DailyDose

ఇండియా చేతికి మాల్యా-వాణిజ్యం

Vijay Mallya To Be Returned To India By UK-Telugu Business News Roundup Today

* మాల్యాకు బ్రిటన్​ హైకోర్టు షాక్​- 28 రోజుల్లో భారత్​కు అప్పగింత! భారతీయ బ్యాంక్​లకు వేల కోట్ల రూపాయల రుణం ఎగ్గొట్టి.. విదేశాలకు పరారైన ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యాకు గురువారం బ్రిటన్​ హైకోర్టు షాకిచ్చింది. భారత్​కు అప్పగించాలన్న యూకే ప్రభుత్వ నిర్ణయాన్ని.. ఆ దేశ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు అనుమతించాలని మాల్యా కోరాడు. అందుకు అక్కడి హైకోర్టు అనుమతించలేదు. ఫలితంగా మాల్యాను భారత్​కు తీసుకొచ్చేందుకు మార్గం మరింత సుగమం అయింది. భారత్​కు అప్పగించడాన్ని సవాలు చేస్తూ అతడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. ఏప్రిల్​ 20న యుకే హైకోర్టు కొట్టివేసింది. ఆ తీర్పులో చుక్కెదురైనా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు మాల్యాకు అవకాశం ఉండేది. కానీ ఇందుకు 14 రోజులే గడువు ఉంటుంది. ఈలోగా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేయలేకపోతే.. మ్యాల్యాను ఆ దేశ హోంశాఖ అదుపులోనికి తీసుకుంటుంది. అయితే ఈరోజు కోర్టు అతడి వ్యాజ్యాన్ని కొట్టేయడం వల్ల ఇక సుప్రీంను ఆశ్రయించేందుకు మార్గం మూసుకుపోయింది. ఫలితంగా లిక్కర్​ కింగ్​ ​ఇక భారత్​కు రావడం లాంఛనమైంది. భారత్​-యూకే నేరస్థుల అప్పగింత చట్టం ప్రకారం.. 28 రోజుల్లో అతడిని భారత ప్రభుత్వానికి బ్రిటన్​ అప్పగించాలి.

* అన్ని రైళ్ల రిజర్వేషన్లు జూన్‌ 30 వరకు రద్దు: రైల్వే శాఖ కీలక నిర్ణయం. కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో నిర్ణయం. లాక్‌డౌన్‌ ప్రత్యేక రైళ్లు, శ్రామిక్‌ రైళ్లు మాత్రమే నడపనున్న రైల్వేశాఖ. రిజర్వేషన్లు చేయిస్తే ఛార్జీలు తిరిగి చెల్లిస్తామని ప్రకటన. కరోనా విజృంభణకు అడ్డుకట్ట పడకపోతుండడంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

* గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతికి ఈ కరోనా కాలంలో కేంద్రం ఊరట కల్పించింది. మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్ అభియాన్‌ కింద ప్రకటించిన భారీ ఆర్థిక ప్యాకేజీ -2 వివరాలను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘రూ.6లక్షల నుంచి 18లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి వడ్డీ రాయితీ పథకం వర్తిస్తుంది. దేశంలో దాదాపు 50లక్షల మంది వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణ సాయం చేస్తాం. ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద రుణం మంజూరుచేస్తాం. నెల రోజుల్లో రుణ సదుపాయం అందుబాటులోకి తెస్తాం. చిన్న వ్యాపారులు బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే మరింత రుణానికి అవకాశం. వారి వ్యాపారాన్ని బట్టి బ్యాంకులు మరింత రుణం ఇచ్చే అవకాశం ఉంటుంది’’ అని తెలిపారు.

* ఉద్దీపన ప్యాకేజీ ప్రకటన అండతో బుధవారం దూసుకెళ్లిన దేశీయ మార్కెట్లు గురువారం డీలాపడ్డాయి. నిన్నటి లాభాలు ఆవిరయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సూచీలు నష్టాలు చవిచూశాయి. వృద్ధిపై దీర్ఘకాలం పాటు కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందన్న యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరికల నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ఇందుకు కారణం.