Devotional

ప్రథమ తాంబూలం అంటే ఏమిటి?

ప్రథమ తాంబూలం అంటే ఏమిటి?

వయసు, అనుభవం, మనసు, బుద్ధి, సంస్కారం తదితరాల్లో ఉన్నతంగా ఉండేవారికి సహజంగానే మొదటి గౌరవ స్థానం దక్కుతుంది. తొలి మర్యాదను అందుకుంటారు. ఈ మర్యాదా పురస్కారాన్నే ప్రథమ తాంబూలం అంటారు.
ఇది వ్యక్తిత్వ పరిమళానికి పలికే నీరాజనం. ఉన్నత జీవనశైలికి అద్దే చందన సత్కారం.
ప్రతి మనిషిలోనూ మూడు లక్షణాలుంటాయి. అవి మానవత్వం, దివ్యత్వం, దైవత్వం. ఈ మూడింటినీ అనుభవంలోకి తెచ్చుకున్న మనిషి అన్నింటా ఆరాధ్యుడవుతాడు. అగ్రగామిగా పూజనీయుడవుతాడు.
వసిష్ఠ విశ్వామిత్రులిద్దరూ తపస్సంపన్నులే. దేవసభల్లో, రాజసభల్లో, రుషిమండలంలో వసిష్ఠులవారికే ప్రథమ తాంబూలం. ఆయన బ్రహ్మర్షిగా గౌరవాన్ని పొందాడు. విశ్వామిత్రుడూ అంతటివాడే అయినా కామక్రోధాదులను జయించలేకపోయాడు. వసిష్ఠుడితో అనేకసార్లు వాదనలకు, పోటీలకు తలపడ్డాడు. మేనకతో సంసార జీవితం, త్రిశంకు స్వర్గం, హరిశ్చంద్రుడితో అబద్దమాడించి తీరతానన్న పట్టుదల వంటివాటితో తపశ్శక్తిని వృథా చేసుకున్నాడు. అహంకారం, రజోగుణాలతో రగిలిపోయేవాడు. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు, అనుభవాలు విశ్వామిత్రుణ్ని స్థితప్రజ్ఞుడిగా చేశాయి. అహంకార ఆభిజాత్యాలను, ఆవేశాలను వదిలేశాక బ్రహ్మర్షిగా గౌరవాన్ని అందుకున్నాడు.
ప్రథమ తాంబూలాన్ని అందుకునే అర్హత అయిదింటివల్ల ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజెబుతున్నాయి. అవి- మానసిక ప్రసన్నత, శాంత స్వభావం, భగవచ్ఛింతన, మనోనిగ్రహం, అంతఃకరణ శుద్ధి. వీటివల్ల సంస్కార లక్షణం ఉన్నతంగా ఉంటుంది. వీటిని మానసిక తపస్సులని భగవద్గీత స్పష్టీకరించింది.
ఈ సులక్షణాలు భేదభావాలను, గెలుపు ఓటములను, శ్రేణీభేదాలను పట్టించుకోవు.
ప్రథమ తాంబూలాన్ని అందుకునే ‘యోగ్యతా సాధన’కు తమోగుణం శత్రువు. అలవిమీరిన ఆశలు, కోర్కెలు అందలాలను లక్షిస్తాయి. మనిషి నడతను గాడి తప్పేలా చేస్తాయి. ఈ వలయాలను మనిషి ఛేదించుకొని బయటపడగలిగితే అదే- యోగ్యత. అప్పుడు సమ్యక్‌దృష్టి ఏర్పడుతుందని బుద్ధభగవానుడు ప్రబోధించాడు.
ప్రథమ తాంబూలాన్ని అందుకునేవారిపట్ల, గౌరవాభిమానాలు ఉండాలేకానీ- ఈర్ష్య, అసూయ, ద్వేషభావాలు ఉండకూడదు. వారిలోని ఉత్తమగుణాలను శ్లాఘించే గొప్పమనసు ఉండాలి.
వివేకానందుడు చిన్నతనంలో సాధుసన్యాసులను విమర్శించేవాడు. ఎదిగేకొద్దీ ఆలోచనా విధానంలో పరిణతి ఏర్పడింది. విమర్శించడం తప్పనిపించింది. వారిలో ఉండే కర్తవ్యదీక్ష, త్యాగం, సహనశక్తి తనలో ఎంత శాతం ఉన్నాయనే అంతరంగ పరిశీలన ఆయనలో చోటుచేసుకుంది. చివరకు ఆయనే స్వామీజీగా మారాడు. మహోన్నతుడైనాడు.
‘మాతృదేవోభవ’ అంటుంది వేదం. తల్లికి మహోన్నత గౌరవం ఉంది. ఆమెదే అన్నింటా ప్రథమ తాంబూలం. తల్లికి తన కుటుంబంపట్ల ప్రేమాభిమానాలే తప్ప, శ్రేణీభేదాలు (స్థాయీభేదాలు) ఏనాడూ పట్టించుకోదు. మాతృహృదయం అంత గొప్పది.
విశాలభావాలతో, పరిణతి చెందిన మూర్తిమత్వంతో, శాంతియుత సమన్వయానికై మనిషి ముందుకు అడుగేయాలి. ఆ ప్రస్థానంలో లభించే మర్యాదాపురస్కారం గొప్పది. విలువ కట్టలేనిది. అది ఎనలేని ఆత్మతృప్తికి దోహదపడుతుంది.