Agriculture

తెలంగాణాలో 100శాతం ఎరువుల వినియోగం

తెలంగాణాలో 100శాతం ఎరువుల వినియోగం

రాష్ట్రంలో 100 శాతం ఎరువుల వినియోగం పెరిగిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన.. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల కోటాపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువులకు ఎలాంటి కొరత లేదన్నారు. కొవిడ్‌, వర్షాల వల్ల ఎరువుల సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ కొరత రాకుండా చూస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఇప్పటికే 1.24 కోట్ల ఎకరాలకు చేరిందని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆరేడు లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉండగా.. మరో ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని తెలిపారు. మొత్తం కోటి 40 లక్షల ఎకరాలకు ఎరువులు అవసరమని వెల్లడించారు. రాష్ట్రానికి కేంద్రం 22 లక్షల మెట్రిక్‌టన్నుల ఎరువులు కేటాయించిందని మంత్రి తెలిపారు. అందులో పదిన్నర లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, మిగతా ఎరువులు మరో 11 లక్షల మెట్రిక్‌ టన్నులని వివరించారు. వర్షాలు విరివిగా కురుస్తున్నందున ఆగస్టు కోటా పూర్తిగా విడుదల చేసేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రిని కోరినట్లు నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.