DailyDose

అంతర్రాష్ట్ర ప్రయాణాలకు తెలంగాణా అనుమతి-తాజావార్తలు

KCR Opens InterState Travel To Telangana-Telugu Breaking News Roundup Today

* ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తుదుపరి 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. జూన్‌ 3నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్‌ తీరాలను చేరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఛత్తీ్‌స్‌గఢ్‌ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణమధ్య కర్ణాటక మీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు రేపు కేరళలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాగల 3 రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలున్నాయని.. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

* తెలంగాణలో కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల ప్రస్తుత పరిస్థితులు జూన్‌ 7వరకు యథాతథంగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఆస్పత్రులు, ఔషధ దుకాణాలు మినహా ఇతర దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జూన్‌ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ యథాతథంగా అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, నిన్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ మూడు దశల కార్యాచరణను ప్రకటించిన సంగతి తెలిసిందే.

* కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేత చంద్రకాంత్‌ హందోరే కొవిడ్‌-19 బారిన పడ్డారు. మహమ్మారి నుంచి కోలుకుని శనివారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న అభిమానులు.. ఆయన కారు దిగగానే ఒక్కసారిగా గుమిగూడారు. తన అభిమాన నాయకుడిని తమ సెల్‌ఫోన్లలో బంధించేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో భౌతిక దూరాన్ని మరిచారు. చాలా రోజుల తర్వాత తమ నాయకుడిని చూసే క్రమంలో మరిచిపోయారనుకున్నా.. ఆయన కూడా ఆ వైరస్‌ నుంచే కోలుకుని వచ్చారన్నది ఇక్కడ గమనించదగ్గ విషయం. మరికొందరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చారు కూడా.

* నియంత్రిత పంటల విధానంపై నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమం రసాభాస అయింది. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ, టీపీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిల మధ్య వేదికపైనే వాగ్వాదం చోటు చేసుకుంది. రైతు రుణమాఫీ అంశంపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డితో ఉత్తమ్‌కుమార్‌ విభేదించారు.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు జూన్‌ 3వ తేదీన ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీ, మోడ్రన్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షలకు హాజరుకాలేకపోతే మరోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుందన్నారు. జులై 3వ వారంలో జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా.. రెగ్యులర్‌గానే పరిగణిస్తామని బోర్డు కార్యదర్శి జలీల్‌ స్పష్టం చేశారు.

* భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని జనసేన అధినేత పనన్‌ కల్యాణ్‌ తెలిపారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులతో పవన్ కల్యాణ్ టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇసుక సరఫరా సులభతరం చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలనే ఈ ప్రభుత్వమూ చేస్తోందన్నారు. ఇసుక మాఫియాను అదుపు చేయకపోతే నిర్మాణ రంగం కుదేలవుతుందన్నారు.

* తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కామినేని ఉమాపతిరావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. దోమకొండ గడీకోటలోని లక్ష్మీబాగ్‌లో దహన సంస్కారాలు నిర్వహించే క్రమంలో తేనెటీగలు చెలరేగడంతో ఆటంకం కలిగింది. తేనెటీగలు ఒక్కసారిగా రావడంతో అందరూ భయంతో పరుగులు తీశారు. అంత్యక్రియలకు హాజరైన సినీనటుడు చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌, ఉపాసన తదితరులు ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపటి తర్వాత తేనెటీగలు వెళ్లిపోవడంతో అంత్యక్రియలు కొనసాగాయి. ఉమాపతిరావు కుటుంబ సభ్యులను జిల్లా కలెక్టర్‌ శరత్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజాస్‌ నందన్‌ లాల్‌ పవార్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే పలువురు ప్రముఖులు పరామర్శించారు.