DailyDose

జగన్…నిమ్మగడ్డను అనుమతించాలి-తాజావార్తలు

MP Raghurama Raju Suggests YS Jagan-Breaking News Today

* న్యాయ వ్యవస్థను గౌరవించని ప్రభుత్వ వ్యవస్థకు పుల్‌స్టాప్‌ పెడదామని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ….ఇప్పటికైనా సీఎం జగన్‌ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ని తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు రమేష్‌ కుమార్‌ను నియమిస్తే వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ రమేష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయమని ప్రజలు గమనించారని గుర్తు చేశారు.

* పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులతో ఆయన సమావేశమై.. అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చల అనంతరం బిల్లులపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది.

* తెలంగాణ సచివాలయం కూల్చివేత కవరేజీకి మీడియాకు అనుమతివ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. కూల్చివేత వివరాలతో మీడియాకు బులిటెన్‌ ఇవ్వడానికి సిద్ధమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కూల్చివేత వద్దకు ఎవరినీ వెళ్లనీయవద్దని నిబంధనలు చెబుతున్నాయని ఏజీ కోర్టుకు వివరించారు.మరోవైపు బులిటెన్‌లో వివరాలు సమగ్రంగా ఉండవని పిటిషనర్‌ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం టూర్‌ ఏర్పాటు చేసి మీడియాను తీసుకెళ్లగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

* కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 13వ సీజన్‌పై స్పష్టత వచ్చింది. సెప్టెంబర్‌ 19న ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభమవుతుండగా, నవంబర్‌ 8న ఫైనల్‌తో ముగియనుంది. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబి ఈ మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నట్లు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

* ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’కు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. దేశంలో కరోనా ఉద్ధృతి ఉన్నప్పటికీ కార్యక్రమాలను రద్దు చేయడం లేదని స్పష్టం చేసింది. సామాజిక దూరం, పారిశుద్ధ్యం పాటించడం, మాస్క్‌లు ధరించడం కొనసాగిస్తూనే వేడుకలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా ఉపయోగించుకోవాలని కేంద్రం సూచించింది.

* కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆయన మోదీ సర్కార్‌ను టార్గెట్‌ చేశారు. నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా పలు అంశాలపై కేంద్రం తీరుపై మండిపడుతున్న రాహుల్‌.. తాజాగా దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంపై తాను హెచ్చరించినా పట్టించుకోలేదని ట్విటర్‌లో ఆరోపించారు.

* హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మహీంద్రా యూనివర్సిటీని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. మహీంద్రా గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రాతో కలిసి ఆన్‌లైన్‌ మాధ్యమం ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మహీంద్రా గ్రూప్‌ సంస్థల మాదిరిగా యూనివర్సిటీ సైతం అత్యున్నత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని యూనివర్సిటీ యాజమాన్యానికి కేటీఆర్‌ సూచించారు.

* ఇటీవల పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్‌ విద్యార్థులందరినీ పాస్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు లేకుండానే వారందరికీ ఓక్కో సబ్జెక్టుకు 35 మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతిలో 35 వేల మంది, ఇంటర్‌లో 43 వేల మంది విద్యార్థులు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా విద్యనభ్యసిస్తున్నారు.

* రాజస్థాన్‌ రాజకీయం క్షణక్షణం ఆసక్తిగా మారుతోంది. తాజా పరిణామాలు సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్సెస్‌ గవర్నర్‌ అన్నట్లుగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ సెషన్‌ కీలకంగా మారడంతో గహ్లోత్‌ సమావేశాల నిర్వహణకు పట్టుబడుతున్నారు. దీనిపై సీఎం మాట్లాడుతూ.. పదే పదే పట్టుబడుతున్నా.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చేందుకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా వెనకాడుతున్నారని ఆరోపించారు. గవర్నర్‌పై పై స్థాయి నుంచి ఒత్తిడి ఉందని.. అందువల్లే ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్నారు.

* మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు చేధించడానికి సీబీఐ మరోమారు పులివెందులలో ఆయన నివాసాన్ని పరిశీలించింది. పదిమందికి పైగా సీబీఐ అధికారుల బృందం వివేకా హత్య జరిగిన ప్రదేశంలో అణువణువూ పరిశీలించింది. పులివెందుల టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సర్వేయర్లతో ఇంటి మ్యాప్‌ను సీబీఐ అధికారులు తయారు చేస్తున్నారు.