Editorials

పరిణామం గుట్టు విప్పిన డార్విన్-ఇన్నయ్య ముచ్చట్లు

పరిణామం గుట్టు విప్పిన డార్విన్-ఇన్నయ్య ముచ్చట్లు

పరిణామం గుట్టు విప్పిన డార్విన్
జీవితం – విజ్ఞానం
పరిణామానికి ప్రత్యక్ష సాక్షి ఛార్లెస్ డార్విన్

పరిణామం నిరంతరం జరుగుతున్నది. ఇది ప్రకృతి క్రమం దీనిని స్వయంగా చూచిన డార్విన్ ప్రపంచానికి ఆ విశేషాలు చెప్పాడు. పరిణామం ఒక సిద్ధాంతం కాదనీ, రుజువులకు ఆధారాలకు నిలుస్తున్న వాస్తవమని ఛార్లెస్ డార్విన్ గమనించాడు.
పరిణామం ఒక సిద్ధాంతమని మతవాదులు, ముఖ్యంగా క్రైస్తవులు చెబుతున్నారు. అన్ని మతాల వారి విశ్వాసాలను, ఆధారాలు లేని రాతలను ఆధునిక పరిణామం పక్కన బెడుతున్నది. సాక్ష్యాధారాలు విపులంగా రాసి, చూపిన డార్విన్ సైంటిఫిక్ పరీక్షలకు నిలిచాడు.
అన్ని పాఠశాలలో ప్రాథమిక దశ నుండి కాలేజి వరకు తప్పనిసరిగా పరిణామాన్ని పాఠ్యాంశంగా అధ్యయనం చేయాలి. అలా చేయకపోవడానికి మత నమ్మకాలు అడ్డొస్తున్నాయి. కాని ప్రమాణాలు తిరుగులేనివిగా వున్నప్పుడు క్రమేణా లొంగి రాక తప్పదు ఆ స్థితి వస్తున్నది.
పరిణామం గురించి ప్రత్యక్ష సాక్షులుగా చార్లెస్ డార్విన్, వాలేస్ చరిత్రలో నిలిచారు. ప్రస్తుతం ఆ రంగంలో ఆద్యుడైన చార్లెస్ డార్విన్ గురించి ఆయన కనుగొన్న ప్రకృతి ప్రమాణాల గురించి వివరంగా పరిశీలిద్దాం.

*** డార్విన్ జీవిత శోభ
వయస్సులో పరిణితి చెందిన డార్విన్, 67 సంవత్సరాలు వచ్చిన తరువాత తన జీవిత విశేషాలను క్లుప్తంగా లోకానికి తెలియపరచాడు. డార్విన్ విప్లవాత్మక పరిణామ సత్యాన్ని లోకం పట్టించుకుంటున్న తరుణంలో జీవితచరిత్ర అందించాడు.
అయితే డార్విన్ జీవితాన్ని ప్రచురించేటప్పుడు అందులో కొన్ని భాగాలను దాచి పెట్టడం, ప్రపంచానికి వెల్లడించకపోవడం కావాలనే చేశారు. ఇప్పుడు ఆ లోటును ఆయన కుమార్తె పూరించి డార్విన్ రాసిన స్వీయ చరిత్రను యథాతథంగా వెల్లడించింది.
డార్విన్ తన స్వీయ చరిత్రలో నమ్మకాల విషయం ప్రస్తావించి, చాలా తీవ్రంగా విమర్శలు చేశాడు. అవి బయటకు రానివ్వకుండా ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు ఆపారు. కాని ఆయన కుమార్తె ప్రచురించకుండా ఆపిన భాగాలను, మనుమరాలు నోరా బార్లో క్షుణ్ణంగా పరిశీలించి వెల్లడించింది.
డార్విన్ కాకమ్మ కథలు చెప్పలేదు. జీవితం ధారబోసి ప్రకృతి విశేషాలను మానవాభ్యుదయం నిమిత్తం బయట పెట్టాడు. అందులో స్వార్థం లేదు. మానవ ప్రయోజనమే వున్నది. పైగా మానసిక పరిణితి దశలో రాశాడు. అలాంటి విశేషాలు బడి పిల్లలు మొదలు పరిణితి చెందిన పెద్దల వరకూ తెలుసుకోవాలి. అందుకే డార్విన్ జీవిత చరిత్ర అందిస్తున్నాం. మత ప్రభావంతో వున్నవారు బయటపడి విజ్ఞానంతో వికసించడానికి దారితీస్తుంది యీ రచనకు.

*** తొలిదశ జీవితం
ప్రకృతిలో పరిణామాన్ని చూచి ప్రపంచానికి చూపిన చార్లస్ డార్విన్ ఇంగ్లండ్ లోని ఒక గ్రామంలో – స్రూస్ బరిలో 1809 ఫిబ్రవరి 12న పుట్టాడు. తండ్రి వైద్యవృత్తిలో సేవలు చేశాడు. తల్లి 1817 జూలైలో డార్విన్ కు 8 ఏళ్ళ ప్రాయంలో చనిపోయింది. గ్రామంలో పాఠశాలకు వెళ్ళాడు. సోదరి కరోలినా కొంతవరకు చదువు చెప్పింది. స్కూలుకు వెళ్ళేనాటికి డార్విన్ కు చరిత్రపట్ల ఆసక్తి వుండేది.
వివిధ మొక్కల పట్ల బాగా ఆసక్తి కనబరచి, వాటిపేర్లు తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. వస్తు సేకరణపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడు. ఈ బాల్యదశ అలవాటు ఉత్తరోత్తర బాగా పనికొచ్చింది.
స్కూలులో ప్రవేశించేనాటికి డార్విన్ లో వస్తుసేకరణ, వర్గీకరణ, వాటి పేర్లు తెలుసుకోవడం అలవాటైంది. వివిధ మొక్కల పేర్లు గ్రహించి ఆసక్తి చూపాడు. గవ్వలు నాణాలు, ఖనిజ వస్తువుల సేకరణపై దృష్టి పెట్టాడు.
1818 నాటికి డార్విన్ వూళ్ళో వున్న డాక్టర్ బట్లర్ స్కూల్లో అడుగు పెట్టాడు. ఏడేళ్ళపాటు అక్కడ చదువుకున్నాడు.
పక్షుల గూళ్ళ నుండి గుడ్లు సేకరించడం డార్విన్ విద్యార్థి దశలో ఒక అలవాటు. చేపలు పట్టడానికి గాలం తీసుకెళ్ళి సమీప చెరువుల్లో నదిలో ప్రయత్నించేవాడు. కుక్కలంటే అతి ప్రేమ చూపేవాడు. స్కూల్లో భూగోళం, చరిత్ర తప్ప ఏమీ నేర్పేవారు కాదు. భాషలేవీ వుండేవి కావు. పద్యాలు వల్లె వేయించేవారు. చదువు అంతా బట్టీ పెట్టడంతోనే సరిపోయేది. దేనికీ పనికిరావని తండ్రి కోప్పడుతుండేవాడు.
తండ్రి గ్రామంలో వారికి వైద్యం చేసేవాడు. 60 ఏళ్ళ వరకూ అలా చేశాడు. వైద్య వృత్తిలో అనుభవాలు కొన్ని ఆసక్తికరంగా డార్విన్ కు తండ్రి చెప్పేవాడు. తన తండ్రి వైజ్ఞానిక పద్ధతిలో పోవడం లేదని డార్విన్ ఉత్తరోత్తరా గ్రహించాడు.
డార్విన్ సోదరుడు ఎరాస్ మస్, సోదరి ప్రేమ అతనికి అక్కరకు వచ్చాయి.
సైన్స్ పట్ల డార్విన్ కు విద్యార్థి దశలోనే శ్రద్ధ కలిగింది. వస్తు సేకరణ, వర్గీకరణ అందులో భాగమే.
ఊళ్ళోని స్కూల్లో చదివిన డార్విన్ ఏమంత బాగా రాణించలేదు. అందువలన ఎడిన్ బరో యూనివర్సిటీలో 1925 అక్టోబరులో చేర్చి చదివించారు. రెండేళ్ళు అక్కడ చదివాడు. అతని చదువు మీద తండ్రికి అంత ఆశలేదు. అయినా బాగానే ఆస్తులు పంచాడు.
ఎడిన్ బరో విశ్వవిద్యాలయంలో వైద్య చదువుపట్ల డార్విన్ కు బొత్తిగా ఆసక్తి కలగలేదు. డార్విన్ వైద్య చదువు అంతగా ఆసక్తికరంగా ముందుకు పోలేదు.
రాయల్ మెడికల్ సొసైటీలో సభ్యుడుగా చేరి, ఉపన్యాసాలు విన్నాడు. రెండేళ్ళు అలా గడిచాయి.
డార్విన్ వైద్య వృత్తి పట్ల ఆసక్తి కనబరచడంలేదని తెలిసి, తండ్రి అతన్ని కేంబ్రిడ్జి యూనివర్సిటికి పంపాడు. మతగురువును చేయాలనుకున్నాడు తండ్రి.
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎం.ఎ. పట్టా పుచ్చుకున్న డార్విన్ భిన్న అనుభవాలతో బయటకు వచ్చాడు. మత గురువు అయితే బాగుండునని తండ్రి తలపోసినా, డార్విన్ అందుకు దూరంగా జరిగాడు. అయితే వివిధ మతాల సారాంశాన్ని ఔపోశనం పట్టాడు. తన స్వీయచరిత్రలో ఆ విషయాలను నిర్భయంగా బయట పెట్టారు. ముఖ్యంగా క్రైస్తవం, యూదు, ఇస్లాం హిందూమతాల మూలాల్ని చవి చూచాడు.
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ఆనాటికే ప్రసిద్ధి చెందినది. అక్కడ కుమారుడు క్రైస్తవ మతాన్ని అధ్యయనం చేసి, మత గురువు అయితే బాగుండునని తండ్రి తలపోసినా డార్విన్ అందుకు దూరంగా జరిగాడు. తండ్రి కోరిక తీరకుండానే, క్రైస్తవ మత గురువు కాకుండానే డార్విన్ బయటపడ్డాడు. 1828లో కాలవ్యవధి దాటిపోయిన తరువాత కేంబ్రిడ్జి వెళ్ళిన డార్విన్ మూడేళ్ళపాటు కొనసాగాడు. తూనీగలు పట్టి పరిశీలించడం, సుప్రసిద్ధుల ఉపన్యాసాలు వినడం కూడా కేంబ్రిడ్జిలో ముఖ్యంగా వుండేవి.
కేంబ్రిడ్జిలో ఎం.ఎ. డిగ్రీ పుచ్చుకున్న డార్విన్, ప్రకృతిని, ఖనిజాలను, తూనీగల వంటి వాటిని బాగా అధ్యయనం చేశాడు. క్రమేణా మత శాస్త్రాలకు దూరమయ్యారు. అయితే వివిధ మత సారాంశాలను వస్త్రకాయం పట్టాడు. క్రైస్తవం, ఇస్లాం, హిందు, యూదు మతాల విషయం పట్టి చూచాడు. లోతుగా పరిశీలించి, వాటి పట్ల జుగుప్స చెందాడు. అదొక పెద్ద మలుపు క్రైస్తవ సమాజంలో పుట్టి, పెరిగి, క్రైస్తవ ప్రభావంగల కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుండి సందేహవాదిగా మతాల్ని ప్రశ్నించేతత్వం అలవరచుకోవడం గొప్ప మలుపు. అయితే వాటన్నిటినీ తన స్వీయ చరిత్రలో తరువాత రాసినా వెంటనే వాటికి ప్రాధాన్యత యివ్వనేలేదు. శాస్త్రీయ పరిశోధన, వస్తు సేకరణ, నిశిత పరిశీలన అతని ముఖ్యధోరణులు.
కేంబ్రిడ్జి నుండి బయటకు వచ్చేనాటికి డార్విన్ మత రహిత జిజ్ఞాస, వస్తు సేకరణ, పరిశీలన కీలకాంశాలుగా అభివృద్ధి చేసుకున్నాడు.

*** డార్విన్ మత భావాలు!
డార్విన్ పుట్టి పెరిగిన సమాజం క్రైస్తవమయం. డార్విన్ తండ్రి ప్రత్యేకంగా కుమారుడిని ఎలాగైనా క్రైస్తవ మతాచార్యుడుగా చేయాలనుకున్నాడు. అందుకు కాకున్నా, డార్విన్ వివిధ మత పవిత్ర మూలగ్రంథాలు పరిశీలించాడు. అలా చేయడం మంచిదయింది. అందులో అంశాలపట్ల డార్విన్ కు అసహ్య నిరసన, వ్యతిరేకత వచ్చాయి.
క్రైస్తవంలో బైబిల్ పాత నిబంధన క్రూరత్వం, డార్విన్ లో ఏహ్యభావం కలిగించింది. యూదులు దీనినే పవిత్రగ్రంథంగా నేటికీ భావిస్తారు. చరిత్రపట్ల వారి అవగాహన అసంబద్ధమైనది. పగ తీర్చుకునే రీతులు కంపరం కలిగిస్తాయి. హిందువులకు దేవుడు ప్రత్యక్షమైతే, విష్ణువు, శివుడితో సంబంధాలు ఏర్పరుస్తాడా? ఎంత అసంబద్ధం! అలాగే బైబిల్ లో పాత నిబంధన కూడా ఘోరమైనది కూడా.
క్రైస్తవులు నమ్మే అద్భుతాలు ఎంత అసంగతమైనవి?
ప్రకృతి నియమాలు తెలుస్తుంటే అసంబద్ధతల విడ్డూరాలు తేట తెల్లమౌతుంది. బైబిల్ నిబంధనలలో ఏదీ రుజువుకు నిలబడదు. క్రమేణా డార్విన్ క్రైస్తవం పట్ల నమ్మకం తొలగించుకున్నాడు.
నమ్మకాలు క్రమేణా సడలిపోయాయని డార్విన్ అన్నాడు. క్రైస్తవం నిజమని ఎవరైనా ఎలా నమ్ముతారో అర్థం కాదన్నాడు. ప్రకృతిలో నియమాలన్నీ నిర్ధారించాలన్నాడు. నా నిర్ణయాలన్నీ సరైనవేనని తెలిసింది – అన్నాడు డార్విన్. విశ్వమంతా ఒక క్రమపద్ధతిలో సృష్టి అయిందనేది నిరాధారం.
విశ్వంలో అన్నీ నియమబద్ధంగా వచ్చాయి. విశ్వంలో మానవులేగాక, జంతువులు బాధకు గురిగావడంలో, సర్వశక్తిమంతుడి స్వభావం అర్థంపర్థంలేనిదిగా కనిపిస్తుంది. క్రైస్తవులు చెప్పే అసంగత నమ్మికలవంటివి, హిందువులు బౌద్ధులు, ఆటవికులు సైతం చెప్పగలరు.
దేవుడున్నాడని, శాశ్వత ఆత్మలు వుంటాయనే నమ్మిక నాకెన్నడూ లేదు. నేను నాస్తిక వాదిగా మారే దశలోపు సందేహవాదిగా పరిణమిస్తూ పోయాడన్నాడు.
డార్విన్ బీగల్ యాత్ర పరిణామానికి దారి
డార్విన్ జరిపిన ఐదు సంవత్సరాల బీగల్ ఓడ ప్రయాణం పరిణామ గుట్టు విప్పి, ప్రజల ముందు పెట్టింది! ప్రజలకు మేలు బాట.
కేంబ్రిడ్జిలో ఎం.ఎ. పూర్తి చేసిన వెంటనే, అనుకోకుండా డార్విన్ కు ఆహ్వానం వచ్చింది. బీగల్ ఓడ పిట్జ్ రాయ్ పైలట్ గా ప్రయాణానికి సిద్ధంగా వుందనీ, అతనికి తోడుగా, అతని గదిలో భాగం పంచుకొని ప్రయాణం చేయడానికి ఎవరైనా కావాలని ఆహ్వాన సారాంశం. డార్విన్ ఆ అవకాశాన్ని ఆహ్వానించాడు. కాని తండ్రి ఒప్పుకోలేదు. అయితే డార్విన్ మామ రాబర్ట్ ఫిజ్ రాయ్ పట్టుబట్టి, డార్విన్ ను వెంటబెట్టుకెళ్ళి తండ్రిని ఒప్పించాడు. అంతటితో ప్రయాణానికి రంగం సిద్ధమైంది. అదే బీగల్ పరిణామయాత్ర. ఐదేళ్ళ దిగ్విజయ ప్రయాణం!
పిజ్ రాయ్ – డార్విన్ లు ఓడలో ఒకే గదిలో ఐదేళ్ళ పాటు, తరచు కలహించుకుంటూ, మళ్ళీ సఖ్యపడుతూ ప్రయాణం చేశారు. బానిసత్వాన్ని ఫిజ్ రాయ్ సమర్ధిస్తే డార్విన్ తీవ్రంగా ఖండించాడు.
డార్విన్ తుపాకి పట్టుకొని ఓడ ఆగిన చోట దీవులలోనికి వెళ్ళి వివిధ పక్షులను కొట్టి తెచ్చి అధ్యయనం చేసేవాడు. క్రమేణా అది తగ్గించుకున్నాడు.
ఓడ ఆగినప్పుడు దీవులలోకి వెళ్ళి, నగ్నంగా వున్న ప్రజలను తిలకించాడు డార్విన్ పెటగోనియా ఎడారులు, పర్వతాలు చూచాడు. గుర్రంపై అడవి ప్రదేశాలలో తిరిగి అనేక సంగతులు గమనించాడు. సెయింట్ హెలినా వంటి దీవుల పరిశీలన డార్విన్ కు ఎంతో తృప్తినిచ్చింది.
గలపగాస్ దీవులలో జంతువులు, మొక్కలకు వున్న సంబంధాలు బాగా గమనించాడు. దక్షిణ అమెరికాలో వున్న వారికీ గలపగాస్ దీవులకు గల సన్నిహిత సంబంధం గమనించాడు. లావా ప్రవహించిన సెయింట్ జాగో వంటి దీవుల విశిష్టత డార్విన్ గమనించాడు. లావా విషయంలో కొత్త సంగతులు పరిశీలించాడు. వింత అయిన ఎడారి మొక్కల్ని అధ్యయనం చేశాడు. అనేక శిథిల ఎముకల్ని సేకరించి డార్విన్ ఇంగ్లండ్ పంపాడు.
డార్విన్ తన ప్రయాణంలో ఎప్పటికప్పుడు సేకరించిన విషయాలపై క్షుణ్ణంగా రాస్తూ పోయాడు. చీలీలో ఎత్తైన ప్రదేశాలు ప్రత్యేకత పై వివరంగా రాశాడు.
గలపగాస్ దీవుల విశిష్టత
డార్విన్ యాత్రలో కీలకపాత్ర వహించిన గలపగాస్ దీవులు అనేక విషయాలు బయట పెట్టాయి అవి నేడు విజ్ఞానయాత్రలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇందులో చిన్న దీవుల సంగతి అలా వుంచితే, పెద్దవి నాలుగు వున్నాయి. డార్విన్ వీటిని పరిశీలించాడు. అక్కడ నుండి చిన్న తాబేళ్ళను ఐదు తెచ్చాడు పరిశీలనార్థం.
కొన్ని తాబేళ్ళు రెండువందలు, మూడువందల ఏళ్ళనాటివి. ఆరుగురు మనుషులు పట్టిమోస్తేనే ఒక తాబేలును లేవనెత్తగలరు. ఇప్పుడు, ఆ దీవులు విజ్ఞాన యాత్రా కేంద్రాలుగా మారాయి. దక్షిణ అమెరికా పక్కన పసిఫిక్ సముద్రంలో వున్న గలపగాస్ దీవులు పరిశీలించిన డార్విన్, వాటిని చాలా ప్రాముఖ్యత యిచ్చాడు. అక్కడ నివసించే వారు కేవలం వందలలోనే వున్నారు.
ఈ దీవులనుండి 26 రకాల పక్షులను డార్విన్ నమూనాగా సేకరించాడు.
తాబేళ్ళు మూడు రోజులలో 8 మైళ్ళు దూరం నడవగలవని డార్వినే గమనించాడు. ఒక పెద్ద తాబేలు 10 నిమిషాలలో 60 గజాలు నడచిందట. రోజంతా నడిస్తే 4 మైళ్ళు వెడుతుందట. తాబేళ్ళు చెవిటివని డార్విన్ గమనించాడు.
వివిధ దీవులలోని తాబేళ్ళు తేడాగా వున్నాయని కూడా డార్విన్ చెప్పాడు. అనేక బల్లులను కూడా డార్విన్ పరిశోధించాడు. పాములన్నీ హాని చెయ్యనివే వున్నాయన్నాడు.
గలపగాస్ దీవులు వాసులు తాబేలును బట్టి అది ఏ దీవికి చెందినదో చెప్పగలదని డార్విన్ గమనించాడు. దీవులలో వున్న వివిధ పక్షులను డార్విన్ పరిశీలించాడు.
పరిణామం పట్ల ఆసక్తి గలవారు గలపగాస్ దీవులకు యాత్రలు చేస్తున్నారు.
డార్విన్ చుట్టి వచ్చిన బీగల్ ఆస్ట్రేలియా, న్యూజిలండ్, తిరుగు ప్రయాణంలో మారిషస్ దీవులు, ఆఫ్రికాను చుట్టి సెయింట్ హెలెన్ దీవి క్షుణ్ణంగా గమనించారు.
ఐదేళ్ళ బీగల్ యాత్ర జయప్రదంగా, సుఖవంతంగా, విజ్ఞానపూరితంగా జరిగింది. డార్విన్ సేకరించి పంపిన వస్తువులన్నీ ఇంగ్లండుకు క్షేమంగా చేరాయి. డార్విన్ రాకముందే ఆయన ప్రయాణం గురించి ఇంగ్లండ్ లో ఆసక్తికర అంశాలు బయలుదేరాయి. బీగల్ ఓడ యాత్ర మానవ విజ్ఞానయానంలో కీలకమైంది.
ఇంగ్లండ్ తిరిగి వచ్చిన డార్విన్ తొందరపడి ప్రకటనలు చేయలేదు. నెమ్మదిగా అధ్యయనానికి పూనుకున్నాడు. లండన్ లో మూడేళ్ళపాటు గడపిన డార్విన్ పెళ్ళిచేసుకున్నాడు. సంతానం కలిగింది. డార్విన్ శాస్త్రీయ రంగంలో కోరల్స్ గురించి తప్ప, మిగిలినవి పక్కన పెట్టాడు. సమావేశాలకు వెళ్ళి శాస్త్రజ్ఞులను విన్నాడు. కొందరు సైంటిస్టులను కలిశాడు. హక్సలీవంటి వారితో సన్నిహితుడయ్యాడు.
లండన్ నగరం నుండి బయటపడి గ్రామీణ ప్రశాంత వాతావరణం వున్న చోట యిల్లు కొని, చుట్టూ తోట పెంచిన డార్విన్ జీవితమంతా విజ్ఞానయుతంగా గడిపాడు. ఇప్పుడది డార్విన్ అభిలాషులకు సందర్శన స్థలంగా మారింది. వివిధ వైజ్ఞానిక అంశాలపై డార్విన్ గ్రంథాలు రాస్తూ పోయాడు. జీవుల పుట్టు పూర్వోత్తరాలు మాత్రం ఆలశ్యంగా ప్రారంభించి జయప్రదంగా ముగించాడు. అది ప్రపంచ ఆలోచనా రంగాన్ని కదలించింది. మతాలు – ముఖ్యంగా క్రైస్తవ మంత వీపు చరచుకున్నది!
-మొదటి భాగం – నరిసెట్టి ఇన్నయ్య