NRI-NRT

వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు చింపేస్తాం

వేధించే ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు చింపేస్తాం

ఎన్నారై భర్తలు వేధిస్తున్నారని కుమిలిపోవద్దని.. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా బాధిత మహిళలు ఎన్నారై సెల్‌ను సంప్రదించవచ్చని విమెన్‌ సేఫ్టీ వింగ్‌ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా చెప్పారు. బాధిత మహిళలకు తమ వంతుగా చట్టపరమైన సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నారై భర్తల వేధింపులు–గృహహింసపై పరిష్కారం చూపేందుకు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వర్చువల్‌ వర్క్‌షాప్‌నకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ వెబినార్‌లో 80 మందికిపైగా ఫిర్యాదుదారులు/బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్‌ 17న విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎన్నారై సెల్‌కు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ వాట్సాప్‌ నంబర్‌కు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఎన్నారై భర్తల వల్ల వేధింపులు, గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు పలు న్యాయ సాయమందిస్తూ పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. బాధితులు ఏ దేశంలో ఉన్నా నిరాశ చెందకుండా.. ఎన్‌ఆర్‌ఐ సెల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. డీఐజీ బడుగుల సుమతి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నారై సెల్‌కు 101 ఫిర్యాదులు రాగా అందులో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 కేసుల్లో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని, ఏడుగురి పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించామని, 44 కేసుల్లో నిందితులను భారత్‌కు రప్పించేలా ఒత్తిడి చేసేందుకు వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాశామని వివరించారు. యూకేలోని వెన్‌ ఎన్జీవోకు చెందిన గీతా మోర్ల, చికాగో నుంచి చాందిని మాట్లాడుతూ.. ఎన్నారై భర్తల విషయంలో వేధింపులు ఎదు ర్కొంటున్న బాధితులకు చట్టపరంగా సాయం అందజేస్తామని ముందుకొచ్చారు.