Health

పిల్లల్లో ఆగ్రహం అధికంగా ఉందా?

Anger Management Issue With Kids

పని ఒత్తిడిలో ఉన్నప్పుడు పిల్లలు కాస్త అల్లరి చేసినా.. కోపానికి గురికావడం సహజం. మరి వాళ్లు ఇంటిపట్టునే ఉంటున్న ఈ రోజుల్లో పరిస్థితులు అదుపులో ఉండకపోవచ్చు. అలాగని ఆగ్రహం కట్టలు తెంచుకున్నా.. అతిగా కట్టడి చేసినా.. ఎవరికీ మంచిది కాదు. ఈ సూచనలు పాటిస్తే.. ఆల్‌ హ్యాపీస్‌!
ఒకప్పుడు బడి, హోమ్‌వర్క్‌లు, ఆటలు.. అలిసిపోయి నిద్రపోవడాలు ఇదే దినచర్య. కానీ, ఇప్పుడు.. ఇంట్లోనే పాఠాలు, బాల్కనీలోనే ఆటలు.. తోటి పిల్లలతో కలిసే అవకాశాలు లేకుండా పోయాయి. రోజంతా ఇంట్లోనే గడపాల్సి వస్తుండటంతో అల్లరి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని అర్థం చేసుకోవాలి. రకరకాల వ్యాపకాలు కల్పిస్తే అల్లరి పిల్లలు బుద్ధిగా అందులో నిమగ్నమవుతారు.
* కొన్ని విషయాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరించడమే మంచిది. ఏ పని చేసినా వద్దని వారించడం, టీవీ ఆన్‌ చేయగానే వెంటనే వెళ్లి ఆఫ్‌ చేయడం, మొబైల్‌ పట్టుకోగానే దురుసుగా లాక్కోవడం.. లాంటివి చేయకండి. కాసేపు వారు ఏం చేయదలుచుకున్నారో చేయనివ్వండి. కంటి ముందే ఉన్నారు కదా అని.. అతిగా ఫోకస్‌ చేయడం వల్ల.. వారు మీ చెంతనే ఉన్నా… ఒంటరిగా ఉన్నామనే భావనకు లోనవుతారు.
* మీ ఉద్యోగంలో చికాకులు.. ఇంట్లోవాళ్లపై రుద్దేయకండి. ఎదుటివారిపై గట్టిగా అరిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనుకోకుండా పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికినందుకు సంతోషంగా భావించండి. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోండి. వారితో ఆడుకోండి. మీరే పాఠాలు చెప్పండి. హోమ్‌వర్క్‌లు చేయించండి. సాయంత్రం ఇష్టమైన స్నాక్స్‌ చేసివ్వండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమై.. ప్రశాంతత కలుగుతుంది.