Business

బంగారంపై లోన్ల పరిమితి పెంచిన RBI

బంగారంపై లోన్ల పరిమితి పెంచిన RBI

బంగారంపై తీసుకునే లోన్ మొత్తాన్ని పెంచుతూ ఆర్‌‌బీఐ తీసుకున్న నిర్ణయం దేశానికి ఎంతో మేలు చేస్తోంది. తీవ్రనష్టాల్లో ఉన్న చిన్న ఇండస్ట్రీలకు, కుటుంబాలకు తగినంత డబ్బు చేతికి వస్తోంది. భారతీయుల దగ్గర సహజంగానే బంగారం ఎక్కువగానే ఉంటుంది. ఇదంతా మార్కెట్లోకి వచ్చి, లోన్లుగా మారితే ఎకానమీకి బూస్ట్‌‌ అవుతుంది. మరింత త్వరగా రికవరీకి అవకాశాలు ఉంటాయి. డిమాండ్‌‌ పెరుగుతుంది. బ్యాంకులతోపాటు ఎన్‌‌బీఎఫ్‌‌సీల బిజినెస్‌‌ పెరుగుతుంది. ఆర్‌‌బీఐ నిర్ణయం వల్ల ఇక నుంచి పసిడి విలువలో 90 శాతం మొత్తాన్ని లోన్‌‌గా పొందవచ్చు. ఉదాహరణకు పది గ్రాముల గోల్డ్ రేటు రూ.50 వేలు అనుకుంటే, రూ.45 వేల వరకు లోన్ తీసుకోవచ్చు. మరింత ఈజీగా గోల్డ్‌‌లోన్స్‌‌ ఇచ్చేలా ఆర్బీఐ ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్లకు ఆదేశాలు ఇచ్చింది. గతంలోని రూల్స్ ప్రకారం బంగారం విలువలో 75 శాతం వరకు వరకు మాత్రమే లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిని 90 శాతానికి పెంచారు. అయితే వచ్చే ఏడాది మార్చి వరకే ఈ సదుపాయం ఉంటుంది.

*** భారీగా బంగారం
మనదేశంలోని ఇండ్లలో దాదాపు 25 వేల టన్నుల బంగారం ఉంటుంది. దీని విలువ ఎంతో తెలుసా ? 1.41 లక్షల కోట్ల డాలర్లు! మరోరకంగా చెప్పాలంటే మన సాధారణ జీడీపీలో సగం. ఇండియాలోని ఆలయాల్లోని బంగారాన్ని అమ్మితే బ్యాంకులన్నింటికీ మూలధనం సర్దుబాటు చేయొచ్చని ఎక్స్‌‌పర్టులు చెబుతారు. భారతీయులకు సహజంగానే బంగారంతో అనుబంధం ఎక్కువ. మన కల్చర్‌‌లో ఇదొక భాగం. లోన్లు తీసుకోవడానికే కాదు పెట్టుబడులకు కూడా పసిడిని ఉపయోగించుకోవచ్చు.
*** భారీగా లోన్లు ఇస్తున్న బ్యాంకులు
గోల్డ్‌‌ లోన్లు ఎంతో సేఫ్‌‌. బాకీ వసూలు కాదన్న బెంగ అక్కర్లేదు. అందుకే బ్యాంకులు వీటిని విపరీతంగా ఎంకరేజ్‌‌ చేస్తున్నాయి. మిగతా అన్‌‌సెక్యూర్డ్‌‌ లోన్లను పెద్దగా ఇవ్వడం లేదు. కేరళ కేంద్రంగా పనిచేసే క్యాథలిక్‌‌ సిరియన్‌‌ బ్యాంక్‌‌ గోల్డ్‌‌లోన్‌‌ బుక్‌‌ విలువ 2017లోరూ.2,025 కోట్లుకాగా, గత ఏడాది ఇది రూ.3,333 కోట్లకు చేరింది. తమిళనాడుకు చెందిన సిటీ యూనియన్‌‌ బ్యాంకు గోల్డ్‌‌లోన్‌‌ బుక్ విలువ ఇదే కాలంలో రూ.2,136 కోట్ల నుంచి రూ.2,917కోట్లకు ఎగిసింది. బ్యాంకులు గోల్డ్‌‌లోన్లకు కేవలం పది శాతమే వడ్డీ తీసుకుంటున్నాయి. ముతూట్‌‌, మణప్పురం వంటి ఎన్‌‌బీఎఫ్‌‌సీల్లో వడ్డీ 20 శాతం వరకు ఉంటుంది.
*** పల్లెటూళ్లకు ఊరట
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పల్లెటూళ్లలో అప్పులు పుట్టడం కష్టంగా మారింది. అయితే చాలా మంది ఇండ్లలో బంగారం బాగానే ఉంది. వాటితో బ్యాంకు లోన్లు తీసుకొని ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడవచ్చు. వడ్డీభారం కూడా తక్కువగా ఉంటుంది. సాగుకు అవసరమైన పెట్టుబడిని సులువుగా సమకూర్చుకోవచ్చు. ఎక్కువ మంది గోల్డ్‌‌లోన్లకు మొగ్గుచూపడంతో టీవీ, ఫ్రిజ్‌‌ల వంటి వాటి కోసం తీసుకునే లోన్లు బాగా తగ్గాయి. పర్సనల్‌‌ లోన్లు కూడా ఈ క్వార్టర్‌‌లో 2.5 శాతం తగ్గాయి.