Fashion

చేనేత మాస్కులనే వాడండి

చేనేత మాస్కులనే వాడండి

కరోనా బారి నుంచి రక్షణ పొందడానికి దాదాపు 14 రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది మంచిది? ఏది సమర్థంగా రక్షణ కల్పిస్తుందనేదానిపై అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. మంచి డిజైన్‌, తక్కువ ఖర్చుతో మాస్కులు తయారు చేయడానికి తమ పరిశోధన ఉపకరిస్తుందని వారు చెబుతున్నారు. వైద్యులు ఉపయోగించే ఎన్‌95 గ్రేడ్‌ మాస్కులు, సర్జికల్‌/పోలీప్రొపైలీన్‌ మాస్కులు, చేనేత (నూలు)తో చేసిన మాస్కులు సురక్షితమైనవని తేల్చారు. నోటికి రుమాలు, మెడకు మఫ్లర్‌, ఇతర వస్త్రాలను కట్టుకున్నా ఎలాంటి ఫలితమూ ఉండబోదని గుర్తించారు. ఇవి నోటి తుంపర్లను అడ్డుకోలేవని పరిశోధనల్లో తేలింది. పలువురు వ్యక్తులకు వివిధ రకాల మాస్కులు కట్టి మాట్లాడించడం ద్వారా పరిశోధనలు జరిపారు. వారి నోటి నుంచి వచ్చిన తుంపర్లను సెల్‌ఫోన్‌ ద్వారా చిత్రీకరించి, కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాస్కులు సరిగ్గా కట్టుకోనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపై ఇంకా పరిశోధనలు జరపాల్సి ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.