Politics

వంగరలో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు

వంగరలో ఘనంగా పీవీ శతజయంతి వేడుకలు

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెరాస ఎంపీ కె.కేశవరావు వెల్లడించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పీవీదేనని అన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. పీవీ శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 28న నెక్లెస్‌ రోడ్డులోని జ్ఞానభూమిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన పేరు మీద మ్యూజియం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో ఓ సెమినార్‌ కూడా నిర్వహించాలనే అభిప్రాయం వచ్చిందని పేర్కొన్నారు. పీవీ స్వగ్రామమైన వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే అంశంపై చర్చించామని తెలిపారు. శత జయంతి ఉత్సవ కార్యక్రమాలను రూపకల్పన చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని, జయంతి రోజున సీఎం కేసీఆర్‌ కార్యక్రమ వివరాలు విడుదల చేస్తారని కేకే వివరించారు.