DailyDose

బెంజ్ సంస్థ నుండి EMI రాయితీ-వాణిజ్యం

Telugu Business News Roundup Today - Mercedes India Announces EMI Discounts

* ఏపీలో మరిన్ని సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం.నగలు, బట్టలు, చెప్పుల షాపులకు అనుమతి.స్ట్రీట్ ఫుడ్స్ కి సైతం అనుమతిచ్చిన ఏపీ సర్కార్.పెద్ద షోరూమ్ లకు వెళ్లాలంటే ఆన్ లైన్లో అనుమతి తప్పనిసరి.అన్ని షాపుల్లో ట్రాయల్ రూములకు అనుమతి నిరాకరణ.పానీపూరి బండ్లకు అనుమతి నిరాకరించిన ఏపీ సర్కార్.

* ప్రైవేటు రంగానికి చెందిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తన సేవింగ్స్‌ బ్యాంక్‌(ఎస్‌బీ) రేటులో 0.5 శాతం మేర కోత వేసింది. రూ.1 లక్షకు పైన జమ ఉన్న ఎస్‌బీ ఖాతాలపై 4 శాతం వడ్డీరేటు వర్తిస్తుందని తెలిపింది. అంతక్రితం ఇది 4.5 శాతంగా ఉండేది. రూ.లక్షలోపు వారికి 3.5 శాతం వడ్డీనే వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. ఈ సవరింపులు ప్రవాసులకు వర్తించవని వివరించింది. ఈనెల 25 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. గత నెలలో ఈ బ్యాంకు రెండు సార్లు ఎస్‌బీ వడ్డీ రేట్లను తగ్గించిన విషయం విదితమే. ఆర్‌బీఐ కీలక రేట్ల కోతకు తోడు, రుణ వృద్ధి లేనందున బ్యాంకింగ్‌ వ్యవస్థలో డిపాజిట్‌ రేట్లు తగ్గుతూ వస్తున్నాయి. ఎస్‌బీఐ 2.75 శాతం వడ్డీరేటు ఇస్తుండగా.. యెస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, డీబీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటివి ఒక దశలో 7 శాతం వరకు వడ్డీనిచ్చాయి. ఇపుడు అవి తగ్గింపు బాటలో వెళుతున్నాయి.

* అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో నేడు దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 241 పాయింట్లు లాభపడి 30,921 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 77 పాయింట్లు ఎగబాకి 9,117 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.28 వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు క్రమంగా తెరుచుకుంటున్న నేపథ్యంలో అమెరికా, ఐరోపా మార్కెట్లు సోమవారం సానుకూలంగా ముగిశాయి. ఈ సంకేతాలతో ఆసియా మార్కెట్లు సైతం లాభాల్లో పయనిస్తున్నాయి. మరోవైపు చమురు ఉత్పత్తి తగ్గింపు ఒప్పందానికి ఒపెక్‌ ప్లస్‌ దేశాలు కట్టుబడి ఉండడం, అంతర్జాతీయంగా ప్రయాణాలు, పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరణకు నోచుకుంటుండడంతో చమురు ధరలు సైతం ఎగబాకాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు సానుకూల దిశగా సాగుతున్నాయి.

* కరోనా లాక్‌డౌన్‌కు తోడు ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో మెర్సిడెస్‌ బెంజ్‌ తమ వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సోమవారం ప్రత్యేక రుణ పథకాలను ప్రకటించింది. ‘విష్‌బాక్స్‌ 2.0’ పేరుతో ప్రారంభమైన ఈ పథకాల్లో తొలి 3 నెలలు ఎలాంటి ఈఎమ్‌ఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. తొలి 6 నెలలు తక్కువ మొత్తంలో ఈఎమ్‌ఐలు చెల్లించి, 7 నెల నుంచి సాధారణ ఈఎమ్‌ఐలు చెల్లించాల్సి ఉంటుంది. పదేళ్ల పాటు రుణాన్ని పొడిగించుకునే వెసులుబాటు కూడా మెర్సిడెస్‌ బెంజ్‌ తమ ఖాతాదార్లకు కల్పించినట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ వెల్లడించారు. 5 ఏళ్ల తర్వాత గ్యారెంటీ బైబ్యాక్‌ ఆప్షన్‌ ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొంది.

* దేశంలో కరోనా వైరస్‌ కట్టడి కోసం లాక్‌డౌన్‌ మొదలై రెండునెలలు దాటింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టేందుకు కేంద్రం రూ.20లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాకుండా, ముందున్న వాటితో పోలిస్తే ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ 4లో నిబంధనలను కాస్త సడలించారు. దీనితో ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడనుందనే ఆశాభావాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న కొద్ది నెలల్లో కొనుగోళ్ల విషయంలో భారతీయ వినియోగదారుల వ్యవహార శైలి ఎలా ఉండనుంది అనే అంశంపై రెడ్‌ క్వాంటా అనే సంస్థ ఓ పరిశోధన నిర్వహించింది.

* ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ కంపెనీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే, ఇది ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. మే నుంచి అక్టోబర్‌ వరకు ఈ కోత అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19 వల్ల ఏర్పడ్డ అనుకోని సంక్షోభం వల్లే ఆరు నెలల పాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. కార్మికస్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులకు ఐదు శాతం, యాజమాన్య స్థాయి ఉద్యోగులకు 15-20 శాతం వేతనాన్ని తగ్గించి ఇవ్వనున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ తర్వాత మే 6న టీవీఎస్‌ తిరిగి తమ కంపెనీ కార్యకలాపాల్ని పునరుద్ధరించింది. దేశంలో ఉన్న మొత్తం మూడు తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది.

* దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలను చూవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 63 పాయింట్లు నష్టపోయి 30,609 వద్ద ముగియగా, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 9,029 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద ముగిసింది.