Movies

నేడు పసుపులేటి కన్నాంబ వర్ధంతి

Remembering Pasupuleti Kannamba On Her Death Anniversary

టాకీలు మొదలైన కొత్తల్లో…అంటే 1935 నుంచి 1964 వరకు దాదాపు 29 సంవత్సరాలు చలనచిత్ర రంగంలో ఒక వెలుగు వెలిగిన అద్భుత నటీమణి పసుపులేటి కన్నాంబ. కన్నాంబ చిత్రరంగానికి వచ్చిన కొత్తల్లోనే మరొక అందాల నటి కాంచనమాల కూడా సినీరంగ ప్రవేశం చేసింది. కాంచనమాలకు దీటుగా కన్నాంబ సౌందర్యంలో ఆమెతో పోటీపడింది. అయితే రాశిలో కన్నాంబ చిత్రసీమలో వెలుగొందిన కాలం కాంచనమాల కన్నా ఎక్కువ. కాంచనమాల కేవలం పది సినిమాల్లో మాత్రమే నటించగా కన్నాంబ ఏకంగా 170 సినిమాల్లో నటించి రాణించింది. అప్పటి సినీరంగంలో కన్నాంబ అత్యంత ధనవంతురాలని పేరుంది. ఏడువారాల నగలతో ఇంట్లో ఎక్కడ చూసినా బంగారం కనిపిస్తూ వుండేది. నిలువెత్తు విగ్రహంతో, అద్భుతమైన, విస్పష్టమైన వాచకంతో, అంతే అద్భుతమైన నటనా పటిమతో అలరారిన నటీమణి కన్నాంబ. కరుణరసం ఉట్టిపడే పాత్రల్లో గాని, వీరరసం ఉప్పొంగే పాత్రల్లో గాని కన్నాంబ నటన వర్ణనాతీతంగా వుండేది. ఆమె కేవలం తెలుగు చిత్రసీమకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు వాళ్లు ఎంతగా ఆమెను ఆదరించారో అంతే సమానంగా తమిళ ప్రేక్షకులు కూడా ఆదరించారు. అటువంటి గొప్ప నటీమణి, నిర్మాత, గాయని కన్నాంబ ఈ లోకాన్ని వీడి 7మే నాటికి సరిగ్గా 56 ఏళ్లు అవుతున్న సందర్భంలో ఆమెను స్మరించుకుంటూ….