Business

చైనా కారణంగా నష్టాల్లో భారత మార్కెట్లు-వాణిజ్యం

చైనా కారణంగా నష్టాల్లో భారత మార్కెట్లు-వాణిజ్యం

* ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియోఫైబర్‌ బ్రాండ్‌బాండ్‌కు సంబంధించి కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇకపై నెలవారీ ప్లాన్లను రూ.399 నుంచే ప్రారంభమవుతాయని తెలిపింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ప్లాన్లు అందుబాటులోకి రానుందని రిలయన్స్‌ జియో ఓ ప్రకటనలో తెలిపింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సోమవారం నాటి ట్రేడింగ్‌ ఆరంభంలో సెన్సెక్స్‌ 40వేల మార్కును అందుకోవడం చూసిన మదుపరికి.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. భారత్‌-చైనా మధ్య మరోసారి ఘర్షణ తలెత్తిందన్న వార్తలు కలవరపెట్టడంతో సూచీలు నేల చూపులు చూశాయి. రోజంతా అదే ఒరవడి కొనసాగింది.

* స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కుంగిపోయాయి. మార్నింగ్‌ సెషన్‌లో వచ్చిన లాభాలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఓ దశలో 40,010 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్‌ ఏకంగా 899 పాయింట్లు కోల్పోయి భారీ నష్టాల్ని మూటగట్టుకుంది. చైనాతో మళ్లీ ఘర్షణ జరిగిందన్న వార్త మదుపర్లను ఉలికిపాటుకు గురిచేసింది. దీంతో లాక్‌డౌన్‌ సడలింపులు, ఆర్బీఐ నుంచి సానుకూల స్పందనల నేపథ్యంలో ఉదయం లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీనికి తోడు జీ20 దేశాల్లో అత్యల్ప వృద్ధిరేటు భారత్‌లోనే నమోదుకానుందన్న ఆర్థిక నిపుణుల అంచనా మరింత కలవరానికి గురి చేసింది. దీంతో దాదాపు తొమ్మిది రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్నాహ్నం 1:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 721 పాయింట్లు నష్టపోయి 38,745 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 233 పాయింట్లు కుంగి 11,417 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.81 వద్ద కొనసాగుతోంది. ఓఎన్‌జీసీ, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో షేర్లు స్వల్ప లాభాల్లో పయనిస్తుండగా.. సన్‌ ఫార్మా, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, శ్రీ సిమెంట్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

* వినియోగదారుల భద్రతను కాపాడే విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న టిక్‌టాక్‌ విక్రయాన్ని అడ్డుకునేందుకు చైనా ఎత్తుగడలు వేస్తోంది. తద్వారా టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాల్ని విక్రయించాలన్న ట్రంప్‌ డిమాండ్‌కు చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించిన్నట్లు చైనాకు చెందిన ఓ ప్రముఖ ప్రొఫెసర్‌ తెలిపారు. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా సంస్థ జిన్హువా ఓ కథనాన్ని ప్రచురించింది.

* కనీస ప్రతిఫలాలకు హామీనిచ్చే ఒక పింఛను పథకాన్ని తీసుకురావడానికి ద పింఛన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) కసరత్తు చేస్తోంది. ఆ మేరకు పీఎఫ్‌ఆర్‌ఏడీఏ ఛైర్మన్‌ సుప్రతిమ్‌ బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. ప్రతిపాదిత పథకం విధివిధానాలపై పింఛన్‌ ఫండ్‌లు, గణాంక సంస్థలతో చర్చిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం కింద కనీస ప్రతిఫలాలకు హామీనిచ్చే పథకాన్ని ఆవిష్కరించాల్సి ఉంది. పీఎఫ్‌ పథకాల కింద వచ్చే నిధులను మార్క్‌-టు-మార్కెట్‌లో నిర్వహిస్తారు. కాబట్టి మార్కెట్‌ చలనాలను బట్టి వాటి విలువలో కొంత ఊగిసలాట కనిపించవచ్చు. యఅఇతే కొంత మంది కనీస హామీని కోరుకుంటారు. ఈ నేపథ్యంలోనే మా పింఛన్‌ ఫండ్‌ మేనేజర్లుతో చర్చిస్తున్నామ’ని బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇది వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానంగా ‘మేం ప్రయత్నిస్తాం. తొలిసారిగా మేం సొంతంగా తీసుకొస్తున్న పథకం ఇది. ఇప్పటి వరకు వచ్చిన పథకాల్లో ఎటువంటి హామీ లేదు. మార్కెట్‌ ఎంత ప్రతిఫలాలను ఇస్తే.. వాటిని మేం వినియోగదార్లకు బదిలీ చేస్తున్నాం అంతే. పెట్టుబడుల నష్టభయం వినియోగదారుకు ఉండేద’ని చెప్పుకొచ్చారు. నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎస్‌), అటల్‌ పెన్షన్‌ యోజన(ఏపీవై)లు ఆర్థిక శాఖతో చర్చించిన అనంతరం తీసుకొచ్చినవని గుర్తుచేశారు. అయితే తాము ఎన్‌పీఎస్‌, ఏపీవైలలో పలు ఫీచర్లు ప్రవేశపెట్టామన్నారు.