Business

83ఏళ్ల వరకు NetFlix ఉచితం-వాణిజ్యం

83ఏళ్ల వరకు NetFlix ఉచితం-వాణిజ్యం

* నెట్‌ఫ్లిక్స్‌ పరిచయం అక్కర్లేని పేరు. కొత్త కొత్త సినిమాలు, కార్యక్రమాలను యూజర్లకు అందుబాటులోకి తెస్తుంటుంది. పోటీని తట్టుకుని తన బ్రాండ్‌ను నిలుపుకునేందుకు ఓ అద్భుతమైన ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. జీవితాంతం లేదా శాశ్వతంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశాన్ని కల్పించనుంది. అంటే 83 సంవత్సరాలు (దాదాపు వెయ్యి నెలలు) ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వాడుకోవచ్చన్నమాట. సుమారుగా రూ. 9లక్షలు ఆదా అయినట్లే. అయితే దీనికోసం చేయాల్సిందల్లా ఓ గేమ్ ఆడటమే. మీరు ఆటను ప్రారంభించే ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న ‘ద ఓల్డ్‌ గార్డ్‌’ సినిమాను చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పోటీ కోసం ఉపయోగించిన గేమ్‌… ఆ చిత్రంలోని సంఘటనలకు అద్దం పడుతోంది. అయితే దీనికోసం ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదంటోంది నెట్‌ఫ్లిక్స్‌. ఈ గేమ్‌ ఎంతో హుందాగా ఉండి యాక్షన్ థ్రిల్లింగ్‌ కలిగిస్తోందని పేర్కొంది. ఈ గేమ్‌ జులై 17న మొదలు కాగా.. జులై 19వ తేదీ వరకు ఆడే ఛాన్స్‌ ఉంది. ‘న్యూ ఓల్డ్‌ గార్డ్‌’గేమ్‌లో అత్యధిక స్కోరు చేసిన విజేతకు వెయ్యి నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌ అందించనుంది. గేమ్‌ కోసం కింద ఇచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి రిజిస్టర్‌ అయి ఆడేయవచ్చు.

* 2020-21 జూన్‌ త్రైమాసికంలో ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ నికర లాభం 28.4 శాతం వృద్ధితో రూ.398 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-జూన్‌ 2019-20లో ఈ ప్రైవేటు రంగ జీవితబీమాయేతర కంపెనీ నికర లాభం రూ.310 కోట్లుగా నమోదైంది. స్థూల ప్రత్యక్ష ప్రీమియం ఆదాయం(జీడీపీఐ) 5.3 శాతం తగ్గి రూ.3,487 కోట్ల నుంచి రూ.3302 కోట్లకు పరిమితం అయింది. కరోనా కరణంగా ఈ క్షీణత కనిపించిందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

* ఏప్రిల్‌- జూన్‌లో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ల్లో రూ.11,710 కోట్లను మదుపర్లు పెట్టుబడులుగా పెట్టారు. అంతకుముందు త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే 62 శాతం క్షీణించడం గమనార్హం. జనవరి- మార్చిలో ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత ఫండ్‌ పథకాల్లో రూ.30,703 కోట్లను మదుపు చేశారు. కరోనా వైరస్‌ పరిణామాల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావడం, ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై అనిశ్చితి నెలకొనడం లాంటివి ఏప్రిల్‌- జూన్‌లో పెట్టుబడులు తగ్గడానికి కారణమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పై రూ.11,710 కోట్లలో.. ఏప్రిల్‌లో రూ.6,213 కోట్లు, మేలో రూ.5,256 కోట్లు చొప్పున ఈక్విటీ ఫండ్‌ పథకాల్లోకి వచ్చాయి. జూన్‌లో గత నాలుగేళ్లలోనే అత్యంత తక్కువగా రూ.240.55 కోట్లు మేర మదుపర్లు పెట్టుబడిగా పెట్టారు. అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా గణాంకాల ప్రకారం.. జూన్‌ చివరినాటికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.7.01 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరినాటికి ఇది రూ.5.78 లక్షల కోట్లుగా ఉంది. ఏప్రిల్‌- జూన్‌లో క్రమానుగత పెట్టుబడల ప్రణాళిక (సిప్‌) ద్వారా రూ.24,416 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయి. మార్చి త్రైమాసికంలో పెట్టుబడిగా పెట్టిన రూ.25,686 కోట్లతో పోలిస్తే తగ్గడం గమనార్హం. ఒక్క జూన్‌లో సిప్‌ల ద్వారా రూ.8,000 కోట్లు వచ్చాయి. 2018 నవంబరు తర్వాత ఒక నెలలో సిప్‌ల ద్వారా వచ్చిన అత్యంత తక్కువ పెట్టుబడి ఇదే. మొత్తం మీద జూన్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో రూ.1.24 లక్షల కోట్లను మదుపర్లు మదుపు చేశారు. రానున్న నెలలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే.. ఫండ్‌ పథకాల్లోకి పెట్టుబడుల రాక కూడా పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

* భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో విడతలో రూ.10,000 కోట్ల నిధులను వసూలు చేసింది. జులై 14న మొదలై శుక్రవారం ముగిసిన ఈ ఈటీఎఫ్‌ ఇష్యూ పరిమాణం రూ.3,000 కోట్లు. అయితే గ్రీన్‌-షూ ఆప్షన్‌ కింద రూ.11,000 కోట్లను అదనంగా సమీకరించవచ్చు. దీంతో మొత్తం మీద ఈ ఇష్యూ పరిమాణం రూ.14,000 కోట్లకు చేరుతుందన్నమాట. కాగా, రెండో దశ భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌కు మూడింతలకు పైగా స్పందన లభించిందని, వివిధ విభాగాల నుంచి రూ.10,000 కోట్ల వరకు వసూలయ్యాయ’ని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం(దీపమ్‌) కార్యదర్శి ట్వీట్‌ చేశారు. తుది వసూలు సంఖ్యను సోమవారం విడుదల చేయనున్నట్లు ఆ ట్వీట్‌లో తెలిపారు.

* గత నాలుగు నెలలుగా అమ్మకాలు లేక వెలవెలబోయిన సెల్‌ఫోన్ల సంస్థలు ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాయి. కరోనా మహమ్మారి దెబ్బకు కుదేలైన ఆర్థిక రంగం నిలుదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలూ జోరందుకుంటాయనే ఆశాభావంతో పలు సంస్థలు రంగంలోకి దిగాయి. జులై 22న ఆసుస్‌ ఋఓఘ్ ఫోన్‌ 3ను విడుదల చేసేందుకు నిర్ణయించింది. అదే రోజు లెనోవో గేమింగ్‌ లీజెన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ప్రధానంగా గేమ్స్‌ ఆడేవారిని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లుగా తెలుస్తోంది. లెనోవో లీజెన్‌ ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి కొన్ని అంశాలతోపాటు ఫొటోలు లీకయ్యాయి. ఫోన్‌ ఖరీదు సుమారు రూ. 50వేల వరకు ఉండొచ్చని అంచనా.