుంది. మునగాకు యాంటీ బాక్టీరియల్‌ గుణాలు కలిగి వుండి స్కిన్‌ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తుంది. కొలెస్ట్రాల్‌ లెవల్‌ని కంట్రోల్‌ చేస్తుంది. దీనిలో ఫైబర్‌ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు మునగాకు తీసుకోకూడదు.